93,494 మందికి వర్తింపు
వివరాల సేకరణ షురూ
మన తెలంగాణ/ హైదరాబాద్ : ఆర్ఒఎఫ్ఆర్ (అటవీభూములపై హక్కులు కలిగిన) రైతులకూ రైతుబంధు జీవిత బీమాను విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అర్హులైనవారి నుంచి బీమా, నామినీ దరఖాస్తులు సేకరించాలని వ్యవసాయ శాఖ క్రిందిస్థాయి అధికారులకు ఆదేశాలు జారీచేసింది. ప్రస్తుతం కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు కలిగి, ఇటీవల రైతుబంధు చెక్కులు పొంది వయస్సు 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు ఉన్న రైతులందరి నుంచి వ్యవసాయ శాఖ విస్తరణ అధికారులు (ఎఇఒ) బీమా దరఖాస్తులు, నామినీ వివరాలను సేకరించా రు.
బీమా బాండ్ల పంపిణీ కూడా జరుగుతోంది. తొలుత ఆర్ఒఎఫ్ఆర్ పట్టాలు కలిగిన రైతులకు ‘రైతుబంధు’ చెక్కులను పంపిణీ చేసినప్పటికీ ‘రైతుబీమా’ విషయంలో మాత్రం స్పష్టమైన నిర్ణయం తీసుకోకుండా ఇంతకాలం పెండింగ్‌లో ఉంచింది. అయితే ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ ఇటీవల ఆర్ఒఎఫ్ఆర్ రైతులకూ రైతుబీమా వర్తింపజేసే విషయమై ప్రభుత్వానికి లేఖ రాయడంతో కెసిఆర్ పునస్సమీక్షించి ఆర్ఓఎఫ్ఆర్ రైతులకూ రైతుబీమా వర్తింపజేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో మొత్తం 93,494 మంది రైతులు ఆర్ఒఎఫ్ఆర్ పట్టాలు కలిగి దాదాపు 3 లక్షల ఎకరాల మేర సాగు చేసుకుంటున్నారు. ఇందులో ఎల్ఐసి నిబంధనలకు అనుగుణంగా వయస్సు 18 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు ఉన్నవారందరికీ రైతుబీమా పథకాన్ని వర్తింపజేయనున్నారు. ప్రభుత్వ నిర్ణయం తమకు మేలు చేస్తుందని ఆ రైతులు సంతోషాన్ని వ్యక్తంచేస్తున్నారు.
బీమా పూర్తి బాధ్యత ఎఇఒలదే !
రైతుబంధు జీవిత బీమా అమలు బాధ్యతను పూర్తిగా వ్యవసాయ విస్తరణ అధికారులదేనని ముఖ్యమంత్రి కెసిఆర్ శుక్రవారం స్పష్టంగా పేర్కొనడంతో వ్యవసాయ శాఖ ఇందుకు అనుగుణంగా క్రిందిస్థాయి సిబ్బందికి సర్కులర్ జారీ చేసింది. దురదృష్టవశాత్తు బీమా చేసుకున్న రైతు మరణిస్తే సంబంధిత నామినీకి రూ. 5 లక్షలు చేర్చాల్సింది ఎఇఒలేనని వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి. పార్థసారధి ఆ సర్కులర్లో స్పష్టం చేశారు. దీని ప్రకారం ప్రతీ వ్యవసాయ క్లస్టర్‌లోని ఎఇఒ బీమాలో నమోదైన రైతుల వివరాలన్నింటిని వెంట ఉంచుకోవాలని, దురదృష్టవశాత్తు బీమా చేసుకున్న రైతు మరణిస్తే, ఆయన మరణ సమాచారం దగ్గర నుంచి ధ్రువీకరణ పత్రాలన్నింటినీ ఇప్పించి వాటిని ఎల్ఐసికి పంపడంతో పాటు 10 రోజుల వ్యవధిలోనే రూ.5 లక్షల పరిహారం వారి చేతికి అందేలా చూసుకోవాల్సిన పూర్తి బాధ్యత కూడా ఎఇఒలదేనని ఆ సర్కులర్లో పేర్కొన్నారు.
సర్కులర్లోని వివరాలు
1 ప్రతి గ్రామంలో రైతులందరికీ అనువైన ప్రాంతంలో వ్యవసాయ విస్తరణ అధికారి ఫోన్‌నెంబర్‌ను ప్రదర్శించాలి.
2 క్లెయిమ్‌లకు సంబంధించిన దరఖాస్తులను ఎఇఒలు వెంటబెట్టుకోవాలి. అవసరమైతే వెబ్‌పోర్టల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి.
3 క్లెయిమ్ దరఖాస్తుకు అవసరమైన అన్ని పత్రాలు జత చేసి, ఆన్లైన్లోనే పంపాలి.
4 నామినీలకు సంబంధించి బ్యాంకు ఖాతాలు రెగ్యులర్‌గా ఉన్నాయో లేదో బ్యాంకులను సంప్రదించి ఎఇఒలే తెలుసుకోవాలి. జన్‌ధన్ ఖాతాకు రూ.5 లక్షలు జమ చేసే వీలు లేనందున, వచ్చే క్లయిమ్స్ సేవింగ్స్ ఖాతాలోకే వెళ్లేలా చూడాలి.