Search
Saturday 22 September 2018
  • :
  • :

రైతుబంధు సొమ్ము స్వాహా

Govt Officials Illegally take money of Rait Bandhu

నల్లగొండ జిల్లాలో ఆధికారుల చేతివాటం, రూ.62 లక్షలు కాజేసినట్లు నిర్ధారణ  

హైదరాబాద్: అన్నదాతలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం పంపిణీ చేసిన రూ.61.99 లక్షల రైతుబంధు సొమ్మును అక్రమార్కులు కాజేశారు. రైతుకు రైతుబంధు నగదు అందేలా చూడాల్సిన నల్లగొండ జిల్లా రెవిన్యూ, బ్యాంకు అధికారులే ఈ డబ్బును స్వాహా చేసినట్లు ప్రభుత్వ అధికారుల దర్యాప్తులో నిర్ధారణైంది. వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్షం కూడా ఇందులో భాగమైనట్లు దర్యాప్తు బృందం అభిప్రాయపడింది. ఈ వ్యవహారంపై నల్లగొండ జిల్లా కలెక్టర్ డాక్టర్ గౌరవ్ గోపాల్ రాష్ట్ర ప్రభుత్వానికి సోమవారం నివేదికను సమర్పించారు. రైతుబంధు చెక్కుల పంపిణీలో నల్లగొండ జిల్లాలో అక్రమాలు చోటు చేసుకున్నట్లు ఆరోపణలు రావడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. రైతులకు అందాల్సిన పెట్టుబడి సొమ్ము బ్యాంకు, రెవిన్యూ అధికారులతో పాటు బయటి వ్యక్తులు అక్రమంగా కొట్టేసినట్లు విచారణలో వెల్లడైంది. గడిచిన మే నెల 10వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన రైతుబంధు చెక్కుల పంపిణీలో ఆర్‌ఒఎఫ్‌ఆర్ చెక్కులతో కలిపి మొత్తం 58.16 లక్షల మంది పట్టాదారులకు 58.81 లక్షల (రూ. 50 వేలు, ఆపైన ఉంటే రెండు చెక్కు ఇస్తారు) చెక్కులు ముద్రించారు. ఇందులో 51.11 లక్షల చెక్కులను రైతులకు పంపిణీ చేశారు. 7.70 లక్షల చెక్కులు పంపిణీ కాకుండా మిగిలిపోయాయి.

ఇందులో చనిపోయిన వారి పేరు మీద, భూమిని మొత్తం అమ్ముకున్న వారి పేర్ల మీద, విస్తీర్ణం ఉన్నదాని కంటే ఎక్కువ, తక్కువగా పడి మరికొంత మంది పేర్ల మీద చెక్కులు ముద్రితమయ్యాయి. వీటిపై అప్రమత్తమైన వ్యవసాయ శాఖ కొన్ని రైతుబంధు చెక్కులకు నగదును చెల్లించవద్దంటూ బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. ఆ చెక్కులను విత్ హెల్డ్‌లో పెట్టాలని పేర్కొంది. దీన్ని ఆసరాగా చేసుకున్న అక్రమార్కులు నల్లగొండ జిల్లాలో ‘విత్ హోల్డ్’లో ఉన్న 551 చెక్కులను నగదుగా మార్చుకుని పంచుకున్నారు. ఇటీవల రాష్ట్ర వ్యవసాయ శాఖ మిగిలిపోయిన చెక్కుల వివరాలను, విత్‌హోల్డ్‌లో ఉన్న చెక్కులను వెనక్కి పంపాలని కోరడంతో ఈ విషయం బయటపడింది. నల్లగొండ జిల్లాలోని నాంపల్లి మండలంలో ఎస్‌బిఐ బ్యాంకు క్యాషియన్ రవి నాయక్, కొంతమంది ప్రభుత్వ అధికారులు, బయటి వ్యక్తులతో కలిసి సొమ్మును కాజేసినట్లు నిర్ధారణ అయిందని జిల్లా కలెక్టర్ తన విచారణ నివేదికలో పేర్కొన్నారు.

పెద్ద అడిశెర్లపల్లి, చింతపల్లి, నాంపల్లి, గుర్రంపొడు, దేవరకొండ, చండూరు మండలాలకు చెందిన విత్‌హోల్డ్‌లో ఉన్న రైతుబంధు చెక్కులు డ్రా చేసినట్లు గుర్తించారు. వాస్తవానికి ప్రభుత్వం నిబంధనల ప్రకారం రైతుబంధు చెక్కు తీసుకుని బ్యాంకుకు సంబంధిత పట్టాదారు రైతు మాత్రమే వెళ్లాలి. నగదు తీసుకునే సమయంలో ఖచ్చితంగా పట్టాదారు పాసు పుస్తకం చూపించాలి. ఒకవేళ పాసు పుస్తకం రానట్లయితే ఆధార్ కార్డు, ఓటరు ధ్రువీకరణ కార్డును చూపించాల్సి ఉంది. కాని ఇవేమి పట్టించుకోకుండానే నాంపల్లి మండల ఎస్‌బిఐ క్యాషియర్ మాత్రం ‘నగదు ఇవ్వొద్ద’ంటూ సూచించిన రైతుబంధు చెక్కులను రెవిన్యూ, ఇతర ప్రభుత్వాధికారులతో కలిసి అక్రమంగా నగదులోకి మార్చారు. బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జిల్లా ఎస్‌పిని సూచించగా ఇప్పటికే పలువురిపై కేసు నమోదైనట్లు కలెక్టర్ నివేదికలో పేర్కొన్నారు. నిర్లక్షంగా వ్యవహరించిన మండల వ్యవసాయాధికారులు, ఎఇఒలపై కూడా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Comments

comments