Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

రేపటి వరకే డీలర్లకు డెడ్‌లైన్!

governments decision to strike ration dealers was serious

మన తెలంగాణ/సంగారెడ్డి ప్రతినిధి : రేషన్ డీలర్ల సమ్మె యోచనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలకు నిత్యావసర సరుకులను అందించాల్సిందేనని, ఈ విషయంలో రాజీ పడేది లేదని హెచ్చరిస్తోంది. వచ్చే నెల 1 నుంచి రేషన్‌డీలర్లు తమ డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మెకు యోచిస్తున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. డీలర్ల సంఘం నేతలతో చర్చలు జరిగినప్పటికీ సమ్మె వైపుగానే వారి ప్ర యాణం సాగుతోంది. ఈ నేపథ్యంలో సంగారెడ్డి జిల్లాలో సమ్మెను నివారించడానికి జిల్లా యంత్రాంగం దృష్టిసారించింది. ఓ వైపు సమ్మె ను నివారించేందుకు ప్రయత్నిస్త్తూనే.. మరోవైపు సరుకుల రవాణాకు, సరఫరాకు, పంపిణీకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తోంది. సంగారెడ్డి జిల్లాలో పటాన్‌చెరు, ఆర్‌సి పురం, సంగారెడ్డి, జహీరాబాద్ లాంటి పట్టణ ప్రాంతాలే కాకుండా మారుమూల ప్రాంతాలు కూడా ఉన్నాయి. నారాయణ్‌ఖేడ్ నియోజకవర్గంలో అనేక మారుమూల పల్లెలున్నాయి.

దీంతో సమ్మె ప్రభావం అటు పట్టణాల్లో ఇటు పల్లెల్లో కూడా ఏమా త్రం ఉండకూడదని యంత్రాంగం భావిస్తోంది. ఈ మేరకు నిత్యావసర సరుకులను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఎంతైతే ఉందో, డీలర్లపై కూడా అంతేఉందని మంగళవారం స్పష్టం చేశారు. పేద ప్రజలకు సరుకుల పంపిణీని సామాజిక బాధ్యతగా భావించాలని ఈ విషయాన్ని డీలర్లు మరువరాదని సూచించారు. సరుకుల పంపిణీకి ఏమాత్రం ఆటంకం కలిగించినా.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పేదలకు నష్టం కలిగించినా.. కష్టం కలిగించినా.. ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని పేర్కొన్నారు. ఖచ్చితం గా గురువారం లోగా రేషన్ డీలర్లు ఎప్పటిలాగే తమ పరిధిలోని సరుకుల కోసం మీ సేవా కేంద్రాల్లో డీడీలు తీయాలని, రిలీజ్ ఆర్డర్ తీసుకోవాలని సూచించారు. నిర్దేశించిన గడువులోగా డీడీలు చెల్లించని డీలర్లను తొలగిస్తామని ఇంతకు ముందు ప్రభుత్వం స్పష్టం చేసినందున, అంత  వరకు రానివ్వవద్దని తెలిపారు. తెలంగాణ ప్రజా పంపిణీ వ్యవస్థ కంట్రోల్ ఆర్డర్ 2016 ప్రకారం ప్రజా ప్రయోజనాల కోసం ఏ డీలర్‌నైనా తొలగించే అధికారం ప్రభుత్వానికి ఉందని మంగళవారం డీలర్లకు స్పష్టం చేశారు. సమ్మె పేరుతో పేద ప్రజల నోటి కాడి ముద్దను అడ్డుకోవద్దని,  ఆహార భధ్రతను అమలు చేయాల్సిందేనని తెలిపారు.

డీలర్లు వినకపోతే ప్రత్యామ్నాయ మార్గాలకు సిద్దంగా ఉందని జిల్లా యంత్రాంగం పేర్కొంది. ఈ దిశలో చేస్తున్న ప్రయత్నాలను మరింత స్పష్టంగా తెలియజెప్పేందుకు మంగళవారం జిల్లా డీలర్లతో జాయింట్ కలెక్టర్ సమావేశమయ్యారు. పేద ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని చౌకధరల దుకాణాల ద్వారా అందిస్తున్న సరుకులు జులై 1 నుంచి ప్రజలకు పంపిణీ చేసి సహకరించాలని జాయింట్ కలెక్టర్ నిఖిల జిల్లా రేషన్ డీలర్ల సంఘం ప్రతినిధులను కోరారు. జేసి చాంబర్‌లో జిల్లా రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ప్రతినిధులు, పౌర సరఫరాల శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు.

రేషన్ డీలర్లకు గౌరవ వేతనం, కమీషన్ల పెంపు, పాత బకాయిల విడుదల తదితర సమస్యల పరిష్కరానికి జులై 1 నుంచి సమ్మె చేస్తామని రేషన్‌డీలర్లు ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలో చౌకధర దుకాణాల  ద్వారా సరుకులు పంపిణీ యదావిధిగా జరిగేలా సహకరించాలని డీలర్ల సంఘం ప్రతినిధులను ఆమె కోరారు. జులై నెల సరుకుల కోసం 24 గంటల లోపు డీడీలు కట్టాలని,  డీడీలు కట్టి సరుకులు ప్రజలకు పంపిణీ చేయాలన్నారు. జిల్లా యంత్రాంగం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టిసారించినట్లు జేసి తెలిపారు. డీలర్ల సంఘం జిల్లా  అధ్యక్షుడు అనంతయ్య మాట్లాడుతూ తమ సమస్య రాష్ట్రస్థాయిలో ఉన్నదని, రాష్ట్రస్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. తమ సమస్యలకు త్వరలోనే పరిష్కారం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీకాంత్‌రెడ్డి, సివిల్ సప్లయ్స్ డీఎం విజయ్‌కుమార్, డిప్యూటీ తహాశీల్దార్లు సత్తార్, సురేష్, వెంకటేశ్వర్లు, విరణ్, విష్ణువర్థన్, జిల్లా రేషన్ డీలర్స్  సంఘం సెక్రెటరి జయప్రకాశ్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments