Home తాజా వార్తలు ఓటర్ల జాబితా ప్రకటనకు గ్రీన్ సిగ్నల్

ఓటర్ల జాబితా ప్రకటనకు గ్రీన్ సిగ్నల్

Green signal to voters list declaration

ఆ తరువాత వచ్చే అభ్యంతరాలనూ పరిగణనలోకి తీసుకోవాలి: ఇసికి హైకోర్టు ఉత్తర్వులు

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రచురించేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. గత విచారణ సమయంలో జాబితా ప్రచురణ చేయరాదన్న మధ్యంతర ఆదేశాల్ని రద్దు చేసింది. జాబితా ప్రచురించాక అభ్యంతరాలు వ్యక్తం అయితే వాటిని పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఈ నెల 12న జాబితా ప్రకటించుకోవచ్చునని హైకోర్టు చెబుతూనే.. వాటిపై అభ్యంతరాలు తలెత్తితే పరిగణనలోకి తీసుకోవాల్సిందేనని వెల్లడించింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి టి. రాధాకృష్ణన్, న్యాయమూర్తి ఎస్వీ భట్‌లతో కూడిన డివిజన్ బెంచ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంపై డివిజన్ బెంచ్ ఎదుట వాదప్రతివాదనలు కొనసాగాయి. ఓటర్ల జాబితాలో పేర్ల నమోదు, ముసాయి జాబితా అభ్యంతరాల గడువు కుదించడంపై శశిధర్‌రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించగా, హైకోర్టులోనే తేల్చుకోవాలని గత గురువారం ఆదేశించిన విషయం విదితమే.

పిటిషనర్, ఈసీల వాదనల అనంతరం హైకోర్టు డివిజన్ బెంచ్ స్పందిస్తూ.. “ఓటర్ల జాబితాలో తప్పులు లేకుండా అర్హులకు ఓట్లు ఉండేలా చేయాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉంది. ప్రజాస్వామ్యంలో ఓటే అత్యంత కీలకం. పిటిషనర్ ఆరోపణల నేపథ్యంలో ఓటర్ల జాబితాను పోలింగ్ బూత్‌ల వారీగా ప్రచురిస్తేనే కింది స్థాయిలో ఓట్ల వివరాలు చేరతాయి అప్పుడు పోలింగ్ బూత్ స్థాయిలో అభ్యంతరాలు, లోటుపాట్లు వెలుగులోకి వస్తాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో నామినేషన్ల దాఖలు చివరి రోజు వరకూ ఓటర్ల జాబితా మార్పులు చేర్పులు చేసేందుకు వీలుందని ఈసీ చెబుతోంది. అందుకే జాబితా ప్రచురించేందుకు అనుమతి ఇస్తున్నాం. ఆ తర్వాత కూడా అభ్యంతరాలు వస్తే.. వాటిని ఈసీ కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలి.. ”అని ఉత్తర్వులు జారీ చేసింది.

పోలింగ్ బూత్ స్థాయిలో జాబితా ప్రచురణ-వాటిపై అభ్యంతరాలు-వాటి పరిష్కారం.. వంటివి చేసేందుకు ఈసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చెప్పాలని, దీనిపై పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈసీ ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ నెల 12న ఓటర్ల జాబితా తుది జాబితా వెలువరించేందుకు హైకోర్టు అనుమతించింది. అయితే ఆ జాబితాలో లోటుపాట్లు, మార్పులు, చేర్పులు చేసేందుకు ఏర్పాటు చేసే వ్యవస్థ గురించి కూడా స్పష్టం చేయాలని కోరింది. ఓటర్ల నమోదు ప్రక్రియలో లోపాలున్నాయనే అభియోగాలపై విచారణ 12వ తేదీన కొనసాగిస్తామని ప్రకటించింది. ఓటరు జాబితా ప్రచురించాక వచ్చే అభ్యంతరాలను నివృత్తి చేయడానికి, తప్పుఒప్పులను సరిచేసేందుకు ఎలాంటి మార్గదర్శకాలు పాటిస్తారో అఫిడవిట్ రూపంలో కోర్టుకు తెలపాలని ఈసీని ఆదేశించింది. ఓటరు నమోదు ప్రక్రియపై నిబంధనలు ఏం చెబుతున్నాయో కూడా వివరాలు అందించాలని కోరింది. బూత్ వారీగా ఓటర్ల లిస్ట్ ప్రచురణ విషయంలో తీసుకునే విధానాన్ని వివరించాలని కోరింది.

65 లక్షలకుపైగా బోగస్ ఓట్లున్నా..
తొలుత మర్రి శశిధర్‌రెడ్డి తరఫు న్యాయవాది వాదిస్తూ.. ఓటర్ల జాబితాలో బోగస్ పేర్లు ఉన్నాయని, ఏకంగా 65 లక్షలకుపైగా లక్షల బోగస్ ఓట్లు ఉన్నాయని చెప్పారు. రెండేళ్ల నాటి ఓటర్ల జాబితా ఆధారంగా చేసుకుని ఈ విషయాలు చెప్పడం లేదని, ఈ విషయంలో ఈసీ చెబుతున్న విషయాలు వాస్తవం కాదన్నారు. డ్రాఫ్ట్ కాపీలోని పేర్లను చూశాక పోలీసుల ఎదురుకాల్పుల్లో హతమైన తీవ్రవది వికారుద్దీన్ పేరు కూడా ఓటర్ల జాబితాలో ఉందని ఆయన ఉదహరించారు. దారుణమైన లోపాల్ని సవరించకుండానే ఎన్నికల ఓటర్ల జాబితా వెల్లడించరాదన్నారు. పసిపిల్లల పేర్లు కూడా ఓటర్ల జాబితాలో ఉన్నాయన్నారు. ఓటర్ల జాబితా సవరణకు, ఎన్నికలకు సంబంధం లేదని ఈసీ తరఫు లాయర్ దేశాయ్ వాదించారు. నామినేషన్ దాఖలు చేసే ఆఖరి రోజు 3 గంటల వరకూ సవరణలు చేయవచ్చునన్నారు. దీనిపై పిటిషనర్ లాయర్ అభ్యంతరం చెప్పారు. ఇలా చేయడానికి వీల్లేదని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చిందని గుర్తు చేశారు. విచారణ 12వ తేదీ శుక్రవారానికి వాయిదా పడింది. మరోవైపు నిర్ణీత వ్యవధిలోపు శాసనసభను రద్దు చేసి ముందస్తు ఎన్నికలు వెళ్లాలంటే అసెంబ్లీ ఆమోదం పొందాలనే ప్రజాహిత వ్యాజ్యాలపై బుధవారం వాదప్రతివాదనలు ముగిశాయి. తీర్పును తర్వాత వెల్లడిస్తామని హైకోర్టు ప్రకటించింది. అసెంబ్లీ ఆమోదం లేకుండానే క్యాబినెట్ మీటింగ్ తీర్మానం చేస్తే దానిని గవర్నర్ ఆమోదించడం రాజ్యాంగ వ్యతిరేకమని పేర్కొంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి డీకే అరుణ, సిద్దిపేట జిల్లా వాస్తవ్యుడు పోతుగంటి శశాంక్‌రెడ్డి, అభిలాష్‌రెడ్డిలు దాఖలుచేసిన ప్రజా హిత వ్యాజ్యాలపై ఇరుపక్షాల వాదనలు పూర్తి అయ్యాయి.