Home ఎడిటోరియల్ “భారతీయ ఔన్నత్యం- ప్రపంచ ప్రముఖుల ప్రణామాలు”

“భారతీయ ఔన్నత్యం- ప్రపంచ ప్రముఖుల ప్రణామాలు”

Great-Minds-of-Indiaఇటీవలి నా అమెరికా పర్యటనలో భాగంగా హ్యూస్టన్ నగరంలో మూడు వారాలున్నాను. ఆ సమయంలో సాహితీవేత్త, శాస్త్రవేత్త, మన తెలుగు వాడైన డాక్టర్ మురళి అహోబిల వఝల గారిని కలవటం తటస్థించింది. ఆయన సంపాదకత్వంలో, సలీల్ గేవాలీ సేకరించిన “గ్రేట్ మైండ్స్ ఆఫ్ ఇండియా” అనే ఆంగ్ల పుస్తకాన్ని, దాని తెలుగు అనువాదమైన ‘భారతీయ ఔన్నత్యం-ప్రపంచ ప్రముఖుల ప్రణామాలు‘ను నాకిచ్చారాయన. ఆంగ్లమూలానికి తెలుగు సేత ఖందవల్లి సత్యదేవప్రసాద్. ఆంగ్ల సాహిత్యంలో పోస్ట్ గ్రాడ్యు యేషన్ చేసిన సలీల్ గేవాలీ మేఘాలయా రాష్ట్రానికి చెందిన వారు. ఫ్రీలాన్సర్‌గా 1980 లో రచనా రంగంలోకి ప్రవేశించిన సలీల్ వ్యాసాలు అనేక స్థానిక, జాతీయ దిన పత్రికల్లో ముద్రితమై పాఠకుల ప్రశంసలను చూరగొనటం జరిగింది. పరిశోధనాత్మక మైన ఈ పుస్తకం సలీల్ గేవాలీకి పెద్ద ఎత్తున పేరు ప్రఖ్యాతలు సంతరించి పెట్టింది. తెలుగు, కన్నడ, మళ యాలం, మరాఠి, హింది, గుజరాతీ, తమిళ్, నేపాలీ భాషల్లోకి ఈ పుస్తకం అనువ దించబడింది. తెలుగు పుస్తకానికి ముందుమాటలు పుల్లెల శ్రీరామ చంద్రుడు, డాక్టర్ కె. అరవిందరావు, సామవేదం షన్ముఖ శర్మ రాశారు.

తనకు భారతదేశం మీద అపారమైన ప్రేమ భారతీయ ఔన్నత్యం పుస్తక తయారీకి తొలి అడుగని రచయిత అంటారు. అనేక మంది రచయితల మేధో సంపత్తికి, ఆలోచనాధోరణికి, నిర్దుష్ఠమైన వారి అభిప్రాయాలకు “గ్రేట్ మైండ్స్ ఆఫ్ ఇండియా” దర్పణం లాంటిది. వారి ఆలోచనలు, ఆరాటం, ఆతృత మన సమాజంలో దానికున్న విలువ వంటి కోణాల్లో అద్భు తాలను ఆవిష్కరించింది. భారతదేశ వైదిక, వైజ్ఞానిక, సాంస్కృతిక సంపద గురించి ప్రపంచ ప్రసిద్ధులైన మేధావుల అభిప్రాయాలను ఈ పుస్తకంలో క్రోడీకరించారు రచయిత-సంపాదకుడు. రచయితల భారత జాతీయ దృక్పథాన్ని ఆవిష్కరించటంతో పాటు, దేశ భక్తిని, పురాణాలలోని నిగూఢమైన మేధోమథనాన్ని విస్తృతంగా వివరించటం జరిగింది. వేదాలకు, ఉపని షత్తులకు, భగవద్గీతలోని సారాంశానికి సలీల్ గేవాలీ పెద్ద పీట వేయటం విశేషం. ప్రఖ్యాత శాస్త్రవేత్తలు, పశ్చిమ దేశీయ పండితులైన హెన్రీ డేవిడ్ థోరో, రాల్ఫ్ ఎమర్సన్, కార్ల్ సగాన్, అలాన్ వాట్స్, అల్డస్ హక్స్ లే, లాంటి వారి అమూల్యమైన వాక్కు లిందులో కనిపిస్తాయి. అలాగే మేధావులైన వాల్టయిర్, టి.ఎస్. ఇలియట్, ఫ్రెడరిక్ హెగెల్, జూలియస్ రాబర్ట్, ఓప్పెన్ హైమర్, ఎమర్సన్, థోరో, ఎర్విన్ స్కోడిన్గర్, మార్క్ ్ర్ట్వన్ లాంటి ఉద్దండులు మన భారతీయ పురాణ సాహిత్యం నుండి ఎంతోకొంత ఆకళింపు చేసు కున్నారనడానికి వారి మాటలే ఆధారం.

సంపాదకుడు మురళి అహోబిల, హ్యూస్టన్ నగరంలోని జాన్సన్ అంతరిక్ష కేంద్రంలోని నేషనల్ రిసర్చ్ కౌన్సిల్ లో మాజీ శాస్త్రవేత్తగా నేషనల్ ఎరో నాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా)లో పని చేశారు. అలాగే ఆయన అక్కడే వున్న లూనార్ అండ్ ప్లానిటరీ ఇన్‌స్టిట్యూట్ (ఎల్‌పిఐ)లోనూ శాస్త్ర వేత్తగా పని చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థి అయిన మురళి అహోబిల మధ్యప్రదేశ్‌లోని సాగర్ విశ్వవిద్యా లయం నుండి డాక్ట రేట్ పొందటంతో పాటుగా టాటా ఇన్సిటిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసర్చ్ (టిఎఫ్‌ఐఆర్)లో, భారత అణు పరిశోధన సంస్థ (బార్క్) లో పరిశోధనలు చేశారు. మురళి, జియో కెమిస్ట్రీ, కాస్మో కెమిస్ట్రి విభాగాల్లోనూ ప్రత్యే కత సాధించారు. ప్రపంచ ప్రసిద్ది గాంచిన ఎందరో ప్రముఖుల, మేధావుల ఆణి ముత్యాల లాంటి మాటలను “గ్రేట్ మైండ్స్ ఆన్ ఇండియా” పుస్తకంలో క్రోడీక రించారు రచయిత-సంపాదకుడు. పుస్తకం ఆ మూలాగ్రంగా చదివితే, శాస్త్ర విజ్ఞానం దినదినాభివృద్ధి చెందు తూ ఎన్నెన్నో నూతన విషయాలను ఆవిష్క రించుతున్న నేపధ్యంలో, వీటికి సంబంధించిన అనేకాంశాలు భారత ప్రాచీ న గ్రంథాలలో పేర్కొనబడినవే అనేది అవగత మౌతుంది. ఉదా॥కు, క్వాంటంఫిజిక్స్ అధ్యయనంలో భారతీయ వేదాంత గ్రంథాలు, ఉపనిషత్తు లు, వేదాలు తనకు తోడ్పడ్డా యని శాస్త్రవేత్తలైన ఎర్విన్ ష్రోడింగర్, జూలియస్ ఓపెన్ హీమర్, డేలి బాం, హైసన్‌బర్గ్‌లు అన్న విషయం రచయిత పేర్కొంటారు. అలానే అమెరికాలో పుట్టి ఇంగ్లాడు లో జీవించిన ప్రఖ్యాత ఆంగ్ల కవి, వేస్ట్ ల్యాండ్ రచయిత, 20వ శతా బ్దపు తత్వశాస్త్రవేత్త, విమర్శ కుడు, సాహిత్యం లో 1948 లో నోబుల్ పురస్కార గ్రహీత, టిఎస్ ఇలియట్ తన పద్యకావ్యం చివరలో ‘ఓం శాంతిః శాంతిః శాంతిః‘ అని పేర్కొన్న విషయం చాలా ఆసక్తి కరమైనదిగా అనాలి. అదే పద్య కావ్యంలోని ‘వాట్ ద థండర్ సెడ్’ అనే కవితకు ఆధారం ‘బృహ దారణ్య ఉపనిషత్’ అట! అదే విధంగా ప్రపంచ ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త, అణు బాంబు పితామహుడిగా విశ్వవ్యాప్తంగా తెలిసిన ఓపెన్ హీమర్ ఉపనిషత్తులను, భగవద్గీతను ఎంతో ఆదరంగా అధ్యయనం చేసేవారట.

రచయిత సలీల్ గేవాలీ, సంపాదకుడు డాక్టర్ మురళి తమ పుస్తకంలో పేర్కొన్న మరికొందరి పేర్లు: ప్రఖ్యాత జర్మన్ తత్వవేత్త, రచయిత అయిన ఫ్రెడరిక్ హెగెన్; పరిశోధకులుగా, ఇంగ్లాండ్ రొమాంటిక్ మూవ్‌మెంట్ నాయకులుగా, బ్రిటన్‌లో పోయెట్ లారియట్‌గా ఏడేళ్ల పాటు గుర్తింపు పొందిన ప్రఖ్యాత ఆంగ్ల కవి విలియం వర్డ్ వర్త్; అమెరికా దేశ ప్రఖ్యాత రచయిత రాల్ఫ్ వాల్డో ఎమర్సన్; 19వ శతాబ్దపు ట్రాన్సెంటెండలిస్ట్ మూవ్ మెంట్ పోరాట యోధుడు ప్రఖ్యాతి గాంచిన ప్రొలిఫిక్ అమెరికన్ హ్యూమ రిస్ట్, సెటైరిస్ట్ (వ్యంగకారి), రచయిత అయిన మార్క్ ట్వె యిన్; 1922 భౌతిక శాస్త్ర నోబుల్ పురస్కార గ్రహీత, ఆటోమిక్ స్ట్రక్చర్ ఎక్స్‌పోనెంట్ నీల్స్ భోహర్; ప్రఖ్యాత జర్మన్ తత్వవేత్త, రచయిత ఫిలాలజిస్ట్, ఆ కాలంలో ప్రప్రధమ సంస్కృత పండితుడైన మాక్స్ ముల్లర్; ప్రఖ్యాత ఆంగ్ల నవలా రచయిత, జర్నలిస్ట్, సాంఘిక శాస్త్రవేత్త, తత్వవేత్త హెచ్.జి.వెల్స్; పేరెన్నిక గన్న ఆంగ్ల నవలా రచయిత ఆల్డక్స్ హక్స్ లే; జర్మన్ నోబుల్ పురస్కార గ్రహీత ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ తదితరులు ఉన్నారు. ఈ ప్రముఖులు అన్న కొన్ని మాటాలు:‘భారతీయ దార్శనికులు ప్రవ చించిన ఆధ్యాత్మిక మర్మాలు ఐరోపాదేశంలోని గొప్పగొప్ప వేదాంతులను కూడా బడిపిల్లల్లాగా కనబడేట్లు చేస్తాయి’-టిఎస్ ఇలియట్; ‘ఖగోళ, భౌతిక, ఆధ్యాత్మిక శాస్త్రాలు మనకు గంగా తీరం నుంచే లభించాయనేది నిశ్చయం‘-ఎ ఎం వాల్టై ర్; ‘భారత దేశం మతాలకు నిలయం.

మానవ జాతికి తొలి ఊయల. భాషలకు పుట్టిల్లు. ఇతిహాసాలకు అమ్మమ్మ. సంప్ర దాయాలకు అమ్మలగన్న అమ్మ. సర్వ మానవులు కనీసం ఒక్కసారైనా దర్శించాలని ఉబలాట పడే నేల భారతదేశం‘-మార్క్ ్ర్ట్వన్; ‘వేదాలు నన్ను విడవకుండా వెంటాడుతాయి. వాటిలో నేను శాశ్వత సమాధానం, అంతు లేని బలం, ఎడతెగని శాంతి కనుగొన్నాను’-రాల్ఫ్ వాల్డొ ఎమర్సన్; ‘భారత్ ఒక స్వప్న భూమి. భారతీయులు స్వాప్నికులు. వాళ్లు మానవ పర మార్థమైన ఆనందం గురించి కలలు కంటారు. ఈ లక్షణం భారతీయుల ను ప్రపంచంలో ఇతర దేశస్తులను మించిన చారిత్రక సృజనాత్మకత కలవా రుగా చేసింది’-హెగెల్…ఇలా ఎందరి ఆణిముత్యాలో ఇందులో వున్నాయి. ఆంగ్లంలో ఈ పుస్తకానికి ముందుమాట రాసిన మేఘాలయ విద్యాశాఖా మంత్రి మానస్ చౌదరి “వేదాలు మానవ మనుగడకు జాతి, మత, తత్వ, సాహిత్య మనుగడకు అద్దం పట్టిన ప్రామా ణికాలు’ అని అంటారు. భారత తత్వ వేత్తలను, హిందూయిజాన్ని, బ్రాహ్మణిజాన్ని, మన దేశ ఆలోచ నా విధానాన్ని, వేదాలను, ఉపనిషత్తులను అపహాస్యం చేసే వారందరికీ ఈ పుస్తకం ఒక కనువిప్పు కలిగిస్తుంది. ముందుమాటలో పుల్లెల శ్రీరామ చంద్రుడు రాసినట్లు, ‘హిందూ మత శ్రద్దాళువులెవరూ హిందూమతానికీ, భారతీయ సంస్కృతికీ విరుద్ధంగా జరుగుతున్న దుష్ప్రచారమనే పెనుతుఫానులో కొట్టుకుని పోకుండా నిలదొక్కుకుని, దాని ప్రభా వాన్ని తగువిధంగా ఎదుర్కొనడానికి మహా పురుషుల ఈ సనాతన ధర్మ ప్రశంసా సూక్తులు ఒక్కొక్కటి ఒక్కొక్క అస్త్రంగా ఉపయోగపడుతుంది’.

-వనం జ్వాలా నరసింహారావు