Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

ఆదివాసీల సమస్యలపై ప్రభుత్వం దృష్టి

aadivasi

*ప్రజా దర్బార్‌లో మంత్రి జోగు రామన్న వెల్లడి

మన తెలంగాణ/ ఆదిలాబాద్ : ఆదివాసీ గిరిజనులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని వారికి న్యాయం చేసే దిశగా చర్యలను ప్రారంభించిందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగురామన్న వెల్లడించారు. నాగోబా దర్బార్ సందర్భంగా శుక్రవారం ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా ఆలయంలో ఎంపి గోడం నగేష్, జడ్‌పి చైర్‌పర్సన్ శోభారాణి, జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్, ఐటీడీఏ పిఓ ఆర్‌వి కర్ణన్, జిల్లా ఎస్‌పి విష్ణు ఎస్ వారియర్‌లతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అతిథులను పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. అనంతరం జరిగిన దర్బార్‌కు హాజరైన 9 ఆదివాసీ గిరిజన సంఘాల నాయకులు మాట్లాడుతూ లంబాడాలను ఎస్‌టి జాబితాలో కొనసాగించడం ద్వారా ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రంగాలలో జరుగుతున్న అన్యాయాలను వివరించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మంత్రి జోగురామన్న మాట్లాడుతూ జిల్లాలోని గిరిజన గ్రామాలను, ఆదివాసీ గిరిజనులను అన్నిరంగాలలో అభివృద్ధి చేసేందుకు శాశ్వత చర్యలు తీసుకుంటుందని అన్నారు. వివిధ రంగాలలో ఆదివాసీలకు అన్యాయం జరుగుతున్న విషయాన్ని సైతం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, దీనిని నివారించేందుకు అవసరమైన చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ అంశం సున్నితమైంది కావడంతో వెంటనే నిర్ణయాన్ని తీసుకోలేక పోతున్నామని, శాంతియుతంగా ఉద్యమాన్ని నడిపించి తమ న్యాయమైన హక్కుల కోసం పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ఆదివాసీలు సాగు చేస్తున్న పోడు, అటవీ భూములకు సంబంధించి సమగ్ర సర్వే నిర్వహించి వ్యవసాయం కోసం ప్రభుత్వం ప్రకటించిన సాయాన్ని అందచేస్తామన్నారు. ప్రభుత్వం ఆదివాసీలకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తుందని హామీ ఇచ్చారు. జడ్‌పి చైర్‌పర్సన్ శోభారాణి మాట్లాడుతూ ప్రతి ఆదివాసీ బిడ్డ విద్యావంతులై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలని పిలుపునిచ్చారు. ఎంపి గోడం నగేష్ మాట్లాడుతూ ఆదివాసీలకు జరుగుతున్న అన్యాయంతో పాటు సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని వెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ మాట్లాడుతూ ఆదివాసీ సాంప్రదాయాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని, తనను తమ ఆడపడుచుగా ఆదరించడం గొప్ప అనుభూతినిచ్చిందన్నారు. ఆవేశం ఉన్నప్పటికీ ఆదివాసీలలో ప్రేమాభిమానాలు సైతం ఎక్కువగానే ఉంటాయని కొనియాడారు. ప్రతి ఆదివాసీ కులానికో ఆచారం ఉండడం, వాటిని తూచా తప్పకుండా పాటించడం ప్రత్యేకతగా చెప్పుకోవచ్చన్నారు. జల్, జమీన్, జంగల్‌తో పాటు ఉద్యోగాలను సాధించే దిశగా ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. ఆదివాసీల సమగ్రాభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
గంటలోనే ముగిసిన దర్బార్…
మానవ పరిణామ శాస్త్రవేత్త హైమన్‌డార్ఫ్ ఆదివాసీలపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి నాగోబా జాతరలో దర్బార్‌ను ప్రారంభించారు. అప్పటి నుంచి అంటే 63 సంవత్సరాలుగా కొనసాగుతున్న కేస్లాపూర్ నాగోబా దర్బార్‌కు అత్యంత ప్రాధాన్యత ఉంది. జిల్లాలోని గిరిజనులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఈ దర్బార్‌లో అధికారులు, ప్రజా ప్రతినిధులకు తెలియచేయడం, వాటిని పరిష్కరించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు చర్చించి నిర్ణయాలు తీసుకోవడం జరిగేది. అయితే గత కొన్ని నెలలుగా ఆదివాసీలు, లంబాడీల మధ్య ఏర్పడిన వివాదం కారణంగా ఈ సారి నిర్వహించిన దర్బార్‌ను తూతూ మంత్రంగా నిర్వహించి చేతులు దులుపుకున్నారనే ఆరోపణలున్నాయి. ఉదయం 10 గంటలకే దర్బార్‌ను ప్రారంభించి గంట సేపు మాత్రమే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 9 ఆదివాసీ కులాలకు చెందిన ప్రతినిధులకు మాట్లాడే అవకాశం కల్పించారు. ఇక లంబాడీ సామాజిక వర్గానికి చెందిన ఖానాపూర్, బోథ్ ఎంఎల్‌ఎలు రేఖాశ్యాంనాయక్, రాథోడ్ బాపూరావ్‌లకు కనీసం ఆహ్వానాన్ని సైతం పంపలేదని అంటున్నారు. జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు చెందిన గిరిజనులు దర్బార్‌కు వచ్చే సమయానికే దర్బార్‌ను ముగించి కేవలం ఆర్జీల స్వీకరణ కోసం కౌంటర్లను ఏర్పాటు చేయడం పట్ల ఆదివాసీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఆర్జీల స్వీకరణ కోసం ఏర్పాటు చేసిన కౌంటర్లలో అందచేసిన దరఖాస్తులలో ఎక్కువ శాతం లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించి తమకు న్యాయం చేయాలని కోరుతూ అందచేసిన వినతులుండడం గమనార్హం.

Comments

comments