Home రంగారెడ్డి ఉందామా…పోదామా

ఉందామా…పోదామా

Gram Panchayat Elections Preparations In Rangareddy Dist

 మన తెలంగాణ, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ముందస్తు ఎన్నికల వేడి రాజుకుంది. స్థానికంగా కాస్తో కూస్తో బలం ఉండి ప్రస్తుతం ఉన్న పార్టీలలో నారాజ్‌లో ఉన్న నేతలను గుర్తించి తమ పార్టీలోకి ఆహ్వానించడానికి అన్ని రాజకీయ పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. అసంతృప్త నేతలు తమ రాజకీయ భవిష్యత్ కోసం ప్రస్తుతం ఉన్న పార్టీలో ఉందామా….వలస పోదామా అని తమ అనుచరులు, కార్యకర్తలతో రహస్యంగా చర్చ లు కొనసాగిస్తున్నారు. అసంతృప్తులను గుర్తించి కారులో ఎక్కించుకోవడానికి గులాబీ దళం ప్రత్యేక టీమ్‌లు పనిచేస్తుండగా తమ క్యాడర్‌ను కాపాడుకోవడంతో పాటు టిఆర్‌ఎస్‌లో నారాజ్‌గా ఉన్న సీనియర్‌లను తమ వైపుకు తిప్పుకోవడానికి  ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం జిల్లాలో పక్కా ప్యూహంతో ముందుకు సాగుతున్నారు.సీనియర్ నేతలకు దీటుగా ద్వితీయ శ్రేణి నాయకులు, స్థానిక సంస్థలలో పోటిచేయాలని యోచిస్తున్న ఆశావాహూలు ప్రస్తుతం వలసల జాబితాలో ముందు వరుసలో కొనసాగుతున్నారు. గ్రేటర్ పార్టీ అధ్యక్షుడు దానం నాగేందర్‌ను తమ వైపుకు తిప్పుకోవడంలో విజయం సాధించిన టిఆర్‌యస్ పార్టీ ఆయన వెంట కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు వస్తారని అంచనాలు వేసిన పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. తాజాగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలతో పాటు గత ఎన్నికలలో పోటిచేసి ఓటమిపాలైన ప్రముఖ వ్యాపారి ఒకరిపై టిఆర్‌యస్ గురిపెట్టినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఒకే సామాజిక వర్గంకు చెందడంతో పాటు సదరు నేతలు అంతా కాంగ్రెస్ పార్టీలో సైతం ఒకే వర్గంగా కొనసాగుతుండటం వారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలలో టిఆర్‌యస్‌కు పటిష్టమైన నాయకత్వం లేకపోవడంతో వారికి టికెట్‌లు సైతం కేటాయించడానికి అంగికారం తెలిపినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. సదరు నాయకులు గతంలో దీనిని ఖండించిన ప్రస్తుతం మాత్రం మౌనంగా ఉండటం విశేషం. బడా నేతలతో పాటు నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయిలో కీలకంగా వ్యవహరించే నేతలు చాలా మంది వలసలకు సిద్దం అవుతున్నారు. తాండూర్‌లో మంత్రి మహేందర్ రెడ్డి గత నెల రోజులుగా గ్రామాలను చుట్టివస్తు ప్రతిపక్ష పార్టీల నేతలందరిని తమ పార్టీలో కలుపుకుంటున్నారు. షాద్‌నగర్, పరిగి, ఇబ్రహింపట్నం, కల్వకుర్తి, రాజేంద్రనగర్, మేడ్చల్ నియోజకవర్గాలో టిఆర్‌యస్‌లోకి వలసల జోరు కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ సైతం టిఆర్‌యస్ అసంతృప్తును గుర్తించి తమ వైపుకు తిప్పుకోవడానికి ప్రయత్నాలు ప్రారంబించిన పెద్దగా ఫలితం కనిపించడం లేదు. రాజేంద్రనగర్, మహేశ్వరం నియోజకవర్గాలో కొంత వరకు ద్వితీయ శ్రేణి నేతలను తమ వైపుకు తిప్పుకోవడంలో విజయం సాధించిన చాలా నియోజకవర్గాలలో ఆశీంచిన ఫలితాలు రావడం లేదు. బిజెపి జన చైతన్య యాత్ర జిల్లాలో ముగిసిన పెద్దగా స్పందన కనిపించిన దాఖలాలు లేవు.
టిడిపిపై నజర్…
సమైఖ్య రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా టిడిపికి కంచుకోటగా ఉండటంతో పాటు 2014 ఎన్నికలలో సత్తా చాటి ఒక పార్లమెంట్, ఎడు ఎమ్మెల్యే స్థానాలలో విజయం సాధించిన టిఆర్‌యస్ పార్టీ నిర్వహించిన ఆపరేషన్ ఆకర్ష్‌తో సైకిల్ కాస్తా తునకతునకలై కనుమరుగు స్థాయికి చేరుకుంది. మాజీ మంత్రి దెవేందర్ గౌడ్, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు వీరెందర్ గౌడ్‌లతో పాటు శివారు నియోజకవర్గాలలో టిడిపికి ప్రస్తుతం సైతం మంచి క్యాడర్ ఉండటంతో వారిని తమ వైపుకు తిప్పుకోవడానికి అధికార టిఆర్‌యస్‌తో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. దెవేందర్ గౌడ్‌తో పాటు ఆయన తనయుడిని టిఆర్‌యస్‌లోకి తీసుకురావడానికి ఇప్పటికే పలు మార్లు చర్చలు జరగడంతో పాటు అంతా సవ్యంగా ఉంటే త్వరలో వారు కారు ఎక్కడం ఖాయమని ప్రచారం జరుగుతుంది. టిడిపి జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డితో పాటు ఇతర నేతలను సైతం కారు పార్టీలో చేర్చుకోవడం ద్వారా జిల్లాలో పూర్తి స్థాయి పట్టుసాధించాలని టిఆర్‌యస్ నాయకత్వం యోచిస్తుంది. కాంగ్రెస్ నేతలు సైతం టిడిపి నేతలను తమ వైపుకు తిప్పుకోవడంకు ప్రయత్నాలు చేస్తున్నారు. ముందస్తు ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది జంపింగ్ జపాంగ్ నేతల సందడి పెరగడం ఖాయంగా కనిపిస్తుంది.