Home తాజా వార్తలు రోడ్డు భద్రతపై దృష్టి

రోడ్డు భద్రతపై దృష్టి

Government is sirius action on road accidents

తరచూ సంభవిస్తున్న ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ 

మనతెలంగాణ/హైదరాబాద్ : జాతీయ రహదారులలో జరుగు తున్న రోడ్డు ప్రమాదాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించనుంది. ఇందులో భాగంగా రాష్ట్ర హైవేపై ప్రమాదాలను నివారించేందుకు సాఫ్ట్‌లైన్ల ఏర్పాటుపై వివరాలు సేకరిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ – కర్నూలు, హైదరాబాద్ -విజయవాడలతో పాటు హైదరాబాద్- -వరంగల్ నేషనల్ హైవేలపై సాఫ్ట్‌లైన్ల సంఖ్య మరింత పెంచాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయనున్నట్లు సమాచారం. రాష్ట్రం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన హైవేలలో అత్యధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయనిప్రభుత్వం భావిస్తోంది. జాతీయ ప్రధాన  రహదారిలోని కూడళ్ల వద్ద స్టాప్ లైన్లను ఏర్పాటు విషయంలో అప్రమత్తంగా ఉండాలని, దీంతో  వేగంగా ప్రయాణించే వాహనాలను నియంత్రించేందుకు కొంత మేరకు ఉపయోగపడుతాయని రోడ్ సేఫ్టీ అధికారులు పేర్కొంటున్నారు. ఇటీవల కాలం లో హైవేలపై తరుచూ రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది.

వాహనాలు అతివేగంగా రావడం వల్లే ప్రమాదాలు సంభవిస్తున్న విషయం విదితమే. అయితే  ప్రమాదాల నివారణకు పాటు పడాల్సిన రోడ్ సేఫ్టీ అధికారుల నిర్లక్షం కారణంగా ప్రమాదాల శాతం పెరుగుతోందని పలువురు పేర్కొంటున్నారు. హైవేలలోని టోల్ గేట్ నిర్వహకులే అన్నింటినీ చూస్తుండటంతో రోడ్ సేఫ్టీ అధికారులకు పెద్దగా పనిలేకుండా పోతోంది. ఇదిలావుండగా  జాతీయ రహదారిపై ప్రమాదాల నియంత్రణకు స్పీడు బ్రేకర్లను ఏర్పాటు చేసేందుకు నిబంధనలు అడ్డువస్తుండటంతో అధికారులు వెనకడుగు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రమాదాల నివారణకు సాఫ్ట్‌లైన్ల వైపు దృష్టిసారించాల్సి వస్తోంది. ఒక ఇంచు ఎత్తులో సాఫ్ట్‌లైన్లను ఏర్పాటు చేయడం వల్ల  వేగంగా వచ్చే వాహనాల స్పీడును తగ్గించవచ్చు. హైవేలలో ము ఖ్యంగా మలుపులు, కూడళ్ల వద్ద 8 నుంచి 10 వరకు సాఫ్ట్‌లైన్లను ఏర్పాటు చేయడం వాహనాలు నడిపే డ్రైవర్లు అప్రమత్తం కావడంతో పాటు అలర్ట్ అయ్యే అవకాశాలున్నాయి. ముఖ్యంగా సాఫ్ట్‌లైన్లు వచ్చిన చోట వాహనాలు కుదుపు గురికావడమే కాకుండా డ్రైవర్లు బ్రేకులను ఉపయోగించాల్సి ఉంటుంది.

ఈ తరహా సాఫ్ట్‌లైన్ల ఏర్పా టు వల్ల ప్రమాదాలను పూర్తి స్థాయిలో నివారించలేనప్పటికీ హైవేలలో వాహనాల వేగాన్ని తగ్గించేందుకు ఉపకరిస్తాయని అక్షర సత్యం. దీంతో రాష్ట్ర ప్రభుత్వం హైవేలలో ప్రమాదాలను నియం త్రించేందుకు ప్రస్తుతం చేపట్టాల్సిన చర్యలపై దృష్టిసారిస్తోంది. ఇందులో భాగంగా సాఫ్ట్‌లైన్ల ఏర్పాటు కొంతమేర ప్రమాదాలను తగ్గుముఖం పట్టించవచ్చన్న అధికారుల ఆలోచనలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది.  రాష్ట్ర వ్యాప్తంగా ఏయే రహదారుల్లో ఎక్కువగా ప్రమాదాలు జరిగాయి? ఎందుకు జరిగాయి? అన్న పలు కారణాలను పరిగణలోకి తీసుకుంటోంది. ఇదిలావుండగా రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రస్తుతం పోలీస్ శాఖలో రోడ్ సేఫ్టీ వింగ్ పనిచేస్తోన్న విషయం తెలిసిందే. కాగా రోడ్‌సేఫ్టీ విభాగంలో చాలీచాలని సిబ్బందితో ఆ శాఖ పూర్తిస్థాయిలో పనిచేయడం లేదన్న అవవాదులున్నాయి.

సరైన  సిబ్బంది లేని కారణంగా సమర్ధవంతంగా విధులు నిర్వహించలేకపోతున్నామని ఆశాఖలోని సిబ్బంది బహిరంగంగా పేర్కొంటుండటం విచారకరం. 07/2017 సంవతసరం, జి.వొ నం.121 ప్రకారం రోడ్ సేఫ్టీ విభాగానికి 1170మంది సిబ్బందిని కేటాయించాలని నివేదికలు సంబంధిత శాఖ అధికారులకు ఇచ్చినట్లు సమాచారం.  రాష్ట్రవ్యాప్తంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాలలో రోడ్‌సేఫ్టీ పోలీస్‌స్టేషన్లను ఏర్పాటు చేస్తే కొంతమేర ప్రమాదాలను నివారించవచ్చని తాము నివేదికలో పేర్కొన్నామని రోడ్ సేఫ్టీ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. తాజాగా  రాష్ట్రవ్యాప్తంగా జాతీయ, రాష్ట్ర రహదారుల్లో ఎక్కువగా ప్రమాదాలు చోటుచేసుకునే 28 ప్రాంతాలను గుర్తించామని,  ఆయా ప్రాంతాలలో సాఫ్ట్‌లైన్లను ఏర్పాటు చేయడమే కాకుండా అక్కడ రోడ్‌సేఫ్టీ పోలీస్‌స్టేషన్లను ఏర్పాటు చేయాలని సర్కారుకు నివేదించిన నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.