Home ఖమ్మం కబ్జాకు కాదేదీ అనర్హం

కబ్జాకు కాదేదీ అనర్హం

Lands-Kabjhaమన తెలంగాణ/కొత్తగూడెం: కొత్తగూడెం పరిధిలోని సి-క్లాస్ క్వార్టర్స్, సెయింట్ మేరి స్కూల్, మరో ప్రైవేట్ భవనం మధ్యన ఉన్న స్థలం కబ్జాకు గురైంది.  వివరాల్లోకి వెళితే ఓ ప్రైవేట్ భవనం వెనుక గత నలబై సంవత్సరాలు ట్రాన్స్‌ఫార్మర్ ఉండేది.  భవనానికి సంబంధించిన కొందరు అక్రమార్కులు ట్రాన్స్‌ఫార్మర్‌ను తొలగిస్తే ఆ స్థలం తమ భవనంలోకి కలుపుకోవచ్చనే దురుద్దేశంతో ట్రాన్స్‌ఫార్మర్‌ను వివిధ కారణాలతో వేరే స్థలంలోకి మార్పించారు. ట్రాన్స్‌ఫార్మర్ మార్పు కొరకు ఏకంగా విద్యుత్ లైన్‌నే దారి మళ్లించారు. ఇదిలా ఉండగా గతంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌కు రెండు గట్టి స్థంభాలకి బిగించి ఉండేది. ఇప్పుడు ఉన్న కొత్త ట్రాన్స్‌ఫార్మర్ కేవలం ఒక స్థంబానికి మాత్రమే బిగించి ఉండటం వలన గతవారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఒక పక్కకు ఒరిగింది.దీంతో విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి.  ఆ సమయానికి విద్యుత్ సరఫరా లేకపోవడంతో  ప్రక్కనే వున్న షాపులకు, సి-క్లాస్ క్వార్టర్స్‌కు ప్రమాదం తప్పింది. ఈ ఘటన పూర్తిగా విద్యుత్ అధికారులు, కబ్జాదారుల వలనే జరిగిందని స్థానికులు అంటున్నారు. ఇప్పటికైనా ట్రాన్స్‌ఫార్మర్‌ను నాణ్యమైన స్థంభాలతో నిర్మించాలని చుట్టుపక్కల స్థానికులు అధికారులను కోరుతున్నారు.  కొత్తగూడెం జిల్లాగా మారుతున్న తరుణంలో ఖమ్మం రోడ్డుపై వున్న ఈ స్థలం లక్షల్లో విలువ చేస్తుంది అందుకే అక్రమార్కులు ఎటువంటి అడ్డదారులు తొక్కడానికి కూడా వెనుకాడటం లేదు. ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేయడానికి  పిట్టగోడ నిర్మాణం చేశారు. డేవిడ్ రాజ్ తెలంగాణ జెఎసి ఈ సంఘటన గురించి మాట్లాడుతూ నా చిన్నతనం నుండి పాత ట్రాన్స్‌ఫార్మర్‌కు విద్యుత్ సరఫరా ఉండేది కొన్నిరోజుల క్రితం కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌ను ఇరుకు స్థలంలో నిర్మించారు. ఇది ఖచ్చితంగా ట్రాన్స్‌ఫార్మర్ స్థలాన్ని భవనంలోకి కలుపుకునేందుకు చేస్తున్న కుట్రలో భాగమే. కారణం లేకుండా ట్రాన్స్‌ఫార్మర్ ను మార్చారు.  మార్చిన దానికి నాసిరకం స్థంబం ఏర్పాటు చేశారు.  ఇప్పటికైన ప్రభుత్వం స్పందించి ఈ స్థలంలో ప్రభుత్వ భూమి నోటిసుబోర్డు పెట్టి ఈ స్థలాన్ని కబ్జా దారుల నుండి కాపాడాలని అధికారులను కోరుతున్నారు.