Home జగిత్యాల సర్కార్ దవాఖానాలకు పూర్వ వైభవం

సర్కార్ దవాఖానాలకు పూర్వ వైభవం

govt-haspetal-image

మెరుగుపడ్డ వసతి సౌకర్యాలు
అందుబాటులోకి అన్ని రకాల వైద్య సేవలు
వైద్య సేవల కోసం క్యూ కడుతున్న జనం
రోజు రోజుకు పెరుగుతున్న ప్రసవాల సంఖ్య

మనతెలంగాణ/జగిత్యాల : జగిత్యాల జిల్లాలో 18 మండలాలు ఉండగా 10,45,000 జనాభా ఉన్నారు. జిల్లా కేంద్రంలో ఉన్న ప్రాంతీయ వైద్యశాల జిల్లా ఏర్పడిన నేపథ్యంలో జిల్లా ప్రధాన ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ అయింది. కోరుట్ల, మెట్‌పల్లి, ధర్మపురిలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. 17 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 151 సబ్ సెంటర్ల ద్వారా ప్రజలకు వైద్య సేవలందుతున్నాయి. అలాగే రోగులకు సకాలంలో ఆస్పత్రులకు తరలించి వైద్య సేవలందించేందుకు 108 వాహనాలు 6, 104 వాహనాలు 6, 102 వాహనాలు 6 పని చేస్తున్నాయి. ప్రభుత్వం అమ్మ ఒడి పథకం ప్రవేశపెట్టి సర్కార్ దవాఖానాల్లో ప్రసవం చేయించుకున్న వారికి ఆడపిల్ల పుడితే రూ.13 వేలు, మగ పిల్లాడు పుడితే రూ.12 వేలు ఇస్తోంది. సర్కార్ దవాఖానాలో ప్రసవం చేయించుకున్న వారికి రూ. 2 వేల విలువ చేసే తల్లి, పిల్లకు అవసరమయ్యే వస్తువులతో కూడిన కెసిఆర్ కిట్ అందిస్తోంది. వీటికి తోడు ప్రభుత్వాసుపత్రుల్లో మౌళిక వసతులు కల్పించడంతో పాటు సర్కార్ వైద్యం పేదలకు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ శరత్ తరచూ వైద్యాధికారులతో సమీక్షలు నిర్వహించడం, ఆస్పత్రులను ఆకస్మిక తనిఖీలు చేస్తూ వైద్యులు, సిబ్బంది పనితీరులో మార్పు తెచ్చారు. ప్రతి ఆస్పత్రిలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసి ఆస్పత్రులకు వైద్యులు, సిబ్బంది ఎప్పుడు వస్తున్నారు… ఎప్పుడు వెళ్తున్నారనేది జిల్లా ఉన్నతాధికారులు పరిశీలిస్తుండటంతో వైద్యులు, సిబ్బంది సమయానికి ఆస్పత్రులకు చేరుకుని వైద్య సేవలందిస్తున్నారు. దాంతో ప్రభుత్వ ఆస్పత్రుల వైపు జనం అడుగులు వేస్తున్నారు. నూతనంగా జిల్లాకు మాతా శిశు సంరక్షణ కేంద్రం మంజూరు కాగా జూలై 1న భవన నిర్మాణ పనులకు మంత్రి ఈటెల రాజేందర్, ఎంపి కవితలు శంకుస్థాపన చేయనున్నారు. ఆ భవనం పూర్తయితే మరింత మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.

రోగులతో కిటకిటలాడుతున్న ఆస్పత్రులు…
మొన్నటి వరకు మండల కేంద్రాల్లో జనం లేక వెలవెలబోయిన పిహెచ్‌సిలు సైతం వైద్య సేవల కోసం వచ్చే వారితో కిటకిటలాడుతున్నాయి. జిల్లా ఆస్పత్రిలో రోజుకు 500కు పైగా అవుట్ పెషెంట్లు వైద్య సేవలు పొందుతుండగా రోజుకు 200కు పైగా ఇన్‌పెషెంట్లుగా సేవలు పొందుతున్నారు. ఆస్పత్రిలో గదులు సరిపోక వరండాల్లో, ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ మంచాలు వేసి వైద్య సేవలందిస్తున్నారు. జిల్లా ఆస్పత్రిలో కిడ్నీ సంబంధిత వ్యాధి గ్రస్తుల కోసం ఇటీవల డయాలసిస్ యూనిట్ ఏర్పాటు చేసి సేవలందిస్తున్నారు. అందుబాటులో డయాలసిస్ సౌకర్యం లేక కరీంనగర్, హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు వెళ్ళాల్సి వచ్చేదని, తద్వారా తమ సమయం వృధా కావడంతో పాటు అధిక ఖర్చులు, ఆరోగ్య పరంగా ఇబ్బందులు ఉండేవని, జగిత్యాలలో ఏర్పాటు చేయడం వల్ల చాల సౌకర్యంగా ఉందని డయాలసిస్ రోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

గణనీయంగా పెరిగిన ప్రసవాలు….
అమ్మ ఒడి, కెసిఆర్ కిట్ పథకం, రూపాయి ఖర్చు లేకుండా మెరుగైన వైద్య సేవలు అందుతుండటంతో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కాన్పు చేయించుకుంటే తక్కువలో తక్కువగా రూ.20 వేలు ఖర్చవుతుండగా, ప్రభుత్వాసుపత్రుల్లో కాన్పు చేయించుకుంటే ఎలాంటి ఖర్చు లేకపోగా ప్రభుత్వం అమ్మ ఒడి పథకం ద్వారా రూ.12 వేల ఆర్థిక సాయం అందించడంతో పాటు రూ.2 వేల విలువ చేసే కెసిఆర్ కిట్‌ను అందిస్తోంది. వీటికి తోడు ప్రభుత్వాసుపత్రుల్లో సాధారణ కాన్పులకే ప్రాధాన్యతనిస్తున్నారు. తప్పని పరిస్థితుల్లోనే శస్త్ర చికిత్సలు చేస్తున్నారు. దాంతో 75 శాతం ప్రసవాలు ప్రభుత్వాసుపత్రుల్లోనే జరుగుతున్నాయి. జూన్ 2, 2017 నుంచి మే 31,2018 వరకు జిల్లాలో 14,757 ప్రసవాలు జరిగాయి. వాటిలో 9826 ప్రసవాలు ప్రభుత్వాసుపత్రుల్లో జరగగా, 4931 ప్రసవాలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో జరిగినట్లు వైద్యశాఖ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సేవలు పొందేందుకు వస్తున్న వారి సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో వైద్యులు, వైద్య సిబ్బంది కొరత వల్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. వైద్యులు, సిబ్బందిని పెంచడంతో పాటు జిల్లా ప్రధాన ఆస్పత్రిలో ఎమర్జెన్సీ సేవల కోసం ఐసియు యూనిట్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరముంది.