Home సిద్దిపేట ధాన్యం సేకరణలో అతివల ముద్ర

ధాన్యం సేకరణలో అతివల ముద్ర

 Government to pay support price to farmers

మన తెలంగాణ/కోహెడ : రైతులు పండించిన పంటలను దళారులకు అమ్మి మోసపోకుండా ప్రభుత్వం రైతులకు మద్దతు ధర చెల్లించేందుకు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ప్రభుత్వం అయా బాధ్యతలను గ్రామైఖ్య సంఘాలకు, సహకార సంఘాలకు, మార్కెట్ కమిటీలకు అప్పగించింది. కాగా గ్రామాఖ్య సంఘాలకు చెందిన మహిళా స్వయం సహాయక సంఘాల బాధ్యులు ఇందిరాక్రాంతి పథకం సిబ్బంది సహకారంతో ధాన్యం కొనుగోళ్లలో తమదైన ముద్ర వేస్తూ కోహెడ మహిళా సంఘాల సభ్యులు, పురుషులకు దీటుగా రాత్రింబవళ్లు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణలో దూసుకెళ్తున్నారు. అతివలు ముందడుగు వేసి ప్రభుత్వం నుంచి గిట్టుబాటు ధర వచ్చేలా చేస్తున్నారు. దాన్యం తేమ, రైతులకు బార్ధాన్ అప్పగించడం, రైతుల నుంచి సేకరణ, సేకరించిన ధాన్యం వివరాల నమోదు తదితర పనులను చేపడుతూ ప్రశంసలు అందుకుంటున్నారు. ధాన్యం సేకరించడంతో పాటు రవాణా చేస్తూ తమ సత్తా చాటుతున్నారు. ఏటా ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణతో లక్షలాది రూపాయలు సంపాదించి ఆర్ధిక స్వాలంబన దిశగా అడుగులు వేస్తున్నారు.
సంఘాల పనితీరు.. కోహెడ మండలంలో 960 స్వయం సహాయక సంఘాలతో పాటు, 35 గామాఖ్య సంఘాలు ఉన్నాయి. ఇందులో 10,631 మంది సభ్యులున్నారు. ఏటా ఖరీఫ్, రబీ సీజన్‌లో రెండు నెలల పాటు కొనుగోలు కేంద్రాలు నిర్వహిస్తూ లక్షలాది రూపాయల ఆదాయంతో ఆర్ధిక స్వాలంబన సాదిస్తున్నారు. రైతుల నుంచి వేలాది క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేస్తూ వచ్చిన ఆదాయాన్ని అయా గ్రామ సంఘాల ఖాతాల్లో జమ చేసుకుంటూ అవసరమైన వారికి రుణాలు అందజేస్తూ ఆర్థ్దికంగా అభివృద్ధ్ది సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
7 కేంద్రాలు..200 మందికి ఉపాధి : మండలంలో ఐకెపి ఆధ్వర్యంలో శనిగరం, తంగళ్లపల్లి, కూరెల్ల, కోహెడ, బస్వపూర్, గుండారెడ్డిపల్లి, వరికోలు గ్రామాల్లో ఏటా రొటేషన్ పద్ధతిలో మహిళా సంఘాల సభ్యులు కొనుగోలు కేంద్రాల ద్వారా వేలాది క్వింటాళ్ల ధాన్యం కొనుగోల్లు చేస్తూ ధాన్యలక్ష్మిగా పేరు పొందుతున్నారు. ఈ కేంద్రాలలో సూమారు 200మంది హమాలీలు ఉపాధి పొందుతున్నారు. వీరికి క్వింటాల్‌కు రూ,20 చొప్పున చెల్లిస్తున్నారు. ధాన్యం కొనుగోలు కమిటీ సభ్యులుగా అయా గ్రామాల్లో స్వయం సహాయక గ్రూపులకు చెందిన 28 మందికి ఒక్కొక్కరికి నిత్యం రూ.200 చొప్పున చెల్లిస్తూ రెండునెలలు ఉపాధినిస్తున్నాయి.
రూ.13.58కోట్ల విలువైన ధాన్యం సేకరణ :
మండలంలోని ఏడు కొనుగోలు కేంద్రాల ద్వారా 1522 మంది రైతుల వద్ద 85,418 క్వింటాళ్ల వరి ధాన్యం కొనుగోలు చేయగా రూ.13,58,892లు నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేశారు. గతంలో రైతులు అప్పులు చేసి దళారులకు అడ్డికి పావుసేరు ధాన్యం విక్రయించుకునే రైతులకు వారి గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి రావడంతో పొలాల నుంచి పంటను నేరుగా కొనుగోలు కేంద్రానికే తరలించి విక్రయిస్తూ ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధరను పొందుతున్నారు. డబ్బులను నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేస్తున్నారు.
రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేశాం :
బందెల రేణుక, సిఎ, కూరెల్ల
ఏటా ఖరీఫ్, రబీ సీజన్లలో మా సంఘం తరుపున వరి ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. కొనుగోలు కేంద్రానికి రైతులు తెచ్చిన ధాన్యం తేమశాతం చూస్తూ, రైతుల ధాన్యం సకాలంలో కొనుగోలు చేస్తూ రైతులకు ఇబ్బందులకు లేకుండా చేశాం.ఈ రబీ సీజన్‌లో మా సెంటర్ నుంచి అత్యధికంగా 21,095 క్వింటాళ్ల వరి ధాన్యాన్ని కొనుగోలు చేశాం. ప్రభుత్వ సహకారం బాగుంది.
అన్ని పనుల్లో మేమే : పద్మ, సిఎ, వరికోలు
కొనుగోలు కేంద్రాల్లో అందరం మహిళలమే పని చేస్తాం, రాత్రింబవాళ్లు పని చేస్తూ రైతులు తీసుకువచ్చిన వరి ధాన్యం తూకం వేసి లారీల ద్వారా రవాణా చేస్తాం. గన్నీ సంచులు, లారీల కొరత వంటి సమస్యలు ఉంటే అధికారులకు తెలియజేస్తూ రైతుల సమస్యలను పరిష్కరిస్తాం. రానున్న రోజుల్లో మరింతగా ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ ఆదర్శంగా ఉంటాం.
సమర్థవంతంగా నిర్వహణ :
తిరుపతి, ఎపిఎం, కోహెడ
కొనుగోలు కేంద్రాల్లోకి రైతులు తెచ్చిన ధాన్యాన్ని సేకరించేందుకు మహిళలు సమర్థ్ధవంతంగా పనిచేస్తూ లక్షలాది రూపాయల ఆదాయం సమకుర్చుకుంటున్నారు. రైతులకు ప్రభుత్వం నుంచి వచ్చే మద్దతు ధరను చెల్లిస్తూ కొనుగోలు కేంద్రాల నిర్వహణతో వచ్చే డబ్బులు ఖర్చులు మినహాయించి అయా గ్రామ సంఘాల ఖాతాల్లోకి జమచేస్తూ సభ్యులకు రుణాలు ఇచ్చే ఆవకాశం ఏర్పడుతోంది. ఈ రబీ సీజన్‌లో వరిధాన్యం కొనుగోళ్ళలో జిల్లాలో మొదటి స్థానంలో నిలవడం ఆనందంగా ఉంది. ఇది మా మహిళల కృషి.