Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

సిర్పూర్ పేపర్ మిల్లుకు గ్రీన్ సిగ్నల్

Green Signal for Sirpur Paper Mill

మిల్లు పునరుద్ధరణకు ఎన్‌సిఎల్‌టి అనుకూల తీర్పు
మాట నిలబెట్టుకున్న సిఎం కెసిఆర్
తెరిపించేందుకు కృషి చేసిన మంత్రి కెటిఆర్, ఎంఎల్‌ఏ కోనప్ప
ప్రోత్సాహకాలు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
కాగజ్‌నగర్‌లో మిన్నంటిన కార్మికుల సంబురాలు 

మన తెలంగాణ/మంచిర్యాల : కొమురంభీం జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలోని సిర్పూర్ పేపర్ మిల్లులో మళ్లీ యంత్రాలు కదలనున్నాయి. కాగజ్‌నగర్‌కు మళ్లీ పూర్వపు కాగితపు కళ సంతరించుకోనుంది. మిల్లు పునరుద్ధరణకు నాలుగేళ్ల తరువాత నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సిఎల్‌టి)కోర్టు గురువారం మిల్లు తెరిచేందుకు అనుకూలంగా తీర్పునిచ్చింది. గుజరాత్‌కు చెందిన జెకె పేపర్‌మిల్స్ యాజమాన్యం మిల్లును పునరుద్దరించుకోవచ్చునని ట్రిబునల్ కోర్టు హైదరాబాద్ బెంచ్ రిజిస్ట్రార్ పివిఎస్‌ఎస్ కళాధర్ తీర్పులో పేర్కొన్నారు. సిర్పూర్ ఎంఎల్‌ఏ కోనేరు కోనప్పతో పాటు పలువురు మహిళలు ట్రిబ్యునల్ కోర్టుకు హజరు కాగా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ట్రిబ్యునల్ కోర్టు గురువారం ఉదయం అనుకూలంగా తీర్పును వెలువరించడంతో మళ్లీ పేపర్ మిల్లులో కదలికలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే గుజరాత్‌కుచెందిన జెకె పేపర్‌మిల్స్ ప్రతినిధులు పలు సార్లు ఎస్‌పిఎంను సందర్శించి యంత్రాలను పరిశీలించారు. గత ఏడాది కాలంగా మిల్లును తెరిపించే ప్రక్రియ జరుగుతుండగా ఎంఎల్‌ఏ కోనేరు కోనప్ప పలు సార్లు జెకె ప్రతినిధులతో చర్చలు జరిపారు. మిల్లును మళ్లీ తెరిపిస్తామన్న సిఎం కేసిఆర్ మాట నిలబెట్టుకోగా మంత్రి కేటిఆర్ సైతం ముంబయిలో జెకె పేపర్‌మిల్స్ యాజమాన్యంతో చర్చలు జరిపారు. దీంతో పేపర్‌మిల్లు కార్మికుల జీవితాల్లో వెలుగులు నిండనున్నాయి. తీర్పు వెలువరించిన వెంటనే కాగజ్‌నగర్ పట్టణంలో కార్మికులు, పట్టణ వాసులు, టిఆర్‌ఎస్ నాయకుల సంబురాలు మిన్నంటాయి. గురువారం కాగజ్‌నగర్ పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. మిల్లులో పని చేసే దాదాపు 10 వేల మంది కార్మికుల జీవితాల్లో వెలుగులు నిండనున్నాయి.

పేపర్ మిల్లు పునరుద్ధరణకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు
సిర్పూర్ పేపర్ మిల్లు పునరుద్ధరణకు తెలంగాణ ప్రభుత్వం ఎన్నో ప్రోత్సాహకాలను ప్రకటించింది. మిల్లును ఎలాగైనా తెరిపించాలని జెకె పేపర్‌మిల్స్ యాజమాన్యం పెట్టిన షరతులను అంగీకరించింది. పదేళ్ల పాటు ఎస్‌జిఎస్‌టి మినహాయింపు ఇవ్వడంతో పాటు వందశాతం స్టాంపుడ్యూటీ మినహాయించడంతో పాటు రూ. 50 కోట్ల వరకు పెట్టుబడి రాయితీ కలిపించింది. ప్రభుత్వ అటవీ ప్రాంతం నుంచి పదేళ్ల పాటు డీమార్క్‌డ్ నీలగిరి, సుబాబుల్‌లను రాయితీపై సరఫరా చేసేందుకు, బొగ్గును రిజర్వుచేసి, 10 సంవత్సరాల పాటు సరఫరా చేస్తూ టన్నుకు రూ. వెయ్యి రాయితీ కల్పించింది. కొత్త గా పెట్టే పెట్టుబడిపై ఐదేళ్ల పాటు వడ్డీలో 2 శాతం రాయితీ కల్పించింది. రెండు నెలల్లో అన్ని లైసెన్స్‌లకు ఆమోదం లభించే విధంగాచర్యలు తీసుకోవడం, యూనిట్ కోసం మొక్కల పెంపకానికి అటవీ, బీడు భూములను కేటాయించడం 10 ఏళ్ల పాటు విద్యుత్ సుంకం మినహాయించడమే కాకుండా రాయితీ కల్పించడం లాంటి ప్రోత్సాహాకాలను ప్రభుత్వం జెకె పేపర్ మిల్స్ యాజమాన్యానికి అందజేసింది. దీంతో మిల్లు పునరుద్ధరణకు మార్గం సుగమమైంది.

మంత్రి కెటిఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన కోనప్ప
సిర్పూర్ పేపర్‌మిల్లు పునరుద్ధరణకు ఎన్‌సిఎల్‌టి కోర్టు గురువారం అనుకూలంగా తీర్పును ఇవ్వడంతో హైదరాబాద్‌లో ఉన్న సిర్పూర్ ఎంఎల్‌ఏ కోనప్ప , పంచాయతీ రాజ్‌శాఖ ఐటి మంత్రి కేటిఆర్‌ను కలసి కృతజ్ఞతలు తెలిపారు. సిఎం కేసిఆర్ ప్రత్యేక శ్రద్దతోనే మిల్లు పునఃప్రారంభం అవుతుందని కోనప్ప అన్నారు.జెకె పేపర్‌మిల్లు యాజమాన్యం ప్రతినిధులు మిల్లును త్వరలోనే తెరవడానికి సిద్దంగా ఉ న్నారని ఇప్పటికే యంత్రాలను పరిశీలించారన్నారు. ఈ సందర్భంగా ఎంఎల్ ఏ కోనప్పను మంత్రి కేటిఆర్ అభినందించారు.

Comments

comments