Home తాజా వార్తలు పల్లెల్లో ఏడు బృందాల నిఘా

పల్లెల్లో ఏడు బృందాల నిఘా

Gram panchayat elections in Telangana
బోధన్: గ్రామ పంచాయితీ ఎన్నికల సందడి జోరందుకుంది. తొలి విడత నామినేషన్ ఉపసంహరణ పర్వం ముగిసింది. మొదటి విడత ఎన్నికలు జరిగే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 414 గ్రామాల్లో ప్రచారం షురువైంది. రెండో విడత ఎన్నికలు జరిగే 389 గ్రామాల్లో నామినేషన్ల పర్వం ముగిసింది. నేడు ఉపసంహరణ జరగనుంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు బరిలో నిలిచిన అభ్యర్ధులు ప్రచారాన్ని ప్రారంభించారు. జిల్లాలోని పల్లెల్లో జరిగే ఎన్నికలపై అధికార యంత్రాంగం పటిష్టతమైన నిఘాను ఏర్పాటు చేసింది. ఏడు విభాగాలతో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలును పర్యవేక్షించనున్నారు. ఉమ్మడి జిల్లాలో పనిచేసే ఏడు విభాగాలు వాటి పనితీరుపై కథనం
ప్లయింగ్ స్కాడ్: అన్ని మండల కేంద్రాల్లో ప్లయింగ్ స్కాడ్ ఉంటుంది. ఎన్నికలు ముగిసే వరకు గ్రామాల్లో సంచరిస్తుంది. ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై వచ్చే ఫిర్యాదులకు స్పందించి అక్కడికి చేరుకుంటుంది. బెదిరింపులు, అసాంఘీక కార్యక్రమాలు, మద్యం, డబ్బులు, ఆయుధాల సరఫరా వంటి ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటుంది. బహిరంగ సభలు, ర్యాలీలపై వీడియో టీం ద్వారా చిత్రీకరిస్తుంది. మద్యం, డబ్బులు దొరికితే సాక్షుల సమక్షంలో జప్తుచేస్తుంది. రూ. 50వేలకు మించి నగదును ఎవరూ కలిగి ఉన్నా సీజ్ చేస్తుంది. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్ధి పార్టీ కార్యకర్తగా భావిస్తే ఎఫ్‌ఐఆర్ నమోదును సిఫార్సు చేస్తుంది. సాధారణ వ్యక్తులు రూ. 50వేలకు మించి కలిగి ఉంటే ఆ డబ్బులకు ఆధారాలుంటే వదిలేస్తుంది. లేనట్లైయితే సీజ్ చేసి రశీదు అందిస్తారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకుండా డిటీవో వద్ద జమచేస్తుంది. ఎవరైనా రూ.10లక్షలు కలిగి ఉంటే ఆదాయ పన్ను శాఖ అధికారులకు అప్పగిస్తుంది.
స్టాటిక్ సర్వేలెన్స్ టీం(ఎస్‌ఎస్‌టీ): జిల్లా సరిహద్దుల్లో స్టాటిక్ సర్వేలెన్స్‌టీం చెక్‌పోస్టులు పర్యవేక్షిస్తుంది. అక్రమ మద్యం, పెద్దమొత్తంలో డబ్బు, ఆయుధాల రవాణాపై చర్యలు తీసుకుంటుంది. పోటీలో ఉన్న అభ్యర్థులకు సంభందించిన వాహనాలు, డబ్బులు, మద్యం పట్టుబడితే వీడియో తీయించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తుంది. ఎస్‌ఎస్‌టీ బృందం ఎన్నికల కమీషన్ ద్వారా నియమించబడుతుంది. మెజిస్ట్రేట్ ఆధ్వర్యంలో వీడియోగ్రాఫర్ ద్వారా ఎస్‌ఎస్‌టీ టీం నిరంతరం పనిచేయాలి.
వీడియో సర్వేలెన్స్ టీ(వీఎస్‌టీ): వీడియో సర్వేలెన్స్ టీం మండల కేంద్రాల్లో ఉంటుంది. ఎన్నికల ఖర్చులను సంభందిత సందర్భాల్లో వీడియో చిత్రీకరిస్తుంది. వీడియో రికార్డు చేసేటప్పుడు వాయిస్ మోడ్‌లో టైటిల్ స్థలం, పార్టీ పేరు, ప్రచారం నిర్వహించే అభ్యర్థి పేరు రికార్డు చేయాలి. సమావేశాలు, సభలకు సంభందించిన సమగ్ర సమాచారాన్ని పోస్టర్ సైజులు, బ్యానర్లు , లౌడ్‌స్పీకర్లు వీడియో రికార్డు చేస్తారు. వాహనడ్రైవర్ల స్టేట్‌మెండ్ నమోదు చేయాలి.
వీడియో వ్యూయింగ్ టీం(వీవీటీ): అన్ని మండల కేంద్రాల్లో వీడియో వ్యూయింగ్ టీం ఉంటుంది. ఎన్నికల ఖర్చులపై రోజు వారి వీడియోలను, సీడీలను ఈటీం చూస్తుంది. వీఎస్‌టీ సమర్పించి సీడీలను, వీడియోలను, మెమోరికార్డులను బయటి ఏజన్సీలకు ఇవ్వకూడదు. ఎన్నికల ఖర్చులపై నివేదికను ఏ రోజూరోజూ ఏఈవోకు సమర్పించాలి. వీవీటీ సమర్పించే రిపోర్టులో వాహనం నెంబర్లు, వేదిక కుర్చీల సంఖ్య, బ్యానర్ సైజు, సమగ్ర వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. వీటిని ఎన్నికల పరిశీలకులకు అందించాలి. ఎన్నికల్లో అభ్యర్ధి చేసే ఖర్చులకు సంభందించి హెచ్చుతగ్గులున్నట్లు భావిస్తే వీవీటీ బృందం ఎన్నికల రిటర్నింగ్ అధికారికి 24గంటల్లో రాతపూర్వకంగా అందించాలి.సమగ్ర సాక్షాధారాలతో వీటిని అందించాల్సి ఉంటుంది.

మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ: మీడియా సర్టిఫికెట్ అండ్ మానిటరింగ్ కమిటీ జిల్లా స్థాయిల్లో ఉంటుంది. ప్రింటు, ఎలక్ట్రానిక్ సోషల్ మీడియాలో వచ్చే అభ్యర్థుల ప్రచారాల క్లింప్పింగ్‌లను ఎంసీఎంసీ కమిటి కత్తిరించి సేకరించాలి. వీటిని అభ్యర్థుల ఎన్నికల ఖర్చుగా నమోదు చేయాలి. పత్రికలను, టీవీలకు ఇచ్చే ప్రకటనలకు ఎంసీఎంసీ కమిటి అనుమతి తప్పనిసరి. ఎన్నికల్లో అభ్యర్ధుల పోస్టర్లు, కరపత్రాలు పంపిణీ చేసే ప్రచురణ కర్త పేరు, ప్రతుల సంఖ్య స్పష్టంగా ఉండాలి. లేకుంటే అభ్యర్థికి నోటీసు ఇవ్వాలి. ఎంసీఎంసీ కమిటి పెయిడ్ న్యూస్‌ను గుర్తించి నివేదిక సమర్పిస్తుంది.
అకౌంటింగ్ టీం: ప్రతిమండల కేంద్రంలో ఏఈవో సహాయకులు ఉంటారు. షాడో అబ్జర్వేషన్ విధిగా ఎన్నికల లెక్కలను నమోదు చేస్తుంది. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్ధులు నామినేషన్ వేసినప్పటి నుంచి మూడుసార్లు లెక్కలు సమర్పించాలి. షాడో బృందాలు సమర్పించిన లెక్కల్లో ఏవైనా హెచ్చుతగ్గులుంటే సంభందిత అభ్యర్ధికి నోటీసులు అందజేశారు. ప్రత్యేక రిజిస్టర్‌లో వీటిని పొందుపర్చి ఎన్నికలు పూర్తయిన 38 రోజుల్లో లెక్కల వివరాలను జిల్లా ఎన్నికల అధికారికి సమర్పించాల్సి ఉంటుంది. లేకుంటే తగు చర్యలకు వెళ్తారు.

Gram panchayat elections in Telangana