Home ఎడిటోరియల్ ప్రజలకు సాంత్వన ప్రధానం

ప్రజలకు సాంత్వన ప్రధానం

Special class status to Andhra Pradesh

జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో పిడిపి బిజెపి సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయిన తదుపరి విధించబడిన గవర్నర్ పాలన సాధారణ పరిస్థితులు పునరుద్ధరించగలుగుతుందా? ప్రజలకు సాంత్వన చేకూర్చగలుగుతుందా? రాష్ట్రంలోని ప్రత్యేక పరిస్థితుల దృష్టా వేచి చూడవలసిందే. గవర్నర్ పాలన అంటే కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష పాలన. మిలిటెన్సీనిబలప్రయోగంతో నిర్దాక్షిణ్యంగా అణచివేయటం కేంద్ర ప్రభుత్వ విధానమైనందున ప్రజలకు భద్రతా బలగాలకు మధ్య ఘర్షణలు ఎప్పుడైనా పునరుద్ధరణ పొందవచ్చు. కశ్మీర్‌లో మిలిటెన్సీ అణచివేతను దేశ సమైక్యత పరిరక్షణ సమస్యగా కేంద్ర ప్రభుత్వం పరిగణిస్తున్నది. పాకిస్థానీ ప్రేరేపిత సీమాంతర టెర్రరిజంతోపాటు అంతర్గత టెర్రరిజం తలెత్తటం కొత్త పరిణామం. దక్షిణ కశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో ‘ఇస్లామిక్ స్టేట్ జమ్మూ కశ్మీర్’ అనే సంస్థకు చెందిన నలుగురు మిలిటెంట్లను భద్రతా దళాలు మట్టుపెట్టటం గవర్నర్ పాలనలో తొలి పెద్ద ఆపరేషన్. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక పోలీసు, ఒక సివిలియన్ కూడా మరణించారు. అందువల్ల వాస్తవాధీన రేఖ దాటే టెర్రరిస్టుల చొరబాటును తిప్పికొట్టటం, అంతర్గత మిలిటెన్సీని అదుపు చేయటం, ప్రజలకు సాంత్వన చేకూర్చి వారి హృదయాలను గెలచుకోవటమన్నది గవర్నర్ పాలన ముందున్న కర్తవ్యాలు.
గవర్నర్ పాలన విధించిన సందర్భంగా గవర్నర్ ఎన్.ఎన్. ఓహ్రా వ్యాఖ్యలు ప్రాధాన్యత గలవి, తక్షణ కర్తవ్యాన్ని నిర్దేశిస్తున్నాయి. ‘కశ్మీర్‌లో యువత నిరాశోపహతులుగా ఉన్నారు. భద్రతా దళాలు ఆపరేషన్ నిర్వహించేటపుడు సాధారణ పౌరులకు కనీస నష్టం జరిగేలా జాగ్రత్త వహించాలి’. ఇవి వాస్తవ పరిస్థితిని ప్రతిబింబిస్తున్నాయి. పదేళ్లుగా జమ్మూ కశ్మీర్‌లో రాజ్యాంగ పదవిలో ఉన్న ఓహ్రాకు కశ్మీర్ పరిస్థితిలోని అన్ని కోణాలు తెలుసు. రాజకీయాలకు అతీతంగా సమభావంతో వ్యవహరిస్తాడన్న పేరుంది. ఆయన పదవీ కాలం జూన్ 25వ తేదీతో ముగియనుంది. కేంద్రం ఆయన పదవీ కాలం పొడిగిస్తుందా లేక ఆర్‌ఎస్‌ఎస్ బిజెపి భావజాలానికి దగ్గరగా ఉండే వ్యక్తిని కొత్త గవర్నర్‌గా నియమిస్తుందా వేచి చూడాలి. అయితే ఓహ్రాను పొడిగించటమే ప్రస్తుత పరిస్థితిలో ఉత్తమ మార్గం.
గవర్నర్ ఓహ్రా శుక్రవారం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి పరిపాలన నిరహణపై రాజకీయ పార్టీల ప్రతినిధుల సలహాలు కోరారు. హింసా మార్గం విడనాడేటట్లు యువతను ప్రోత్సహించాలని వారిని కోరారు. కశ్మీర్‌లో తుపాకులతో తరిమే విధానం పని చేయదని, మానవ హక్కులను పూర్తిగా పరిరక్షించాలని అక్కడి ప్రాంతీయ పార్టీలు చెప్పాయి. ప్రజలను హింసతో అణచివేసే విధానం ప్రతిఘటనను పెంచిందనే వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించాయి. సామాన్య ప్రజలకు ఉపశమనం చేకూర్చటం, వారు హింసకు ఎరగాకుండా చూడటం సాధారణ పరిస్థితుల పునరుద్ధరణకు ఎంతైనా అవసరం అని చెప్పాయి. సస్పెన్షన్‌లో ఉంచిన అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికల నిర్వహణకు అనువైన వాతావరణం సృష్టించాలని కోరారు. అన్ని అనుకూలిస్తే 2019 సార్వత్రిక ఎన్నికలతోపాటు ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల జరగవచ్చు. అయితే అసెంబ్లీకి ఇంకా రెండేళ్ల జీవం ఉన్నందున ఎమ్మెల్యేల కొనుగోళ్లకు అవకాశం లేకుండా అసెంబ్లీని రద్దు చేయటమే సరైంది.
టెర్రరిజాన్ని ఎదుర్కోవటానికి సైన్యానికిప్పుడు సహజంగానే సంపూర్ణ స్వేచ్ఛ లభించింది. ఆ స్వేచ్ఛను సంయమనంతో అవసరం మేరకే ఉపయోగించటం విజ్ఞత. అదే విధంగా రాజకీయ రంగంలో కేంద్ర ప్రభుత్వం సంయమనం కోల్పోకుండా అణచివేతకన్నా ప్రజలకు సాంత్వన చేకూర్చటానికి ప్రాధాన్యత ఇవ్వటం అవసరం. కశ్మీర్ పరిస్థితి ఎంతో సంక్లిష్టం. ప్రజల హృదయాలకు చేరువ కావాలంటే అన్ని విభాగాలతో చర్చలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. వేర్పాటువాద హురియత్ నాయకులు కూడా చర్చలకు ముందుకు రావటం ద్వారానే ప్రజలకు మేలు చేయగలుగుతారు. బిజెపి, పిడిపి, నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ రాజకీయ క్రీడకన్నా సాధారణ పరిస్థితుల పునరుద్ధరణకు కృషి చేస్తే ప్రజలకు ఉపశమనం చేకూరుతుంది. కశ్మీర్ సమస్యలో పాకిస్థాన్ అంశ నిరాకరించలేని వాస్తవం. వచ్చే నెలాఖరులో అక్కడ ఎన్నికల అనంతరం ఏర్పడే జాతీయ ప్రభుత్వంతో చర్చలకు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటే అది కూడా కశ్మీర్‌లో ప్రశాంతత పునరుద్ధరణకు సహాయకారి అవుతుంది.