Home ఎడిటోరియల్ పాకిస్థాన్‌లో ప్రభుత్వం మార్పు

పాకిస్థాన్‌లో ప్రభుత్వం మార్పు

Article about Modi china tour

పొరుగు పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికల్లో భారత్‌కు చెప్పుకోదగ్గ ఆసక్తికి ఆస్కారం లేదు. ఎందుకంటే, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అది సైన్యం నీడలో పని చేయాల్సిందే, భారత్ వ్యతిరేకత కొనసాగించాల్సిందే. భద్రతా వ్యవహారాల్లో సైన్యంతో విభేదిస్తే ఆ ప్రభుత్వానికి ఉద్వాసన తప్పదు. 71 ఏళ్ల పాకిస్థాన్ అస్థిత్వంలో సగం కాలానికి పైగా పరిపాలించింది సైనిక నియంతలే. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ఏ ప్రధానమంత్రీ పూర్తికాలం పూర్తి చేయలేదు. ప్రజాస్వామ్యయుతంగా అధికారం బదిలీ ఇది రెండవసారి మాత్రమే. కాబట్టి పాకిస్థాన్‌లో ప్రజాస్వామ్యం మనుగడ, ఎన్నికలు, ప్రభుత్వాలు సైన్యం నిర్దేశించిన పరిధుల్లోనే ఉంటాయి. బుధవారం జాతీయ అసెంబ్లీకి, నాలుగు రాష్ట్ర శాసన సభలకు (పంజాబ్, సింధ్, బలూచిస్థాన్, ఖైబర్ ఫక్తూన్‌ఖవా) నిర్వహించిన పోలింగ్‌లో 2013 ఎన్నికల్లోవలె 5050 శాతం ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం నమోదైన ఓటర్లు 10.6 కోట్లు. గురువారం సాయంత్రం వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం జాతీయ అసెంబ్లీలో మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలోని పాకిస్థాన్ తెహ్రిక్ ఎ ఇన్సాఫ్ మెజారిటీకి చేరువలో ఉంది. 76 సీట్లు గెలుపొంది, మరో 43 సీట్లలో ఆధిక్యతలో ఉంది. పాకిస్థాన్ మాజీప్రధాని నవాజ్ షరీఫ్ (ప్రస్తుతం జైల్లో ఉన్నారు)కు చెం దిన పాకిస్థాన్ ముస్లిం లీగ్ ఎన్ 43 సీట్లు గెలుపు, 20 సీట్లలో ఆధిక్యతతో సుదూర రెండవ స్థానంలో ఉండగా, భుట్టోలకు చెందిన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ 18 సీట్లు గెలుపు, 19 సీట్లలో ఆధిక్యతలో ఉంది. అవసరమైతే ఈ పార్టీ ఇమ్రాన్‌ఖాన్ పిటిఐకి తోడ్పాటివ్వవచ్చు.
పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో సీట్ల సంఖ్య 342. వాటిలో 272 స్థానాలకు ప్రతినిధులను ఓటర్లు నేరుగా ఎన్నుకుంటారు. మిగతా వాటిలో 60 సీట్లు మహిళలకు, 10 సీట్లు మతమైనారిటీలకు రిజర్వు. 5 శాతంపైగా ఓట్లు పొందిన పార్టీలకు వాటికి లభించిన ఓట్ల దామాషాలో రిజర్వు సీట్లు కేటాయించబడతాయి. అందువల్ల 172 సీట్లు గెలిచిన పార్టీయే ప్రభుత్వం ఏర్పాటు చేయగలుగుతుంది.
జాతీయ అసెంబ్లీలో సగం స్థానాలు గలిగిన పంజాబ్ నవాజ్ షరీఫ్ కుటుంబానికి కంచుకోట. అలాగే సింధ్ భుట్టోలకు తిరుగులేని స్థావరం. మిగతా రెండు రాష్ట్రాలు బహు చిన్నవి. కాగా ఖైబర్ ఫక్తూన్‌ఖవాలో మాత్రమే అధికారంలో ఉన్న ఇమ్రాన్‌ఖాన్ పిటిఐ పంజాబ్‌లో నవాజ్ షరీఫ్ పిఎంఎల్‌కు పోటాపోటీ ఫలితాలు సాధించటం ప్రధాని పదవి అధిష్టించేందుకు ఖాన్‌కు బాటవేసింది. సింధ్‌లో భుట్టోల ప్రాబల్యం చెక్కుచెదరలేదు.
పాకిస్థాన్ సైన్యం ఈ పర్యాయం ఇమ్రాన్‌ఖాన్‌ను ఎంచుకోవటం బహిరంగ రహస్యం. సైన్యం, న్యాయ వ్యవస్థ కుమ్మక్కయి ప్రజాస్వామ్య ప్రక్రియను శాసించాయి. సైన్యం ఎన్నికల ప్రచార కాలంలో మీడియా గొంతు నొక్కింది. ఖాన్ ప్రచారానికి తోడ్పడింది. పోలింగ్ సమయంలో పోలింగ్ బూత్‌ల వెలుపలే కాదు, లోపల కూడా సైనికులను ఉంచింది. ఎన్నికల్లో రిగ్గింగ్‌కు పాల్పడి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఇతర పక్షాలు ఆరోపిస్తున్నాయి. ‘ధైర్యంగా ఇళ్లనుంచి బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకుని పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్న శత్రువులను ఓడించండి’ అని సైన్యాధిపతి జనరల్ క్వమర్ జావెద్ బాజ్వా ఉదయం తాను ఓటు చేసిన తదుపరి ఓటర్లకు విజ్ఞప్తి చేయటం, పోలింగ్ ముగిశాక ‘అన్ని రకాల దుర్బుద్ధిపూర్వక ప్రచారాన్ని తిప్పికొట్టారంటూ’ అభినందించటం సైన్యం పర్యవేక్షణ కిందనే ఎన్నికలు జరిగినట్లు విదితం చేస్తున్నది. ఎన్నికలు సజావుగా నిర్వహించటం తాత్కాలిక ప్రధాని, ఎన్నికల కమిషన్ బాధ్యత.
సాంప్రదాయక మత పార్టీలు ఎప్పటివలె కొన్ని సీట్లు గెలిచినా, ముంబయిపై టెర్రరిస్టు దాడి వ్యూహకర్త హఫీజ్ సయీద్ నాయకత్వంలోని నిషేధిత జమాత్ ఉద్ దవాకు చెందిన అభ్యర్థులు చిత్తుగా ఓడిపోవటం గమనించదగిన పరిణామం. అయితే టెర్రరిస్టులు మనుషులేనని భావించే ఇమ్రాన్‌కు “తాలిబన్ ఖాన్‌” అనే పేరుంది. సైన్యం ముఖంలో చిరునవ్వును ఆస్వాదించే ఖాన్ కొద్ది రోజుల క్రితం “మోడీ పాకిస్థాన్ శత్రువు” అన్నాడు. ఏదిఏమైనా, భారత్ పాకిస్థాన్ సంబంధాల్లో ప్రతిష్టంభన కొనసాగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. టెర్రరిస్టుల ఆశ్రయాలను నిర్మూలించాలని అంతర్జాతీయ సమాజం ఒత్తిడి, అస్తుబిస్తుగా ఉన్న ఆర్థికవ్యవస్థ పునరుద్ధరణ, అంతర్గత టెర్రరిజాన్ని అణచివేయటం కొత్త ప్రభుత్వం ఎదుర్కొనున్న తక్షణ సవాళ్లు.