Home మంచిర్యాల గోదావరిపై మరో వంతెనకు గ్రీన్ సిగ్నల్

గోదావరిపై మరో వంతెనకు గ్రీన్ సిగ్నల్

dam

* మంచిర్యాల వద్ద రూ. 100 కోట్లతో నిర్మాణం
* సూచన ప్రాయంగా అంగీకరించిన సిఎం
* ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేసిన ఆర్‌అండ్‌బిశాఖ
* నిజామాబాద్‌జగ్దల్‌పూర్ రహదారుల అనుసంధానం

మన తెలంగాణ/మంచిర్యాల ప్రతినిధి   నది పై మరో భారీ వంతెన నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరో ఏడాది కాలంలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మంత్రులు, ఎంఎల్‌ఏలు సిఎంపై ఒత్తిడి తేవడంతో శుక్రవారం సూచన ప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం. అదే విధంగా రాబోయే ఎన్నికల్లో స్థానికుల కలను సాకారంచేసి, ప్రజల్లో విశ్వాసం పొందవచ్చునని సిఎంకు తెలుపడంతో గోదావరి నదిపై మరో వంతెన నిర్మాణానికి కసరత్తులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కిలోమీటర్ పొడవుతో దాదాపు రూ. 100 కోట్ల వ్యయంతో ఈ వంతెనను నిర్మించనున్నారు. గోదావరి ఇవతల వైపు రామగుండం, రాజీవ్ రహదారిని అటువైపు గోదావరి ఎగువన మంచిర్యాల మీదుగా సాగుతున్న నిజామాబాద్‌మంచిర్యాలజగ్దల్ పూర్ జాతీయ రహదారికి అనుసంధానంగా దీనిని నిర్మించేందుకు ఆర్‌అండ్‌బి అధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. పలువురు మంత్రులు, ఎంఎల్‌ఏలు, మూడేళ్ల క్రితమే ప్రతిపాదనలు పంపగా అప్పట్లో ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించకపోవడంతో ఈ వంతెన పనులు పెండింగ్‌లో పడ్డాయి. తాజాగా పలువురు మంత్రులు, ఎంఎల్‌ఏలు సిఎంను కలిసి పరిస్థితు లు వివరించగా సానుకూలంగా స్పందించారు. దీంతో ఆర్‌అండ్‌బి అధికారులు డిపిఆర్ సిద్దం చేసి, టెండర్లను ఆహ్వానించనున్నారు. గోదావరిపై  గోదావరిఖని వద్ద ఈ వంతెన ఉండగా ఇక్కడి నుంచే గోదావరి నదిని దాటి మంచిర్యాలకు వెళ్లాల్సి ఉంటుంది. మంచిర్యాల వైపు నుండి రామగుండం రావాలంటే మంచిర్యాల వద్ద రైలు వంతెన మాత్రమే ఉండడంతో రోడ్డు ప్రయాణికులు 15 కిలోమీటర్ల దూరం వచ్చి వంతెన దాటి వెనక్కి రావాల్సి ఉంటుంది. నదిలో నీరు లేని సమయంలో రైలు వంతెన సమీపం నుంచి దాటి నేరుగా అంతర్గాం మీదుగా తక్కువ దూరంతో ప్రయాణించి వెళ్తుంటారు. మంచిర్యాల వద్ద వంతెన నిర్మించినట్లయితే దూర భారం తగ్గడంతో పాటు ఇంధనం కూడా ఆదా అవుతుంది. వంతెన, రోడ్డులు కలిపి దాదాపు రూ. 100 కోట్లు ఖర్చు వస్తుందని, రోడ్డు భవనాల శాఖ అధికారులు ప్రాథమిక అంచనాలు వేశారు. గోదావరి నదిపై మరో వంతెన నిర్మించినట్లయితే దశాబ్దాల కాలంగా ఎదురు చూస్తున్న ప్రజల కలలు సాకారమయ్యే అవకాశాలు ఉన్నాయి.