Home ఎడిటోరియల్ హరిత మానవతా సందేశం సినారె కవిత్వం

హరిత మానవతా సందేశం సినారె కవిత్వం

CNR2సినారె గారి సాహిత్యం అపారం. పద్దెనిమిది ప్రక్రియల్లో వెలువడింది. వీటిలో కొన్ని సరికొత్తగా సృష్టింపబడి విశేష గౌరవాన్ని పొందాయి. కొన్ని ఇతర భాషల్లోకి అనువదింపబడినాయి. కొన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ, స్వచ్ఛంద  సంస్థల అవార్డులు పొందాయి. మహాకావ్యమైన విశ్వంభరకు జ్ఞానపీఠ్ బహుమతి లభించింది. ఇది మానవేతిహాస మహాకావ్యం. ఆధునిక తెలుగు సాహిత్యంలో ఇదొక అపూర్వ దీర్ఘకావ్యం. ఈ విశ్వంభర అనేక భాషల్లోకి అనువదింపబడింది.  ఇక సినారె గారి పరిశోధనా గ్రంథం “ఆధునికాంధ్ర కవిత్వము -సంప్రదాయములు -ప్రయోగములు” సమన్వయ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినట్టిది.

“ఏదైనా రాయందే
ఈ క్షణాన్ని పోనీయను
కలాన్ని పిండేయందే
కాలాన్ని కదలనీయను
అవసరమైనప్పుడల్లా
అగ్గిపుల్లతో – చీకటి
కొవ్వును కరిగించందే
కొత్త పొద్దు రానీయను!!” – – సినారె
డా. సి. నారాయణ రెడ్డి గారి కవిత్వం కవిత్వంలా ఉంటుంది. దానికి అద్భుత సమ్మోహన శక్తి ఉంటుంది. అమృతనాదంలా అలరిస్తుంది. హరితరాగ ప్రవాహంలా మురిపిస్తుంది. కమ్మని ఆలోచనలకు రెక్కలు కట్టిస్తుంది. మట్టి గుండెలను మణిదీపాలుగా వెలిగిస్తుంది. సమాజ శ్వాసలహరులను ఆరిపోని పరిమళాలుగా అలలెత్తిస్తుంది. నినాదాలను అక్షరామ్నాయనిధులుగా మలుస్తుంది. దేహం నిండా అందాల భంగిమలను తొడుక్కున్న సజీవ శిల్పంలా కవ్విస్తుంది. చిరంతన సత్యాలను సూక్తి స్వరాలుగా నిరంతరం పలికిస్తుంది. హృదయమెత్తి పిలుస్తుంది. ఉదయాలలో హృదయమై నినదిస్తుంది. విశ్వవ్యాప్తమైన చరాచర జగత్తును సుందర రాగోద్యా నంలా చిత్రిస్తుంది. కాల పరిణామ వ్యూహాల దశల అలజడుల నుంచి మనిషిని ఉద్ధరించి మాధవునిగా తీర్చిదిద్దుతుంది. ఇంకా విశ్వంలోని అణువు అణువునూ మనోహరంగా వర్ణిస్తుంది.
హరిత చైతన్య నినాదంతో మనిషిని పరిపూర్ణంగా సంస్కరించడానికి కలాన్ని పరుగులు తీయిస్తూ అశేష ప్రజావళి హృదయాలలో నిలిచిన సినారె గారు 29 జులై 1931న కరీంనగర్ జిల్లా హనుమాజిపేట గ్రామంలో జన్మించారు. కన్నతల్లి శ్రీమతి బుచ్చమ్మగారు బ్రతికినంత కాలము ‘బంగరు మమతల పొంగించిన పాలవెల్లి’. కన్నతండ్రి శ్రీ మల్లారెడ్డి గారు నాగలి నడిపిన కర్షకమణి.“పదుగురు పాలేర్లున్నా” “నల్లని రేగళ్లు దున్ని” వ్యవసా య క్షేత్రంతో పాటు కవిగారి బ్రతుకున రవ్వలు పండించిన కర్షకమణి. ఆ దంపతులకు శ్రీ సత్యనారాయణ స్వామి అనుగ్రహం వల్ల తమ ప్రియ పుత్రుడికి సత్యనారాయణ రెడ్డి అని పేరు పెట్టారు. అయితే సత్యనారాయణ రెడ్డి పేరులో ముందున్న “సత్య” సాహిత్యంలో స్థిరపడగా, ‘సి.నారాయణ రెడ్డి’ ‘సినారె’ పేరుతో జగత్ప్రసిద్ధులైన మహా కవిగా విశేష ఖ్యాతినార్జించడం జరిగింది.
సినారె గారికి పదేళ్ల వయస్సు వస్తుండగానే కవిత్వం పట్టుబడింది. పల్లె మట్టి వాసన, పైరుల గుండెల్లో ప్రవహించే ‘హరిత రాగ సౌందర్యం, సెలకన్నెల అలలపై విరబూసిన సోయగం, గ్రామ వీధుల్లో కుమ్మరించిన హరిదాసుల కీర్తనా సౌభాగ్యం ఆయన బాల్య హృదయాన్ని మృదువుగా కవ్వించాయి. ఫలితంగా పాటలై రసజ్ఞ జగత్తును ఊగించాయి. అందుకే సినారె గారు “పలుకగలిగిన దెల్ల పాట”, “ఎన్ని తెన్నుల కైతకన్నె విహరించినను పాటలోనే నాదు “ప్రాణాలు గలవందు” అని ఉద్ఘాటించారు. గేయ కవితకు పట్టాభిషేకం జరిపించిన ఘనకీర్తి పొందారు.
సినారె గారి సాహిత్యం అపారం. పద్దెనిమిది ప్రక్రియల్లో వెలువడింది. వీటిలో కొన్ని సరికొత్తగా సృష్టింపబడి విశేష గౌరవాన్ని పొందాయి. కొన్ని ఇతర భాషల్లోకి అనువదింపబడినాయి. కొన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థల అవార్డులు పొందాయి. మహాకావ్యమైన విశ్వంభరకు జ్ఞానపీఠ్ బహుమతి లభించింది. ఇది మానవేతిహాస మహాకావ్యం. ఆధునిక తెలుగు సాహిత్యంలో ఇదొక అపూర్వ దీర్ఘకావ్యం. ఈ విశ్వంభర అనేక భాషల్లోకి అనువదింపబడింది. ఇక సినారె గారి పరిశోధనా గ్రంథం “ఆధునికాంధ్ర కవిత్వము -సంప్రదాయములు -ప్రయోగములు” సమన్వయ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినట్టిది.
సినారెగారు అనేక పదవులకు వన్నె, వాసి తెచ్చారు. వాటిలో వైస్ ఛాన్స్‌లర్, అధికార భాషా సంఘం అధ్యక్షుడు, సాంస్కృతిక మండలి అధ్యక్షుడు, తెలంగాణ సారస్వత పరిషత్తు అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు వంటివి ఆయన పరిపాలనా సామర్థాన్ని తెలుపుతాయి. సినారెగారి సాహిత్యాన్ని గురించి అనేక పరిశోధనలు (ఎం.ఫిల్, పిహెచ్‌డి) జరిగాయి. అంతేకాక ఆయన పేరుతో సంస్థలు అవతరించాయి. అవార్డులు అందించబడుతున్నాయి.
సినారె గారి ప్రతి పుట్టిన రోజును అభిమానులు వైభవంగా జరిపిస్తారు. అదే రోజున సినారె గారు ఒక గ్రంథాన్ని తెలుగు సాహిత్య ప్రపంచానికి అందిస్తుంటారు. ఇలాంటి సాహిత్యాక్షర వసంతోత్సవం మరొక కవికి జరిగినట్టు లేదు.
సినారెగారి సాహిత్యంలో చలన చిత్ర గీతాలు, లలిత గీతాలు బాగా ప్రాచురాన్ని పొందాయి. ఆ గీతాల్లోని సాహితీ ముత్యాలను తెలిపే గ్రంథాలు కూడా వెలువడ్డాయి.
బాల్యవయస్సు నుంచే కవితారచనకుపక్రమించిన సినారె గారు ప్రకృతిని, గ్రామీణ జీవితాన్ని వర్ణిస్తూ అభ్యుదయం వైపు నడిచారు. ప్రతి రచనలో మానవతా విలువలను ఉదాత్తంగా ప్రతిష్ఠించారు. అయితే సినారెగారు ఏ ఇజానికీ కట్టుబడలేదు. మానవత్వమే ఆయన ఇజం.
సినారెగారు కవిత్వానికిచ్చిన నిర్వచనం ఇట్లా ఉంది.
“కవిత్వమంటే
కర్రుమొనలోంచి మట్టి పలికినట్టుండాలి
చెమట ఆవిరిలోంచి మబ్బుపట్టినట్టుండాలి
వెయ్యి పిడికిళ్లు ఒక్క లయలో ఉరిమితే
అది నినాదం
నగ్న నినాదం శబ్ద చైతన్యాన్ని తొడుక్కుంటే
అది కవిత్వం”
అని కవిత్వానికి సరికొత్త సూత్రాన్ని ప్రతిపాదించారు.
“నా వాదం సామ్యవేదం
కవిత్వం నా మాతృభాష
ఇతివృత్తం మానవత్వం”
అని తన లక్షాన్ని తెలిపి
“నమస్కరిస్తాను
నమ్మిన నిజానికి కట్టుబడ్డ ఇజానికి
దొడ్డి దారి సంభావనలతో
దొరతనం ప్రభ వెలిగిస్తుంటే
కళ్లలోకి సూటిగా చూసి
గాండ్రించి ఉమ్మేసే నిజాయితికి”
అని ధనస్వామ్యాన్ని ధిక్కరించారు.

“పేరేమో సింగిరెడ్డి
నారాయణరెడ్డి కాని
కులం కీళ్లు విరిచిన
కలానికి సన్మానం”
అని ప్రకటించిన సినారె గారికి తన బాల్య దశ నుంచే కులభేదాలు తొలగాలనే సంకల్పం బలంగా ఉండేది.
“మాలమాలయని మచ్చరించి మీ
సాలు దువ్వెదవదేలా!
మాలడే మహామంత్రియైన పూ
మాల వేసెదవదేలా!”
అనడం ఆయన సమదృష్టిని ప్రస్ఫుటం చేస్తుంది. అట్లాగే మత ఘర్షణలను నివారించడం కోసం ఆయన రాసిన కవితలనేకం
“ఎవడు హిందు వెవడుతురక? ఎవడురా కిరస్తానీ
ఎవరిది తెలుగెవరిదరవమెవరిది హిందుస్తానీ?
ఒకే తోట వికసించిన రకరకాల పువ్వులురా
ఒకేవాణి గుడిలో వెలుగొందిన మణి దివ్వెలురా”
అనేది ఒక ఉజ్వల సందేశం.
“తమ్మి పూవులను, తుమ్మ పూలనొక
దండలోని కెక్కించి
వీధిమానిసికి సౌధవాసికి
భేదభావమును త్రుంచీ
ఎల్లవారు మనగల్గినప్పుడే” సమత్వం స్థిరపడి
మనిషి జీవితంలో సమాజ హృదయంలో ప్రశాంతత స్థిరపడుతుందని ఉద్ఘాటించడం జరిగింది.
“పంచేంద్రియాలనే కాదు
ప్రపంచాన్నే
రాయిలా నిలిపేవాడు
రుషి
రాయిలా పడివున్న
ప్రపంచాన్ని
అహల్యగా మలిచేవాడు
మనిషి” అని మనిషిని నిర్వచించి
“ఉప్పెనలో తలవొగ్గక నిలువున ఉబికొచ్చేది జీవితం
ఓటమిలో నిట్టూర్చక రివ్వున ఉరికొచ్చేదే జీవితం
చచ్చేదాకా బ్రతికివుండటం జాతకాలలో ఉన్నదే
ప్రలోభాలుపై బడినా నీతికి పడిచచ్చేదే జీవితం.”
అని అసలైన జీవన గమనాన్ని నిర్దేషించారు. సినారె గారు ఏ విషయాన్ని తీసుకున్నా కమ్మని కవితాత్మతో రమణీయంగా ఉంటుంది. పాఠకులలో చైతన్యాన్ని మానవత్వాన్ని వికసింపజేస్తుంది. ఆయన రచనా సంకల్పంతో ఈ వ్యాసాన్ని ముగిస్తాను.
“రాస్తూ రాస్తూ పోతాను – సి
రా ఇంకే వరకు
పోతూపోతూ రాస్తాను – వ
పువు వాడే వరకు”