Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

12 వంతెనలు: 56.50 కోట్లతో నిర్మాణం

Government Green signal to 12 bridges build in vikarabad

వికారాబాద్: జిల్లాలో శిథిలావస్థకు చేరిన వంతెనల నిర్మాణానికి మోక్షం లభించింది. రూ.56.50 కోట్ల వ్యయం చేసి 12 చోట్ల వంతెనలను పూర్తి చేయనున్నారు. ప్రస్తుతం మూడు ప్రాంతాలలో భారీ వంతెనల నిర్మాణాలు చకచకా సాగుతున్నాయి. మిగిలిన 9 బ్రిడ్జిలకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేశారు. రోడ్లు భవనాలశాఖ ఆధ్వర్యంలో యేడాది క్రితమే తాండూరు పరిసరాలలో కాగ్నా నదిపై రూ.16.50 కోట్లతో భారీ వంతెన పనులు ప్రారంభించారు. మరో ఆరు నెలల్లో వంతెనను పూర్తి చేయనున్నారు. తాండూరు నుంచి మహబూబ్‌నగర్ వెళ్లే అంతర్ రాష్ట్ర రహదారిపై ఐదు దశాబ్ధాల క్రితం నిర్మించిన వంతెన యేడాదిన్నర క్రితం వరదల్లో కొట్టుకుపోయింది. దాని స్థానంలో తాత్కాలికం మరమ్మతులు చేసి రవాణా వ్యవస్థను పునరుద్ధరించారు. మంత్రి మహేందర్‌ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని రూ.16.50 కోట్లను మంజూరు చేయించారు. ప్రస్తుతం 70 శాతం పనులు పూర్తి చేశారు. 2019 జనవరి నాటికి వంతెన ఉపయోగంలోకి రానున్నది. ముంబాయి, బెంగుళూరు తదితర రాజధాని కేంద్రాలకు అనుసంధానం చేస్తే ఈ రహదారిపై రవాణా వ్యవస్థ మరింత మెరుగు పడుతుంది. బషీరాబాద్ మండలం జీవన్గిలో రూ.9 కోట్ల వ్యయంతో కాగ్నా నదిపై మరో భారీ వంతెన నిర్మాణం చేపడుతున్నారు. సుమారు రెండు దశాబ్ధాలుగా హామీలకే పరిమితమైన జీవన్గి బ్రిడ్జీకి యేడాది క్రితం మోక్షం లభించింది. పనులు చకచకా సాగుతున్నాయి.

తాండూరు నుంచి చించోలి వెళ్లే అంతర్‌రాష్ట్ర రహదారిపై కర్నాటక సరిహద్దున కొత్లాపూర్ వద్ద రూ.3 కోట్లతో మరో వంతెన పనులు ప్రారంభించనున్నారు. ఇప్పటికే టెండర్లను పూర్తి చేశారు. వికారాబాద్ నుంచి తాండూరు వెళ్లే ప్రధాన రహదారిపై మన్సాన్‌పల్లి, కందెనెల్లి ప్రాంతాలలో మూడు చోట్ల వంతెనల నిర్మాణానికి రూ.11 కోట్లు మంజూరు చేశారు. ఈ పనులకూ టెండర్లను పూర్తి చేశారు. వర్షాకాలం ముగిసిన తర్వాత పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం రహదారి విస్తరణ పనులు సాగుతున్నాయి. మోమిన్‌పేట నుంచి శంకర్‌పల్లి వెళ్లే ప్రధాన రహదారిపై ఆరు చోట్ల భారీ కల్వర్టుల నిర్మాణానికి రూ.9 కోట్లు మంజూరు చేశారు. ఈ పనులకూ టెండర్లు నిర్వహించారు. హైదరాబాద్ నుంచి శంకర్‌పల్లి మీదుగా మర్పల్లి వెళ్లే ప్రధాన రహదారి ఇది. వికారాబాద్ నుంచి సిద్దులూరు మీదుగా తంగెడుపల్లి వెళ్లే రహదారిపై రూ.4 కోట్లతో మరో వంతెన నిర్మిస్తున్నారు. ఇలా జిల్లాలో ఒకేసారి ఇంత భారీ ఎత్తున వంతెనలకు నిధులు మంజూరు కావడం విశేషం. దశాబ్ధాల క్రితం నిర్మించిన పలు వంతెనలు శిథిలావస్థకు చేరగా వాటి స్థానంలో కొత్త వంతెనలు నిర్మిస్తున్నారు. కాంట్రాక్టర్లు, ఆర్‌అండ్‌బి అధికారుల మధ్య సమన్వయం నెలకొంటే పనులు వేగమంతంగా సాగుతాయి. ఈ పనులు నాణ్యతాయుతంగా జరిగేలా పర్యవేక్షించాల్సిన బాధ్యత ఆర్‌అండ్‌బి అధికారులపై ఉంది.

Comments

comments