Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

సభ బయట రైతు అవిశ్వాసం

edt

అవిశ్వాస తీర్మానం, రాహుల్ గాంధీ మోడీని ఆలింగనం చేసుకోవడం, రాహుల్ కన్నుగీటిన వార్త ఈ వార్తల మధ్య ఒక ము ఖ్యమైన సమాచారం కనుమరుగైపోయింది. అదేమంటే – పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన రోజునే దేశంలోని వివిధ ప్రాంతాల రైతులు ఢిల్లీ చేరుకుని అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. రైతు సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసించారు. ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కో ఆర్డినేషన్ కమిటీ ఈ ర్యాలీని నిర్వహించింది. లోక్‌సభలో ప్రవేశపెట్టవలసి ఉన్న రెండు బిల్లులు, రైతులకు సంబంధించిన బిల్లుల కోసం డిమాండ్ చేశారు. మోడీ త్రిపుల్ తలాక్ బిల్లు గురించి మాట్లాడినంత ఆవేశంగా రైతులకు అవసరమైన బిల్లుల గురించి ఎందుకు మాట్లాడడం లేదు?
చేతుల్లో నల్లజెండాలతో రైతులు మండీ హైస్ నుంచి పార్లమెంట్ స్ట్రీట్ వరకు ర్యాలీగా వెళ్ళారు. ఉత్పత్తి వ్యయానికి 50 శాతం ఎక్కువ గిట్టుబాటు ధర కోసం డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ అవసరమే లేదని, కొత్తగా ప్రవేశపెట్టిన కనీస గిట్టుబాటు ధర రైతులకు అవసరమైన ఆదాయం ఇచ్చేస్తుందని ప్రభు త్వం చెబుతోంది. రైతుల ఆదాయం పెంచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందని రాజ్ నాథ్ సింగ్ శుక్రవారం నాడు పార్లమెంటులో చెప్పా రు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపైపోతుందన్నారు. మోడీ ప్రభుత్వం చెబుతున్న చారిత్రాత్మక గిట్టుబాటు ధర ఒక చారిత్రాత్మక అబద్ధమని స్వరాజ్ ఇండియా నాయకుడు యోగేంద్రయాదవ్ అన్నారు. ఉత్పాదక వ్యయాన్ని లెక్కించడంలోనే తేడాలున్నాయి. రైతుకు క్వింటాలుకు 2,340 రూపాయలు రావాలి, కాని కేవలం 1750 మాత్రమే ఇస్తున్నారని యోగేంద్రయాదవ్ ఆరోపణ.
ఇటీవల ఛత్తీస్‌గఢ్‌కు చెందిన చంద్రమణి అనే మహిళ తన ఆదాయం రెట్టింపై పోయిందని ప్రధాని మోడీ గారి వీడియో కాన్ఫరెన్సులో చెప్పింది. ఆ తర్వాత ఎబిపి న్యూస్ చానల్ వాస్తవాలు తెలుసుకోడానికి వెళ్ళినప్పుడు ఆ మహిళ అధికారులు బలవంతం చేయడం వల్ల అలా చెప్పానని నిజాలు ఒప్పుకుంది. దీని గురించి వివరణాత్మకంగా చాలా వార్తలు వచ్చాయి. ఏది ఏమైనా రైతుల ఆదాయం పెరిగిపోయిందని చెప్పడం ఒక అబద్ధం.
ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీలో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 201 రైతు సంఘాలున్నాయి. 2017లో రైతు సమస్యల పరిష్కారానికి సమైక్య ప్రయత్నాల కోసం ఏర్పడింది. రైతుల ముఖ్యమైన డిమాండ్లు రెండే. రుణవిముక్తి, గిట్టుబాటు ధర. దేశవ్యాప్తంగా రైతులు ప్రభుత్వ విధానాల పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నారు. అనేక సంవత్సరాలుగా కొనసాగుతున్న నిర్లక్ష్యం రైతు సమస్యలకు కారణం. అయితే మోడీ ప్రభుత్వ విధానాల వల్ల కలిగిన నష్టం అన్నింటికన్నా ఎక్కువ. తమిళనాడు నుంచి పంజాబ్ వరకు రైతులందరూ గిట్టుబాటు ధర, రుణాల విషయంలో ఆందోళన చేస్తున్నారు. రైతుల ఆత్మహత్యలు, భూసేకరణలు, అడవి భూ ములు కబ్జా చేస్తున్న కార్పొరేట్లు ఇలాంటి అనేక కారణాలు రైతులను ఆందోళన బాట పట్టిస్తున్నాయి. బుల్లెట్ ట్రైన్ కోసం రైతుల భూములు లాక్కోవడంలో ఔచిత్యం ఎక్కడుంది?
ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ సమితి రెండు బిల్లులు రూపొందించింది. వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర బిల్లు 2018, రుణవిముక్తి బిల్లు 2018. ఈ రెండు బిల్లులు ప్రయివేటు మెంబర్ బిల్లులుగా పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో చర్చకు రావలసి ఉంది. తమ డిమాండ్లతో నవంబర్ 30న ముంబయి మాదిరి భారీ ర్యాలీ ఢిల్లీలో నిర్వహిస్తామని రైతు నాయకులు అంటున్నారు.
రైతులు రుణాల ఊబిలో చిక్కుకుపోయి ఉన్నారు. వ్యవసాయోత్పత్తులకు కనీస మద్దతు ధర లభిస్తే కొంతవరకు బతుకు బాగు చేసుకోవాలనుకుంటున్నారు. ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉండకూడదని భావిస్తున్నారు. ఈ బిల్లులను రైతు సంఘాలు, వివిధ పార్టీల నేతలతో సంప్రదించి సుదీర్ఘ చర్చల తర్వాత రూపొందించాయి. ఢిల్లీలో జరిగిన ఈ ర్యాలీ రైతు సమస్యలపై మొదటి ర్యాలీ కాదు. ఇంతకు ముందు ముంబయిలో భారీ ర్యాలీ జరిగింది. రాష్ట్రపతిని కలిసి మొరపెట్టుకున్నారు. వివిధ ప్రాంతాల్లో స్థానికంగా నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి.
పార్లమెంటులో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతుంటే పార్లమెంటు బయట రైతులు తమ అవిశ్వాసాన్ని ప్రకటించారు. వివిధ నినాదాలున్న ప్లాకార్డులు…. ఎంఎస్పీ అంటే మోడీ స్టయిల్ ప్రాపగాండ, రైతువ్యతిరేక మోడీ ప్రభుత్వం వద్దు, మోడీ ప్రభుత్వం రైతుల విశ్వాసం కోల్పోయింది వంటి ప్ల్లకార్డులు, నల్లజెండాలతో ప్రదర్శన జరిగింది. మోడీ ప్రభుత్వం ఇచ్చే గిట్టుబాటు ధర, స్వామీనాథన్ కమిషన్ ప్రతిపాదించిన గిట్టుబాటు ధరల తేడాలను కూడా రైతులు ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలో 1500 మంది రైతులు పాల్గొన్నారు. మహిళా రైతులు కేవలం 15 మంది మాత్రమే కనిపించారు. సుదీర్ఘ ప్రయాణం చేసి ఢిల్లీ చేరుకోవలసి వచ్చిందని, మహిళలకు పిల్లలను చూసుకునే బాధ్యత కూడా ఉంటుంది కాబట్టి చాలా మంది మహిళలు ఈ ర్యాలీకి రాలేకపోయారని తెలుస్తోంది. కాని, వ్యవసాయరంగంలో మహిళలు నేడు పెద్దసంఖ్యలో ఉన్నారు. భారతదేశంలోని మహిళల జనాభాలో మూడువంతులు వ్యవసాయరంగంలో ఉన్నట్లు తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయకూలీల్లో 74 శాతం మహిళలే. కాని దేశంలో కేవలం 12 శాతం భూమి మాత్రమే మహిళల యాజమాన్యంలో ఉంది. పొలంలేని వ్యవసాయ కూలీలను ప్రభుత్వం రైతులుగా గుర్తించదు. దీనివల్ల ఈ మహిళలు చాలా నష్టపోతున్నారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు వారికి లభించడం లేదు. రైతు ఆత్మహత్యల వల్ల అనేక మంది మహిళలపై బాధ్యతలు పెరిగాయి. ఆర్థికభారం వారి భుజాలపై పడింది. మహిళలుగా పురుషాధిక్యత వల్ల తలెత్తే సమస్యలను కూడా వారు ఎదుర్కోక తప్పడం లేదు. స్వామినాథన్ 2011లో ప్రయివేటు బిల్లు రూపంలో విమెన్ ఫార్మర్ ఎన్ టైటిల్మెంట్ బిల్లు ప్రవేశపెట్టారు. దీనివల్ల మహిళా రైతులకు చాలా ప్రయోజనాలు లభిస్తాయి.
రైతు సమస్యలు ప్రధానంగా మహిళల సమస్యలు ఎందుకంటే వ్యవసాయరంగంలో వారే ఎక్కువ. అందుకే మేధాపాట్కర్ ఈ ర్యాలీలో మహిళలు తక్కువగా కనబడడానికి కారణం కేవలం సంస్థాగతంగా ర్యాలీ కోసం హడావిడీగా నిర్ణయించడం వల్ల, కుటుంబ బాధ్యతల భారం ఎక్కువగా మోసే మహిళలు రాలేకపోయారని, రైతు సమస్యలంటే మహిళల సమస్యలేనని అన్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు మోడీ ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లాభసాటి ధర ప్రకటించానని మోడీ ప్రభుత్వం చెబుతోంది. కాని ఎక్కడుందీ ఆ ధర అని ప్రశ్నిస్తున్నారు. చెరకు రైతుల సమస్యల పరిష్కారానికి కేంద్రప్రభుత్వం 7000 కోట్ల రూపాయల ప్యాకేజి ఇటీవల ప్రకటించింది. ఆ సహాయం కూడా మొత్తం మిల్లులకే వెళ్ళిందని రైతులు వాపోతున్నారు. పార్లమెంటు బయట రైతులు ప్రకటించిన అవిశ్వాసమిది. పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం సందర్భంగా రైతుల సమస్యపై నాయకులు ఎంత సేపు మాట్లాడారన్నది ఒకసారి గుర్తు చేసుకుంటే, రైతు సమస్యలకు భారతరాజకీయాలు ఎంత ప్రాము ఖ్యం ఇస్తున్నాయో అర్ధమవుతుంది.

* ప్రవీణ్‌కుమార్ 

Comments

comments