Home ఎడిటోరియల్ జిహెచ్‌ఎంసి ఎన్నికలకు పచ్చజెండా

జిహెచ్‌ఎంసి ఎన్నికలకు పచ్చజెండా

GHMCగ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎన్నికల ప్రక్రియను జనవరి 31లోగా పూర్తిచేస్తామని రాష్ట్రప్రభుత్వం హైకోర్టుకు హామీ ఇచ్చింది. ఎన్నుకోబడిన కౌన్సిల్ పదవీకాలం 2014 డిసెంబర్‌లో ముగిసినప్పటికీ అనేక కారణాలతో ప్రత్యేకాధికారి పాలన కొనసాగు తోంది. జిహెచ్‌ఎంసి పరిధిలో పాలక టిఆర్‌ఎస్ బలహీనంగా ఉన్నట్లు సార్వత్రిక ఎన్నికల ఫలితాలు తేటతెల్లం చేసినందున, కార్పొరేషన్ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధపడలేదన్న ఆరోపణలున్నాయి. అనంతర కాలంలో పార్టీని పటిష్టపరుచుకునేందుకు, తెలంగాణవాదుల ఏకీకరణ పేరుతో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ‘ఆకర్షించింది’, అదేసమయంలో నగరంలో అభివృద్ధి కార్యక్రమాలను ముమ్మరం చేసింది. హైదరాబాద్‌ను ‘విశ్వనగరం’గా మార్చుతామంటూ పలు బృహత్‌పథకాలు ప్రకటించింది.
ఐదేళ్లకు కచ్చితంగా ఎన్నికలు జరపాలన్న రాజ్యాంగ చట్ట ఆదేశానికి విరుద్ధంగా రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక అధికారి పాలన కొనసాగి స్తోందని, ఎన్నికలనిర్వహణకు ఆదేశించాలని ‘సుపరిపాలన వేదిక’ తరఫున ఎం.పద్మనాభరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారిస్తోంది. డివిజన్‌ల (వార్డుల) సంఖ్య పెంపుదల, పునర్విభజన పేరుతో ప్రభుత్వం ఇంతకుముందు గడువు తీసుకుంది. పెరిగిన జనాభాకు మెరుగ్గా సేవలందించే నిమిత్తం డివిజన్‌ల సంఖ్యను 150 నుంచి 200లకు పెంచాలని తలపెట్టి, ఆ ప్రక్రియ అంతా పూర్తయినాక, ఏ కారణం చేతనో మనసు మార్చుకుని 150కే పరిమితమై పునర్విభజన ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించింది. 150 డివిజన్‌ల ప్రాథమిక పునర్విభజనను అక్టోబర్ 28న ప్రచురించింది. పునర్విభజన, ఓటర్ల జాబితాల వంటి ప్రాథమిక పనులు పూర్తిచేయటానికి నవంబర్ 27 వరకు, రిజర్వేషన్‌ల ఖరారుకు డిసెంబర్ 15వరకు వ్యవధికోరింది. జనవరి 31 నాటికి ఎన్నికలు పూర్తిచేయటానికి ఉద్దేశించి రూపొందిం చిన కార్యక్రమం ఇది. ఇదిలావుండగా, ఓటర్ల జాబితానుంచి అనేక లక్షలమంది పేర్లు తొలగించారని, ఇతర పక్షాలు గగ్గోలు పెట్టాయి. ఈ అలజడి ఢిల్లీని తాకింది. ఆందోళన చేసింది. ఎట్టకేలకు ఎన్నికల కమిషన్ 14మంది సభ్యుల బృందాన్ని పరిశీలనకు పంపింది. వారు కొన్ని ప్రదేశాలకు వెళ్లి క్షేత్రస్థాయి విచారణకూడా చేశారు. ఈలోపు డివిజన్‌ల హద్దుల నిర్ణయంలో కూడా పాలకపార్టీకి అనుకూలంగా అధికారులు వ్యవహరించారని ఆరోపణలు వచ్చాయి. ఏదిఏమైనా, అన్ని అవరోధాలు తొలగిపోయి, రాష్ట్రప్రభుత్వం హైకోర్టు కిచ్చిన షెడ్యూలు ప్రకారం ఎన్నికల జరుగుతాయని ఆశిద్దాం. ఇంతకాలం ఈ వ్యవహా రాలన్నీ నిర్వహించిన కమిషనర్-స్పెషల్ ఆఫీసర్ సోమేష్ కుమార్ బదిలీ కొసమెరుపు!