Home తాజా వార్తలు తెలంగాణకు లభించిన విజయం

తెలంగాణకు లభించిన విజయం

Great success of Telangana is MP Vinod

371 డికి సవరణలు చేసేలా చొరవ తీసుకుంటానని, కొత్త వ్యవస్థకు రాష్ట్రపతి ఆమోదం లభించేలా చూస్తానని ప్రధాని స్వయంగా హామీ ఇచ్చారు, ఇది తెలంగాణకు లభించిన ఘనవిజయం : ఎంపి వినోద్ 

మన తెలంగాణ / న్యూఢిల్లీ : రాష్ట్రానికి సంబంధించి కీలకమైన కొత్త జోనల్ వ్యవస్థకు రాష్ట్రపతి ఆమోదం రెండు మూడు రోజుల్లో లభించే అవకాశం ఉందని, ప్రధానితో సిఎం కెసిఆర్ వివరంగా చర్చించిన తర్వాత సానుకూల స్పందన లభించిందని కరీంనగర్ ఎంపి బి.వినోద్‌కుమార్ మీడియాకు తెలిపారు. అరగంటకు పైగా ప్రధానితో జరిగిన సమావేశంలో అనేక అంశాలను ప్రస్తావించినప్పటికీ వీటిలో జోనల్ వ్యవస్థ చాలా కీలకమైనదని వ్యాఖ్యానించారు. తెలంగాణ రూపొందించిన కొత్త జోనల్ వ్యవస్థకు ప్రధాని సమ్మతి తెలియజేయడం మాత్రమే కాకుండా ఉమ్మడి రాష్ట్రంలో ఉనికిలోకి వచ్చిన 371 డి నిబంధనలకు రాష్ట్రపతి సవరణలు చేసేలా, కొత్త జోనల్ విధానానికి ఆమోదం లభించేలా చొరవ తీసుకుంటానని హామీ ఇచ్చారని వినోద్‌కుమార్ పేర్కొన్నారు.

ఇది తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ నిరుద్యోగ యువత సాధించిన గొప్ప విజయమని వ్యాఖ్యానించారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం అరవై ఏళ్ళుగా మోసపోయిందని, తెలంగాణ ఉద్యమంలో ‘నియామకాలు’ ప్రధానమైన డిమాండ్ అని, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు ఇంతకాలం లభించకపోవడంతో అన్యాయం జరిగిందని, దాన్ని సరిదిద్దేందుకే ఇప్పుడు 95% ఉద్యోగాలను స్థానికులకు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విధాన నిర్ణయం తీసుకుందని, ఇది అమల్లోకి రావాలంటే రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి అని వివరించారు. ఈ విషయాలన్నింటినీ ప్రధానికి కెసిఆర్ వివరించారని పేర్కొన్నారు. ‘తెలంగాణ ఉద్యోగాలు తెలంగాణ స్థానికులకే’ అనే నినాదం ప్రాతిపదికన నూతన జోనల్ వ్యవస్థ రూపకల్పన అని వినోద్‌కుమార్ వ్యాఖ్యానించారు. రెండు మూడు రోజుల్లోనే రాష్ట్రపతి ఉత్తర్వులు విడుదలవుతాయంటూ ప్రధాని ధీమా కల్పించారని, రెం డున్నర నెలలుగా జరుగుతున్న జాప్యం తాజా ఢిల్లీ పర్యటనతో పరిష్కారమైనట్లేనని భరోసా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం వివిధ విభాగాల్లో భర్తీ చేయనున్న ఉద్యోగాలకు కొత్త జోనల్ వ్యవస్థ చాలా ముఖ్యమైనది కాబట్టి వీలైనంత త్వరగా ఆమోదం లభించడం అవసరమని ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.

హైకోర్టు విభజనపైనా చర్చ :
రాష్ట్రం ఏర్పడి నాలుగేళ్ళయినా హైకోర్టు మాత్రం రెండు రాష్ట్రాలకూ ఉమ్మడిగానే కొనసాగుతోందని, ఫలితంగా న్యాయ వ్యవస్థలో తెలంగాణ ప్రాంతానికి చెందినవారికి అన్యాయం జరుగుతోందని, అందువల్ల రెండు రాష్ట్రాలకూ వేర్వేరు హైకోర్టులు ఉం డేలా ఉమ్మడి హైకోర్టును విభజించాల్సిన అవసరాన్ని ప్రధానికి సిఎం కెసిఆర్ నొక్కిచెప్పారని వినోద్‌కుమార్ మీడియాకు వివరించారు. ఎంపిలుగా తామంతా పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వా న్ని పలు సందర్భాల్లో హైకోర్టు విభజన గురించి నిలదీశామని, కేంద్ర హోంమంత్రి, న్యాయశాఖ మంత్రి పార్లమెంటు వేదికగానే సత్వరం విభజన చేపడతామని హామీ ఇచ్చారని, కానీ ఎలాంటి పురోగతి లేదని పేర్కొన్నారు. హైకోర్టు విభజనపై సుప్రీంకోర్టులో పిటిషన్లు కూడా పడ్డాయని గుర్తుచేసిన వినోద్‌కుమార్ ఈ విచారణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం తన అభిప్రాయాన్ని కౌం టర్ అఫిడవిట్‌లో తెలియజేసిందని పేర్కొన్నారు. ప్రధానితో సమావేశమైన ప్రతీసారి కెసిఆర్ ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ఉన్నారని, ఇప్పటివరకు ఒక్క అడుగు కూడా ముం దుకు పడలేదని, తాజా చర్చల్లో ప్రధాని చాలా సానుకూలంగా స్పందించి తప్పకుండా న్యాయం చేస్తామంటూ హామీ ఇచ్చారని పేర్కొన్నారు.

నేడు ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీతో భేటీ
విభజన చట్టం ప్రకారం తెలంగాణ ప్రభుత్వానికి ప్రతీ ఏటా జిల్లా కు రూ. 50 కోట్ల చొప్పున తొమ్మిది వెనకబడిన జిల్లాలకు రూ. 450 కోట్లు రావాల్సి ఉందని, ఇప్పటివరకు మూడు విడతలు మాత్రమే విడుదలైందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి నాల్గవ విడతగా విడుదల కావాల్సి ఉందని, వెంటనే విడుదలయ్యేలా చొరవ తీసుకోవాలని ప్రధానికి కెసిఆర్ విజ్ఞప్తి చేశారని వినోద్‌కుమార్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ. 50 కోట్ల చొప్పున ఏడు జిల్లాలకు రూ. 350 కోట్లు విడుదలైందని, తెలంగాణకు మాత్రం విడుదల కాలేదని కెసిఆర్ వివరించారని తెలిపారు. అరుణ్‌జైట్లీతో వెంటనే సమావేశం కావాలని ప్రధాని సూచించారని, ఆదివారం మధ్యాహ్నం భేటీ అవుతున్నామని తెలిపారు. ఇదే సమావేశంలో ఎఫ్‌ఆర్‌బిఎం ద్వారా రాష్ట్ర జిడిపిలో 3.5% మేరకు రుణం పొందేలా కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ నుంచి అనుమతి తీసుకుంటామని తెలిపారు. జిఎస్‌టికి సంబంధించిన కొన్ని అంశాలు కూడా జైట్లీతో చర్చించాల్సి ఉందని తెలిపారు.