Home రాష్ట్ర వార్తలు మరి మూడు ప్రాజెక్టులు

మరి మూడు ప్రాజెక్టులు

ph1

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొత్త జలాశయాలకు గ్రీన్‌సిగ్నల్
1.42 టిఎంసిలతో పిప్పల్  కోటి వద్ద, 0.7 టిఎంసిలతో గోమూత్రి వాగుపైన, 5.30 టిఎంసిలతో కుప్టి రిజర్వాయర్లు

మన తెలంగాణ/ హైదరాబాద్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు కొత్తగా మరో మూడు జలాశయాల నిర్మాణానికి ప్రభుత్వం శనివా రం ఆమోదం తెలిపింది. కుప్టి, పిప్పల్ కోటి, గోమూత్రి రిజర్వాయర్ల నిర్మాణానికి రాష్ర్ట ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పిప్పల్ కోటి వద్ద 1.42 టిఎంసిలు, గోమూత్రి వాగుపై 0.7 టిఎంసిలు, 5.30 టిఎంసిల తో కుప్టి రిజర్వాయర్లు నిర్మాణం కానున్నా యి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు గత 40 సంవత్సారాలుగా పెన్‌గంగ నీటి కోసం ఎదురుచూస్తున్నారు. ఆదిలాబాద్ తలాపున పెన్‌గంగ ఉధృతంగా పారుతున్నా అవి సముద్రంలోకి పోయాయి తప్ప ఆదిలాబాద్ పశ్చిమ జిల్లా రైతాంగానికి మాత్రం చుక్క నీరు కూడా దక్కలేదు. ఆ ప్రజల చిరకాల వాంచ అయిన పెన్‌గంగ నీరు తాంసి, భీం పూర్, బేల, జైనద్ మండలాల భూములను తడపబోతున్నది. వెంగళరావు ఉమ్మడి రాష్ర్ట ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలో1975 లోమహారాష్ట్రా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య లోయర్ పెన్ గంగ ప్రాజెక్టుపై సూత్రప్రాయమైన ఒప్పందం కుదిరింది. మహారాష్ర్టలోని యవత్మాల్ జిల్లా ఘటాంజి తాలూకా తాడ్సోలి గ్రామం వద్ద లోయర్ పెన్ గంగ డ్యాం నిర్మాణానికి రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరింది.లోయర్ పెన్ గంగ డ్యాం వద్ద లభ్యమయ్యే నీటిని 88 : 12 నిష్పత్తిలో మహారాష్ర్ట , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు వినియోగించుకోవాలి. ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే ఖర్చుని కూడా అదే నిష్పత్తిలో భరించాలి. పిప్పల్ కోటి జలాశయం ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో బోథ్ నియోజకవర్గంలో ఉన్నది. పెన్ గంగ లో నీటి ప్రవాహాలు ఉన్నప్పుడు చనాక కొరాట బ్యారేజీ నుంచి నీటిని ఎత్తిపోసి పిప్పల్ కోటి జలాశయంలో నిల్వ చేస్తారు. పెన్ గంగలో నీటి ప్రవాహాలు తగ్గిపోయిన తర్వాత పిప్పల్ కోటి జలాశయం నుండి గ్రావిటి కాలువ కి.మీ 47 వద్ద నీటిని వదులుతారు. దీని కింద 37,500 ఎకరాలకు రెండో పంటకు నికరంగా నీరు సరఫరా జరగనున్నది. గోముత్రి వాగు పై నిర్మించే జలాశయంలో గోమూత్రి వాగు పరివాహక ప్రాంతం నుంచి వచ్చే నీటిని నిల్వ చేస్తారు. ఈ జలాశయం భీంపూర్ మండలం బోథ్ నియోజకవర్గంలో ఉన్నది.కడం నదిపై కుప్టి వద్ద ఒక జలాశయం నిర్మాణానికి అనువైన ప్రదేశం ఉన్నదని ఇంజనీర్లు ప్రాథమిక అధ్యయనంలో తేల్చినారు. కడం జలాశయానికి ఎప్పుడు అవసరం పడితే అప్పుడు నీరు సరఫరా చేయడంతో పాటు , 3 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి , దిగువన కుంటాల జలపాతానికి జనవరి నుంచి జూన్ దాకా నీటి ప్రవాహాలు విడుదల చేయడానికి , భవిష్యత్తులో మిషన్ భగీరధకు అనుసందానం చేయడానికి వెసులుబాటు ఉంటుంది. భూసేకరణ, పునరావాసం సహా జలాశయం నిర్మాణానికి అయ్యే ఖర్చు 870 కోట్లుగా అంచనా వేశారు. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదించింది.గత ఫిబ్రవరి 27 న ముఖ్యమంత్రి చనాకకోరాట బ్యారేజి ని సందర్శించి పనులను సమీక్షించారు.ఆనంతరం ఆదిలాబాద్ లో జరిగిన సభలో 5.3 టిఎంసి ల సామర్ధ్యంతో కుప్టి రిజర్వాయర్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. లోయర్ పెనుగంగా ప్రాజెక్టులో భాగంగా 1.423 టిఎంసి ల సామర్థ్యంతో పిప్పల్ కోటి జలాశయాన్ని , గోమూత్రి వాగుపై 0.7 టిఎంసి ల సామర్థ్యంతో మరో జలాశయాన్ని నిర్మించనున్నారు.