Home ఎడిటోరియల్ మార్పుకు ఏజంట్లుగా గవర్నర్‌లు

మార్పుకు ఏజంట్లుగా గవర్నర్‌లు

Article about Modi china tour

దేశ ఫెడరల్ చట్రం, రాజ్యాంగ నిర్మాణం పరిధిలో కీలకపాత్ర వహించాల్సిన గవర్నర్‌లు కేంద్రంలోని పాలకపార్టీకి కళ్లు, చెవులుగా వ్యవహరించటం వల్ల గవర్నర్‌ల వ్యవస్థ అప్రతిష్ట పాలైంది. దాన్ని రద్దు చేయాలన్న డిమాండ్ కూ డా, కర్నాటకలో ఇటీవల పరిణామాలవంటివి సంభవించినపుడు ముందుకు వస్తుంటుంది. కేంద్ర రాష్ట్ర సంబంధాలపై నియమించబడిన జస్టిస్ సర్కారియా కమిషన్ గవర్నర్‌ల వ్యవస్థను కూడా పరిశీలించింది. కేంద్రంలో అనేక రాష్ట్రాల్లో వేర్వేరు పార్టీలు అధికారంలో ఉండటం, వాటి మధ్య ఘర్షణ తలెత్తటం ఆ కమిషన్ నియామకానికి అప్పటి నేపథ్యం. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు గవర్నర్‌లుగా నాటి కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం తమ నాయకులను నియమించి రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుకు ఆటంకాలు కలిగిస్తున్న తీరుపై ఫిర్యాదులను కమిషన్ పరిశీలించింది. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో వాటికి విరుద్ధమైన రాజకీయ నేతలను గవర్నర్‌లుగా నియమించకూడదని కమిషన్ సిఫారసు చేసింది. కాని కేంద్ర ప్రభుత్వం దాన్ని పాటించటం లేదు. కేంద్రంలో 2014 అధికారానికి వచ్చిన బిజెపి కూడా, కాంగ్రెస్ బాటలోనే తమ వృద్ధ నాయకులను లేదా తమ సైద్ధాంతిక అనుయాయులను గవర్నర్‌లుగా నియమించింది. గుజరాత్ బిజెపిలో సీనియర్ నాయకుడైన కర్నాటక గవర్నర్ వజూభాయి వాలా, మెజారిటీ తోడ్పాటులేని బిజెపి నాయకుడు యడ్యూరప్ప చేత ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించి, శాసనసభలో బల నిరూపణకు 15 రోజుల వ్యవధి ఇచ్చిన సందర్భంగా గవర్నర్ వ్యవస్థ మరోమారు తీవ్ర విమర్శలకు గురైంది.
ఈ నేపథ్యంలో గవర్నర్‌ల 49వ రెండ్రోజుల మహాసభను రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి రాం నాథ్ కోవింద్ సోమవారం ప్రారంభిస్తూ హితవులు చెప్పారు. గవర్నర్‌లు దేశ ఫెడరల్ స్వరూపంలో ముఖ్యమైన లింక్ మాత్రమేగాక, రాష్ట్ర ప్రభుత్వాలకు అనుభవశాలియైన సలహాదారు, మార్గదర్శి కూడా అని ఆయన చెప్పారు. “మన అభివృద్ధి ప్రయాణంలో ఆశించినంతగా లబ్ధిపొందని మన సహపౌరుల (గిరిజనులు, ఇతర బలహీన తరగతులు) జీవితాల మెరుగుదలకు రోడ్‌మ్యాప్ రూపొందించటంలో గవర్నర్‌లుగా మీరు సహాయపడవచ్చు” అన్నారు. యూనివర్శిటీల ఛాన్స్‌లర్‌లుగా గవర్నర్‌లు భారత యువతకు గార్డియన్‌లుగా వ్యవహరించాలని కోరారు. ప్రజలు గవర్నర్‌లను, రాజ్‌భవన్‌లను “విలువలు, ఆదర్శలకు” నిలయంగా చూస్తారని గుర్తు చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభ, ముగింపు సమావేశాల్లో చేసిన ప్రసంగం ఆసక్తిదాయకం. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలును పర్యవేక్షించాలని గవర్నర్‌లకు దిశా నిర్దేశం చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రధాన కార్యక్రమాల నుంచి ప్రజలకు మేలు జరిగేటట్లు చూడటానికి వారు తమ రాజకీయ, పరిపాలనా అనుభవాన్ని ఉపయోగించాలని కోరారు. విద్య, క్రీడలు, ఆర్థిక సేవలపై ప్రభుత్వ కార్యక్రమాల నుంచి గిరిజనులకు లబ్ధి చేకూరేలా చూడాలని గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాల గవర్నర్‌లకు సూచించారు. జాతీయ పౌష్టికాహార కార్యక్రమం, గ్రామీణ విద్యుద్దీకరణ, గ్రామ స్వరాజ్ అభియాన్ వంటి కార్యక్రమాలను ఆయన ప్రస్తావించారు. యువతను జాగృత పరిచేందుకు జూన్ 21న అంతర్జాతీ య యోగా దినోత్సవాన్ని ఛాన్సలర్ల హోదాలో గవర్నర్‌లు ఉపయోగించుకోవచ్చునన్నారు.
కేంద్ర ప్రభుత్వం రూపొందించి ఆర్థిక వ్యయాన్ని భరించే పథకాలను సైతం రాష్ట్రాల్లో అమలు చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలే. అయితే కేంద్ర పథకాలను తమ పథకాలుగా ప్రచారం చేసుకుంటూ రాష్ట్రంలోని పాలక పార్టీలు లబ్ధి పొందుతున్నాయనే దుగ్ధ కేంద్ర ప్రభుత్వంలో ఉంది. అంతేగాక 14వ ఆర్థిక సంఘం కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు పంపిణీని42 శాతానికి పెంచాక మోడీ ప్రభుత్వం కేంద్ర ప్రాయోజిత పథకాలకు పెద్ద కోత పెట్టింది. కేంద్ర ప్రభుత్వ పథకాల పర్యవేక్షణకు గవర్నర్‌లు ఏ రూపంలో ప్రయత్నించినా అది రాష్ట్రాల అధికారాల్లో కేంద్రం జోక్యంగా, పెత్తనంగా పరిగణించబడుతుంది. గవర్నర్‌లు రాజభవన్‌లను విశ్రాంతి కేంద్రాలుగా ఉపయోగించుకుంటూ ప్రభుత్వాలకు సుద్దులు చెప్పే పెద్దలుగా ఉన్నంతవరకు ఫరవాలేదు. రాజకీయ జోక్యానికి, కేంద్ర పథకాల పర్యవేక్షణకు పూనుకుంటే ప్రతిపక్ష పార్టీల ఏలుబడిలోని రాష్ట్రాల్లో ఘర్షణ తలెత్తకమానదు!