Home తాజా వార్తలు నేడు గ్రాడ్యుయేట్, టీచర్ ఎంఎల్‌సి ఎన్నికలు

నేడు గ్రాడ్యుయేట్, టీచర్ ఎంఎల్‌సి ఎన్నికలు

MLC-Elections

మెదక్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో ఉ. 8 నుంచి 4 వరకు పోలింగ్రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎంఎల్‌సి స్థానానికి శుక్రవారం ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి సాయం త్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఇందుకు   సంబంధించి ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ టీచర్ స్థానం ఎన్నికలకు 376 పోలింగ్ కేంద్రాలు, ఇదే జిల్లాల్లో పట్టభద్రుల ఎంఎల్‌సి స్థానానికి 253 పోలింగ్ స్టేషన్‌లు ఏర్పాటు చేశారు. అలాగే వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయ స్థానానికి 185 పోలింగ్ స్టేషన్‌లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఏర్పాటు చేశారు. మెదక్‌కరీంనగర్ పట్టభద్రుల ఎంఎల్‌సి నియోజకవర్గంలో 1,96,321 ఓటర్లుగా ఉన్నట్లు సిఇఒ కార్యాలయం ప్రకటించింది. అలాగే ఉపాధ్యాయ స్థానానికి 23,124 మంది ఓటర్లు ఉన్నారు. వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయ ఎంఎల్‌ఎసి నియోజకవర్గంలో 20,888 మంది ఓటర్లు ఉన్నారు. ఈ మూడు ఎంఎల్‌సి స్థానాలకు మొత్తం 33 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

ఇందులో పట్టభద్రుల స్థానానికి 17 మంది బరిలో ఉన్నారు. ఇక మెదక్‌కరీంనగర్ ఉపాధ్యాయ స్థానానికి ఏడుగురు, వరంగల్‌నల్లగొండ ఎంఎల్‌సి స్థానానికి 09 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇదిలా ఉండగా ఉపాధ్యాయ స్థానం, పట్టభద్రుల స్థానాలకు ఒకే రోజు పోలింగ్ జరగుతున్నందున, ఈ రెండింటిలోనూ ఓటు హక్కు వినియోగించుకునే వారికి రెండు వేళ్లకు సిరా గుర్తులు వేయనున్నారు. ఇందులో పట్టభద్రుల స్థానానికి ఓటు వేసే వారికి కుడి చేతి నాలుగో వేలుకు, ఉపాధ్యాయ స్థానానికి కుడి చేతి మధ్యవేలుకు సిరా వేయనున్నారు. అలాగే వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయ ఎంఎల్‌సి స్థానానికి ఓటింగ్‌లో పాల్గొనే కుడి చేతి మధ్య వేలుకు సిరా గుర్తు అంటించనున్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్ స్పష్టం చేసింది. ఈ నెల 22వ తేదీ సాయంత్రం నాలుగు గంటల వరకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా వాటిని రెండురోజుల పాటు నిషేధం అమలు కానుంది. ఓటర్లను ప్రలోభ పెట్టడానికి బల్క్ ఎస్‌ఎంఎస్‌లను పంపే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎంఎల్‌సి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే ఓటర్లు ఎపిక్ కార్డు లేనట్లయితే తొమ్మిది రకాలైన గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి ఎన్నికల అధికారులకు చూపించాల్సి ఉంటుంది.

Graduate and Teacher MLC Elections Today