Search
Friday 16 November 2018
  • :
  • :

భూభారం పెరుగుతున్నదా?

edt

ఇటీవల ప్రకృతి భరించే శక్తి (నేచర్ సస్టెయినబిలిటీ) అనే పత్రంలో కొందరు శాస్త్రవేత్తల బృందం భూమి మహా అయితే 700 కోట్ల జనాభాను మాత్రమే భరించగలదని చెప్పారు. కాని ఈ జూన్ నెలలో జనాభా 760 కోట్లని తెలుస్తోంది. జనాభా అందరికీ ఉత్తమస్థాయి జీవితం సాధించేక్రమంలో భూమి జీవభౌతిక పరిమితులు అతిక్రమించడం జరుగుతుందని, దానివల్ల పర్యావరణ సంక్షోభం నెలకొంటుందని అంటారు.
ఈ మాటలు శాస్త్రీయంగా ఖచ్చితమని చెబుతున్నప్పటికీ, ఇవి చాలా పాత మాటలు. ఇవి కొత్తవి కావు. తాజాగా దీనినే పునరుద్ఘాటించడం జరిగింది. జనాభా, జనాభా అవసరాలు త్వరలోనే భూమి భారమైపోతాయని అంటున్నారు. ఈ మాటలు నిజానికి 19వ శతాబ్దంలో స్టీం ఓడలు మోసుకువెళ్ళే సరుకుల భారాన్ని దృష్టిలో ఉంచుకుని చెప్పిన మాటలు. ఆ తర్వాత హఠాత్తుగా ఓడలు, వాహనాల నుంచి 19వ శతాబ్దం చివరి నాటికి భూమి భరించే శక్తిని తీర్మానించే స్థాయికి వెళ్ళాయి. పర్యావరణంలో గడ్డిమైదానాలు ఎంత సంఖ్యలో పశువులకు పోషణనివ్వగలవో చెప్పడం ప్రారంభమైంది.
పర్యావరణానికి సంబంధించి ఈ భావనలో లోపాలున్నాయి. ఓడలు వాటికవే రెట్టింపై పోవు. ఒక పర్యావరణ వ్యవస్థ సామర్థ్యం ఇంజనీర్ డ్రాయింగ్ రూములో నిర్ధారించడం సాధ్యం కాదు. అయితే, పర్యావరణ శాస్త్రవేత్తలు దశాబ్దాలుగా మానవ సమాజాలకు సంబంధించి ఇదే భావనను ఖచ్చితంగా వర్తింపజేస్తున్నామని చెబుతున్నారు. ఈ మాటలు చెప్పింది పర్యావరణ శాస్త్రవేత్త విలియం వోట్. ఆయన మొదటిసారి అంటే 1940 దశాబ్దంలో ఈ మాటలు చెప్పాడు. వ్యవసాయభూమిని అతిగా వాడడం వల్ల భూమి సారం క్షీణిస్తుందని, చివరకు నాశనమవుతుందని అన్నాడు. 1960 దశకం చివరి నాటికి, 1970 ప్రారంభదినాల్లో పాల్ ఎర్లిచ్ ఆహార ఉత్పత్తిపై దృష్టి పెట్టాడు. తర్వాతి కాలాల్లో పర్యావరణ శాస్త్రవేత్తలు కాలుష్యాలపైనా, పర్యావరణ విధ్వంసంపైనా దృష్టి పెట్టి భూవ్యవస్థపై వాటి ప్రభావాన్ని అధ్యయనం చేసే ప్రయత్నం చేశారు. భూవ్యవస్థపైనే మానవజీవితం ఆధారపడి ఉంది.
కాని అందరూ మానవ పునరుత్పత్తి, మానవ అవసరాలకు సంబంధించి జనాభా నియంత్రణను నొక్కి చెప్పే నియో మాల్థూషియన్ సిద్ధాంతం దృష్టితోనే ఆలోచించారు. 18వ శతాబ్దానికి చెందిన రెవరెండ్ థామస్ రాబర్ట్ మాల్థూస్ నుంచి నేటి వరకు పర్యావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నది ప్రగతి వికాసాల వల్ల మనుషుల జనాభా మరింత పెరుగుతుందని, దానివల్ల వనరుల వినియోగం మరింత పెరుగుతుందని చెప్పడమే. అంటే మనుషులు ఏకకణ జీవుల్లా లేదా దీపపు పురుగుల్లా సంఖ్యలో పెరిగిపోతుంటారు. వనరులన్నీ అంతరించిపోయేవరకు జనాభా ఇలా పెరిగిపోతూ ఉంటుందన్నదే ఈ భావన.
కాని వాస్తవానికి మానవజనాభా పెరుగుదల, వనరుల వాడకం అనేది ఇలా జరగడం లేదు. ప్రగతి వికాసాలు, ఆధునికత వల్ల మానవ పునరుత్పాదక రేటు తగ్గుతోంది కాని పెరగడం లేదు. భౌతికంగా మనిషి జీవన పరిస్థితులు మెరుగైనప్పుడు పిల్లల సంఖ్య తగ్గుతుందే కాని ఎక్కువ కావడం లేదు. గత 200 సంవత్సరాలుగా మానవజనాభా విస్ఫోటన అనేది మానవ పునరుత్పాదక రేటు పెరగడం వల్ల కాదు, శిశుమరణాల రేటు తగ్గడం వల్ల చోటు చేసుకుంది. మెరుగైన ప్రజారోగ్యం, పోషకాహారం, భౌతికమైన వసతులు, ప్రజలకు భద్రత వగైరా కారణాల వల్ల మనుషులు గతంలో కన్నా ఎక్కువ కాలం జీవిస్తున్నారు.
ప్రస్తుతం అమెరికా, యూరప్, జపాన్, చాలా వరకు లాటిన్ అమెరికా, కొంతవరకు ఇండియాలో పునరుత్పత్తి రేటు తగ్గిపోయింది. దంపతులు ఇద్దరు పిల్లలనే కలిగి ఉంటున్నారు. రానున్న దశాబ్దాల్లో ప్రపంచంలోని చాలా దేశాల్లో ఇలా జరగవచ్చు. ఫలితంగా చాలా మంది డెమోగ్రాఫర్ల ప్రకారం మానవజనాభా గరిష్ఠ స్థాయికి చేరుకుంటుంది. ఆ తర్వాత జనాభా పడిపోవడం ప్రారంభమవుతుంది. ఈ శతాబ్దం చివరి నాటికి చాలా దేశాల్లో జనాభా తగ్గడం ప్రారంభమవుతుందని భావిస్తున్నారు.
అందువల్లనే నేడు పర్యావరణ సంక్షోభాలకు అధిక జనాభా కారణమన్న వాదన వినబడడం లేదు. వనరుల అతి వాడకం కారణం కావచ్చన్న వాదన వినిపిస్తున్నది. ఇప్పుడు చాలా మంది చెప్పేదేమంటే, మానవ సమాజాలు ఏకకణ జీవుల వంటివి కావు. కాని పెట్టుబడిదారీ వ్యవస్థ మాత్రం ఏకకణజీవి వంటిదే. వనరులను వాడుకోవడంలో అనియమిత ప్రగతి లేకపోతే బతికి బట్టకట్టలేదు. ఈ వాదనను సమర్ధించే ఆధారాలు పెద్దగా లేవు. దీనికి విరుద్దంగా చాలా మార్కెట్ చోదిత ఆర్థిక వ్యవస్థలు వనరులను తక్కువ వాడుకుని ప్రగతి సాధించే ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రజలు గ్రామీణ వ్యవసాయిక నేపథ్యం నుంచి ఆధునిక పారిశ్రామిక ప్రాంతాలకు తరలి పోవడంతో పాటు వారి జీవితాల్లోను మార్పు వచ్చింది. తర్వాత ఈ ధోరణి కూడా తగ్గుముఖం పట్టింది. ఇప్పుడు అమెరికా కూడా ఏటా 2 శాతం ప్రగతి నమోదు చేయడానికి కూడా తంటాలు పడుతోంది.
సంపన్న ఆర్ధికవ్యవస్థలు మార్పుకు గురవుతున్నాయి. ఒకప్పుడు ఆర్ధిక ఉత్పాదకతలో తయారీ రంగం కేవలం 20 శాతం ఉండేది. ఉద్యోగ కల్పనలో కూడా అంతే వాటా ఉండేది. నేడు ఇది 10 శాతానికి పడిపోయింది. ఇప్పుడు ఉత్పాదకత ప్రధానంగా సేవారంగం నుంచి వస్తున్నది. ఈ రంగంలో వనరులు, శక్తి వాడకం తక్కువే. అభివృద్ధి చెందిన దేశాల్లో దశాబ్దాలుగా ఆర్ధిక ప్రగతిలో క్రమేణా వనరుల వాడకం తగ్గుతూ వస్తోంది. ఎందుకంటే డిమాండ్ సంతృప్తస్థాయికి చేరుకోవడం దానికి కారణం. ఏది ఏమైనా భూ సామర్థ్యాన్ని మనం దాటిపోయే భయం లేదని కూడా పూర్తిగా చెప్పలేం. నిజానికి కొందరు పర్యావరణ శాస్త్రవేత్తల ప్రకారం భూమి సామర్థ్యాన్ని మించి పోయింది జనాభా. కాని భూమి సామర్థ్యం స్థిరంగా గతంలో ఊహించినంత మాత్రమే ఉంటుందనుకోవడంలోనే తప్పుంది.
నిజానికి మానవజాతి పర్యావరణాన్న మరింత ఉత్పాదకంగా మార్చుకుంటోంది. అడవులను గడ్డిమైదానాలుగా, వ్యవసాయభూములుగా మార్చేసింది. మొక్కలు, జంతువులు మనిషికి మరింత ఉపయోగకరమైనవాటిని ఎంచుకోవడం జరిగింది. భూమి సామర్థ్యాన్ని మరింత పెంచడం మనిషికి సాధ్యమే. అణుశక్తి, సౌరశక్తి కావలసిన శక్తి అవసరాలను తీర్చడానికి ఉన్నాయి. పైగా ఇవి కార్బన్ వాయువులు విడుదల చేసే భయం కూడా లేదు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు పెరిగే జనాభాకు అవసరమైన ఆహారం కూడా అందించగలవు. కాని ఈ భవిష్యత్తు చాలా మందికి, భూమి సామర్థ్యం పరిమితమని వాదించేవారికి రుచించేది కాదు. కాని ఇందులో ఆశావాదం ఉంది. వివేకంతో విజ్ఞానంతో మానవజాతి భవిష్యత్తును నిర్మించుకోగలదు. భూమి సామర్థ్యం ప్రకారం మానవప్రగతిని నిరోధించాలనుకోవడం సరయిన ఆలోచన కాదు.
మాల్థూస్ అధిక సంతానం గురించి మాట్లాడాడు, ఎర్లిచ్ పేద దేశాలకు ఆహారసహాయాన్ని నిరసించాడు. బలవంతంగా కుటుంబ నియంత్రణ గురించి కూడా వాదించారు. ఇప్పుడు కోట్లాది మందిని వ్యవసాయిక సంక్షోభంలో ముంచేసే పరిస్థితిని నివారించకుండా భూమి పరిమితుల గురించి మాట్లాడం జరుగుతోంది. ఏది ఏమైనా, మానవ సమాజాలపై కుహనా కల్పిత పరిమితులను విధించడం సరయిన పద్ధతి కాదు. భూమిపై మానవజాతి చరిత్రను పరిశీలిస్తే మనిషి ఈ భూమిని తన అవసరాలకు అనుగుణంగా అనేకసార్లు అనేకరకాలుగా తయారు చేసుకున్నాడు.

*  టెడ్ నార్డాస్  (దివైర్)

Comments

comments