Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

చేనేత రంగాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వం

ngldసమస్యల పరిష్కారం కోసం బస్సుయాత్ర
23 నుంచి జులై 1వరకు 5 జిల్లాల్లో యాత్ర
తెలంగాణ చేనేత అఖిలపక్ష ఐక్యవేదిక కన్వీనర్ రమేష్
మోత్కూరు : చేనేత రంగంలోని కార్మికులు, చేనేత సంఘాలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరిం చడంలో కార్మికులను ఆదుకోవడంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని తెలంగాణ చేనేత అఖిలపక్ష ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ కూరపాటి రమేష్ ఆరోపించారు. ఆదివారం మోత్కూరు మండల కేంద్రంలోని చేనేత సహకార సంఘంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చేనేత రంగంలోని కార్మికులు , సంఘాలు ఎదుర్కొంటున్న సమస్యలు అధ్యయనం చేసి వాటి పరిష్కారంకోసం ఈనెల 23 నుంచి జులై 1వతేదీ వరకు చేనేత చైతన్య బస్సు యాత్రను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బస్సు యాత్రను ఈనెల 23న మహబూబ్‌నగర్ జిల్లాలోని రాజోళిలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ యాత్ర మహబూబ్‌నగర్, మెదక్, కరీంనగర్, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో టిఆర్‌ఎస్ చేనేత రంగాన్ని కాపాడుతామని ఇచ్చిన హామీలు ఇంతవరకు అమలు కావడంలేదన్నారు. చేనేత కార్మికుల సమస్యలను అధ్యయనం చేసి సమస్యలు పరిష్కరిస్తామన్న ప్రభుత్వం ఆవిధంగా ఎలాంటి చర్యలు చేపట్టలేదని అన్నారు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో చేనేతకు బడ్జెట్‌లో ఒక్కరూపాయి కూడా నిధులు విడుదల చేయలేదని తెలిపారు. ప్రభుత్వం అనుసరిస్తున్న చేనేత వ్యతిరేక విధానాలతో 45 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, గత 10రోజుల్లో నల్లగొండ జిల్లాలోని వెల్లంకి గ్రామంలో దొంత అంజయ్య, నార్కట్‌పల్లి మండలం పల్లెపహాడ్‌లో వనం ప్రభు అనే ఇద్దరు కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలిపారు. ఇవి ముమ్మాటికి ప్రభుత్వ హత్యలే అన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న చేనేత కార్మికులలకు రైతులకు ఇస్తున్న విధంగా రూ.6లోల ఎక్స్‌గ్రేషియో ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చేనేత అఖిలపక్షం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ధర్నా చేస్తే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చేనేత రంగానికి 15రోజుల్లో నిధులు కేటాయిస్తామని చెప్పి నేటికి 3నెలలు దాటినా నిధులు ఇవ్వలేదని విమర్శించారు. చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని సమస్యలపై పోరాటం చేసి పరిష్కరించుకుందామని కార్మికులకు తెలిపారు. జులై 1న నల్లగొండ జిల్లాలోని పోచంపెల్లిలో చేనేత చైతన్య బస్సు యాత్ర ముగింపు సంధర్భగా బహిరంగ సభను నిర్వహిస్తున్నామని ఆసభకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు, చేనేత అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులు హాజరవుతారని తెలిపారు. చేనేత చైతన్య బస్సు యాత్రను కార్మికులు విజయవంతం చేయాలని కోరారు. తెలంగాణ చేనేత అఖిలపక్ష ఐక్య వేదిక రాష్ట్ర కోకన్వీనర్ పాశికంటి లక్ష్మీనర్సయ్య మాట్లాడుతూ, చేనేత కార్మికులకు కనీస వేతనం అమలు కాకపోవడం వల్లే కార్మికులు రోడ్డున పడేప్రమాదం ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో మోత్కూరు చేనేత సహకారం సంఘం అధ్యక్షుడు జెల్ది రాములు, నాయకులు దోర్నాల గోపయ్య, కొక్కుల సత్యనారాయణ, కూరపాటి రాములు, పసునూరు చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

Comments

comments