Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

అంగన్‌వాడీలకు మంగళం?

Anganwadi-Center

అంగన్‌వాడీ కేంద్రాల రేషనలైజేషన్
15 మందిలోపు ఉన్న కేంద్రాలకు గండమే
మూడు జిల్లాల్లో 180 కేంద్రాల మూసివేతకు రంగం సిద్ధం
ఆందోళనలో అంగన్‌వాడీలు

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: మాతా శిశు సంరక్షణ కేంద్రాలకు కొన్నింటికి మంగళం పాడేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. గ్రామాల్లో కొనసాగుతున్న అంగన్‌వాడీ కేంద్రాలను రేషనలైజేషన్ పేరుతో మూసివేత గండం ముంచుకొస్తుంది. గర్భిణులు, పిల్లలు కలిపి 15 మంది కన్న తక్కువగా ఉన్న కేంద్రాలను ఎత్తివేసి పక్కనున్న కేంద్రాలలో విలీనం చేయడానికి ఉన్నతాధికారుల ఆదేశాలతో జిల్లా స్థాయి అధికారులు కసరత్తు ప్రారంభించారు. రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ జిల్లాల అధికారులు ఇప్పటికే 15 మందిలోపు ఉన్న కేంద్రాలను గుర్తించే పనిలో పూర్తిస్థాయిలో నిమగ్నమయ్యారు. ఎస్సీ, ఎస్టీ కాలనీలలో మినహాయించి మిగతా ప్రాంతాల్లో ఉన్న కేంద్రాలపై వివరాలు సేకరిస్తున్నారు. తహసీల్దార్, యంపిడిఓ, ఎంఇఓ, అంగన్ వాడీ సూపర్‌వైజర్‌లతో బృందం దీనిపై కసరత్తు నిర్వహిస్తుంది.

రంగారెడ్డి జిల్లాలో 27 మండలాలు, 5 మున్సిపాలిటీలలో ఏడు ఐసిడియస్ ప్రాజెక్టులలో 1368 అంగన్‌వాడీ కేంద్రాలు, 232 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. రేషనలైజేషన్ పేరుతో దాదాపు 45 అంగన్‌వాడీ కేంద్రాలను మూసివేసి ఇతర కేంద్రాలలో విలీనం చేయడానికి రంగం సిద్ధం అయింది. అధికారులు మాత్రం పునర్ వ్యవస్థీకరణ చేస్తున్నామని ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామంటు న్నారు. వికారాబాద్ జిల్లాలో 18 మండలాల్లో 973 అంగన్‌వాడీ, 138 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయి. వికారాబాద్ జిల్లాలో దాదాపు 100 కేంద్రాలకు మంగళం పాడటానికి అధికారులు ముందుకు సాగుతున్నారు. మేడ్చల్ జిల్లా పరిధిలో 793 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా వాటి సంఖ్యను అవసరాలకు అనుగుణంగా పెంచాలని రెండు రోజుల క్రితం జరిగిన సమావేశంలో ప్రజా ప్రతినిధులు కోరగా రేషనలైజేషన్ పుణ్యమా ప్రస్తుతం ఉన్న కేంద్రాలలో దాదాపు 20 వరకు ఎత్తివేసి ఇతర కేంద్రాలలో కలపవలసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ఆందోళనలో సిబ్బంది…
అంగన్‌వాడీ కేంద్రాల విలీనం ప్రక్రియ అంగన్‌వాడీ సిబ్బందిలో గుబులు రేపు తోంది. 15లోపు ఉన్న కేంద్రాలను విలీనం పేరుతో ఇతర కేంద్రాలకు తరలిస్తే తమ పరిస్థితి ఏమిటని వారు ఇప్పటినుంచే లబోదిబోమంటున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలలో పని చేస్తూ కుటుంబం నడుపుతున్న చాలా మంది ఇప్పుడు కొత్త పరేషాన్లో కనిపిస్తున్నారు.

Comments

comments