Home మెదక్ పంచాయతీకి రె‘ఢీ’…

పంచాయతీకి రె‘ఢీ’…

Gram Panchayat Elections Preparation In Medak

ముందస్తు ఎన్నికలకు వెళ్లమంటారా? అంటూ కాంగ్రెస్‌ను ఉద్దేశించిన సిఎం చేసిన వాఖ్యలకు ఆ పార్టీ అధిష్ఠానం కూడా రెడీ అంటూ సవాళ్ళు విసరడంతో జిల్లాలో ఎన్నికల వేడి మరోసారి రాజుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో కెసిఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం ప్రజల్లోకి విస్తృత స్థాయిలో చేరి గత పాలనలో ఏ ముఖ్యమంత్రి రైతుల కోసం ప్రవేశపెట్టని సంక్షేమ పథకాలను టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టడంతో ప్రతి గ్రామంలోని రైతు లు ప్రభుత్వంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని పూర్తిస్థాయిలో ఉన్న రెండు నియోజకవర్గాలైన మెదక్, నర్సాపూర్‌లలో ఇద్దరు టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అయిన పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డిలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఐతే ఈ రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పాగా వేసేందుకు ఎత్తుకు పై ఎత్తులు ప్రారంభించింది. నర్సాపూర్ నియోజవర్గంలోని ప్రస్తుత ఎమ్మెల్యేకు పోటీగా మాజీ మంత్రి, డిసిసి అధ్యక్షురాలు వాకిటి సునీతాలకా్ష్మరెడ్డి ఇప్పటికే కార్యకర్తల సమావేశాలతో పాటు ప్రతి గ్రామాల్లో విస్తృతంగా పార్టీ కార్యకలాపాలపై పర్యటిస్తున్నారు. అంతేకాకుండా గతంలోని కాంగ్రెస్ కార్యకర్తలు టిఆర్‌ఎస్‌లోకి వలన వెళ్లిన వారిని తిరిగి తమగూటికి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నియోజకవర్గంలోని కొందరు సీనియర్, మండల స్థాయి నాయకులు ఈమె వెంటే ఉండడం కాంగ్రెస్‌కు కలిసివచ్చే అంశంగా కనబడుతుంది. నియోజకవర్గంలోని అసంపూర్తిగా మిగిలిపోయిన కొన్ని అభివృద్ధి పనుల విషయంలో మాజీ మంత్రి ప్రజలతో కలిసి కొన్ని సందర్భాలలో కలెక్టర్‌ను ఆశ్రయించి ఫిర్యాదు కూడా చేసి పరిష్కరించవల్సిందిగా కోరుతూ తన హయంలోనే అభివృద్ధి సాధ్యమంటూ ప్రజలకు సందేశాలను పంపించారు.

మూడు పర్యాయాలు నర్సాపూర్ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించి, రెండు సార్లు మంత్రి హోదాలో ఉన్న సునీతాలకా్ష్మరెడ్డికి ఈసారి ఎన్నికలు సవాలుగా మారనున్నాయి. ప్రస్తుత టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి ఎప్పటికప్పుడు నియోజవర్గంలో పర్యటిస్తూ పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులకు అందుబాటులో ఉండి ఆయా గ్రామాలకు కావాల్సిన అభివృద్ధి పనులను కేటాయిస్తూ ముందుకు కొనసాగుతున్నారు. నియోజవర్గంలోని టిఆర్‌ఎస్ పార్టీ నుండి జడ్పిచైర్‌పర్సన్ రాజమణి భర్త, ప్రస్తుత జిల్లా టిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు మురళియాదవ్ కూడా నర్సాపూర్ నియోజకవర్గం నుండి టికెట్ ఆశించే యోచనలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. బిసి వర్గానికి చెందిన తమ నాయకునికి ఈసారి ఖచ్చితంగా టిఆర్‌ఎస్ టికెటు రావాలంటూ మురళియాదవ్ అనుచరులు కూడా గట్టిగానే కోరుకుంటున్నారు. వీరిరువురి మధ్య రాజీ కుదరకపోతే ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి కలిసివచ్చే అంశంగా మాజీ మంత్రి సునీతాలకా్ష్మరెడ్డి భావిస్తున్నారు. ఏది ఏమైనా ఎంతమంది బరిలో ఉన్నా నర్సాపూర్ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ పార్టీ తరపున సునితాలకా్ష్మరెడ్డి కైవసం చేసుకోవడానికి కసరత్తు మొదలుపెట్టారు. ఇక మెదక్ నియోజకవర్గంలోని క్యాబినెట్ హోదాలో ఉన్న ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డికి అదే పార్టీ నుండి మరో అభ్యర్థి ఎవరు కూడా లేకపోవడంతో తమ నాయకురాలికే టికెటు దక్కుతుందని ఆమె అనుచరవర్గాలు చెబుతున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీలో మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డితో సహా తిరుపతిరెడ్డి, సుప్రభాత్‌రావు, బట్టి జగపతిలు ఎమ్మెల్యే టికెట్టును ఆశిస్తున్నారు.

వీరిలో ఏ ఒక్కరికి కాంగ్రెస్ టికెట్టు దక్కినా మిగతా వారంతా ఏకతాటిపైకి వచ్చి తమ అభ్యర్థిని గెలుపించుకుంటామని చెబుతున్నప్పటికీ గత 2014 ఎన్నికల్లో ఎదురైన సమస్యలే పునరావృతమవుతాయనే సంశయం కూడా ఆ పార్టీ కార్యకర్తలను వెంటాడుతుంది. ప్రస్తుత టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాత్రం అభివృద్ధిలో రాజీ పడకుండా మెదక్ నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన నిధులను ఇప్పటికే దాదాపు 1600 కోట్ల రూపాయలను మంజూరు చేయించి ప్రతి నిత్యం నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులలో పాల్గొంటున్నారు. కానీ నియోజకవర్గంలోని క్రిందిస్థాయి కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ఉపసభాపతి తమను పట్టించుకోవడం లేదని మునుపటి ఉద్యమ సమయంలో ఆమెతో పాటు పనిచేసిన కొందరు కార్యకర్తలు గుసగుసలాడుతున్నారు. ఈ విషయంలో ఉపసభాపతికి ఉన్న వ్యతిరేకతను కాంగ్రెస్ పార్టీ క్యాచ్ చేసుకోవాలని విశ్వప్రయత్నాలు కొనసాగిస్తుంది.

ఇందుకు తోడు ప్రతినిత్యం రాజకీయ స్వలాభాల కోసం స్వచ్ఛంద ముసుగులో పనిచేసే కొందరు వ్యక్తులు కూడా అవకాశవాదంగా మార్చుకునే దిశగా ఆమెతో ఉన్న మునుపటి కొందరు కార్యకర్తలను ప్రలోభాలకు గురిచేసి తమవైపుకు తిప్పుకునే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే జరిగిన కొన్ని సర్వేలలో తమ పార్టీకే అనుకూలమని అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రకటించుకుంటున్నాయి. ప్రధానంగా జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్, టిఆర్‌ఎస్ పార్టీల హవా కొనసాగగా మిగతా పార్టీలు తాము కూడా ఉన్నామంటూ అప్పుడప్పుడు వాటికవే ప్రదర్శించుకుంటున్నాయి. ఇక టిజెఎస్ పార్టీ అభ్యర్థుల జాడ మాత్రం ఇంకా తెలవాల్సి వుంది. ఈ విషయంలో ఆ పార్టీ నియోజకవర్గాల్లో పోటీ చేసే అంశంపై ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. మొత్తానికి పార్టీల, అభ్యర్థుల, ఆశావాదుల తీరు నియోజకవర్గాలలోని ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నాయి.
ప్రభుత్వ పనితీరు పక్కనపెడితే పార్టీలకు చెందిన అభ్యర్థులపై ప్రజలకు ఉన్న విశ్వాసం కూడా గెలుపుకు కీలక అంశంగా మారనుంది. ఇంకా ఎన్నికల సమయం వరకు ఎన్ని చిత్రవిచిత్రాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాల్సిందే.