Home తాజా వార్తలు చేనేతకు ప్రభుత్వం చేయూత

చేనేతకు ప్రభుత్వం చేయూత

Government support to handloom workers in state

పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్

మన తెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్రంలో చేనేత కార్మికుల నైపుణ్యం పెంచటానికి ప్రభుత్వం చేస్తున్న కృషి సత్ఫలితాలిస్తోందని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేష రంజన్ వెల్లడించారు. దీనికి మైక్రోసాఫ్ట్, నిఫ్ట్ లాంటి సంస్థలు ఇస్తున్న తోడ్పాటు అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిప్ట్ ) సంస్థలు సంయుక్తంగా రూపొందించిన క్యాడ్, కలర్ ఫర్ హ్యాండ్లూమ్ వీవింగ్ శిక్షణా కార్యక్రమం ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. హైదరాబాద్ నిఫ్ట్ ప్రాంగణంలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చేనేత వస్త్రాల విక్రయం కోసం మైక్రోసాఫ్ట్ రూపొందించిన ‘రివైవ్’ ఆన్‌లైన్ పోర్టల్‌ను ఆయన ప్రారంభించారు. సంవత్సరం నుంచి చేనేత కార్మికులకు ఇస్తున్న శిక్షణ పురోగతి సాధిస్తోందని, కొత్త డిజైన్లతో వస్తున్న చేనేత వస్త్రాలకు మంచి డిమాండు కూడా ఉందని జయేష్ రంజన్ వెల్లడించారు.

రాష్ట్రవ్యాప్తంగా 13 క్లష్టర్లు ఉంటే ఐదింటిలో శిక్షణ సాగుతోందని, మిగిలిన వాటిలో కూడా త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. కనుమరుగవుతున్న చేనేత కళకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు మైక్రోసాఫ్ట్ కృషిచేస్తోందని కార్యక్రమంలో పాల్గొన్న ఆ సంస్థ బిజినెస్ మేనేజ్‌మెంటు డైరెక్టరు చిత్రాసూద్ వెల్లడించారు. చేనేత కార్మికుల్లో నైపుణ్యం పెంపొందించి, ఆదాయ మార్గాలను రెట్టింపు చేయడం కోసం కృషిచేస్తున్నట్టు చెప్పారు. ఇందులో భాగంగా నిఫ్ట్‌తో కలిసి క్యాడ్, కలర్ ఫర్ హ్యాండ్లూమ్ వీవింగ్ శిక్షణా కార్యక్రమం రూపొందించినట్టు వివరించారు. అలాగే ఉత్పత్తులను విక్రయించుకొనేందుకు re-weav.in పేరుతో ఈకామర్స్ సైట్‌ను అందుబాటులోకి తెచ్చినట్టు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా క్యాడ్‌లో శిక్షణ పూర్తిచేసుకొన్న వందమంది చేనేత కార్మికులకు సర్టిఫికెట్లను పంపిణీ చేశారు.

Government support to handloom workers in state