Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

90,669 కోట్లు వసూళ్లు

 ఆగస్టులో తగ్గిన జిఎస్‌టి ఆదాయం
 కేంద్ర జిఎస్‌టి నుంచి రూ.14,402 కోట్లు
 రాష్ట్ర జిఎస్‌టి నుంచి రూ.21,067 కోట్లు
 ఉమ్మడి జిఎస్‌టి ద్వారా రూ. 47,377 కోట్లు
 గణాంకాలను వెల్లడించిన ప్రభుత్వం

GSTన్యూఢిల్లీ : ఆగస్టు నెలలో జిఎస్‌టి(వస్తు, సేవల పన్ను) ద్వారా రూ.90,669 కోట్ల వసూళ్లు వచ్చాయి. పరోక్ష పన్ను వ్యవస్థ జిఎస్‌టి జులైలో ప్రారంభించిన విషయం తెలిసిందే. జులైలో జిఎస్‌టి నుంచి రూ.94,063 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. అయితే జులై నెలతో పోలిస్తే ఆగస్టులో జిఎస్‌టి వసూళ్లు తగ్గుముఖం పట్టాయి. ఆగస్టులో మొత్తం కేంద్ర జిఎస్‌టి(సి జిఎస్‌టి) నుంచి రూ.14,402  కోట్లు, అదే సమయంలో రాష్ట్ర జిఎస్‌టి(ఎస్‌జిఎస్‌టి) నుంచి రూ.21,067 కోట్లు, ఉమ్మడి జిఎస్‌టి(ఐజిఎస్‌టి) ద్వారా రూ. 47,377 కోట్లు సేకరించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. లగ్జరీ వస్తువులపై నష్టపరిహార సుంకం ద్వారా రూ.7,823 కోట్లు ప్రభుత్వ ఖజానాకు వచ్చాయి. పైన పేర్కొన్న గణాంకాల్లో జిఎస్‌టిలో చేరని రూ.10.24 లక్షల అస్సెస్సీలు చెల్లించిన పన్నులను చేర్చలేదు. ఇప్పటికీ అనేకమంది పన్ను చెల్లించే వ్యక్తులు.. జులై లేదా ఆగస్టు రిటర్న్‌లను దాఖలు చేయలేదని ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల్లో తెలిపారు. 2017 ఆగస్టు నెలకు జిఎస్‌టి చెల్లింపులు.. అలాగే జిఎస్‌టిఆర్ 3బి రిటర్న్‌లకు ఆఖరు తేదీ సెప్టెంబర్ 20గా నిర్ణయించారు. ఆగస్టు నెలకు మొత్తం పన్ను చెల్లింపుదారులు 68.20 లక్షలు(సెప్టెంబర్ 25 తేదీనాటికి) ఉండ గా, జిఎస్‌టిఆర్ 3బి రిటర్న్‌లను 37.63 లక్షల మంది దాఖలు చేశారు. ఎక్సైజ్ సుంకం వంటి కేంద్ర, రాష్ట్రాల పన్నుల స్థానంలో దేశవ్యాప్తంగా జిఎస్‌టిని అమలు చేశారు. జులైలో మొత్తం జిఎస్‌టి ఆదాయం (ఆగస్టు 29వరకు) రూ.92,283 కోట్లుగా ఉంది. మొత్తం సిజిఎస్‌టి ఆదాయం రూ. 14,894 కోట్లు, ఎస్‌జిఎస్‌టి ఆదా యం రూ.22,722 కోట్లు, ఐజిఎస్‌టి ఆదాయం రూ. 47,469 కోట్లుగా ఉంది. దీనిలో దిగుమతుల నుంచి ఐజిఎస్‌టి రూ.20,964 కోట్లు ఉంది. నష్టపరిహార సుంకం రూ.7,198 కోట్లు ఉంది. కాగా జిఎస్‌టిని రూపొందించడానికి అనేక సూత్రాలను, మార్గదర్శకాలను పరిగణనలోనికి తీసుకున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆధ్వర్యంలో జిఎస్‌టి కౌన్సిల్ పలుమార్లు సమావేశమై పన్నులపై నిర్ణయాలు తీసుకుంది. జిఎస్‌టిలో విలీనం చేసే పన్నులు ప్రాథమికంగా వస్తువుల సరఫరా, సేవల సరఫరాపై విధించే పరోక్ష పన్నులు ఉంటాయి. పరోక్ష పన్ను వ్యవస్థలో రాష్ట్రంలోపల, రాష్ట్రాల మధ్య పన్నుల విషయంలో తగిన జాగ్రత్తలు పాటించారు. కేంద్ర, రాష్ట్ర ప్ర భుత్వాలు విధిస్తున్న17 రకాల పన్నులను ఒకే పన్ను విధానమైన జిఎస్‌టి పరిధిలోకి వస్తాయి. ఈ విధానం వల్ల ఉమ్మడి జాతీయ మార్కెట్‌కు మార్గం ఏర్పడుతుంది. వస్తువులపై పన్నుల భారం తగ్గడమే కాకుండా స్వదేశీ, విదేశీ మార్కెట్లలో దేశీయ ఉత్పత్తులకు పోటీ పెరిగి ఆర్థికాభివృద్ధికి దారితీస్తుందని భావిస్తున్నారు. జులై నుంచి అమలులోనికి వచ్చినజిఎస్‌టిలో 0, 3, 5, 12, 18, 28 శాతాలతో ఆరు శ్లాబులు వున్నాయి. పన్నులేనివి జీరో లోనికి, బంగారం మాత్రమే 3 శాతం శ్లాబులో వుంది. జిఎస్‌టిలో విలీనం చేయనివి మినహా మిగతావన్నీ ఇతర శ్లాబులలో ఉంటాయి. జిఎస్‌టిలో మూడు రకాలున్నా యి. సెంట్రల్ జిఎస్‌టిలో కేంద్ర ఎక్సైజ్ సుంకం, ఎక్సైజ్ సుంకాలు, అదనపు ఎక్సైజ్ సుంకాలు, కస్టమ్ సుంకాలు, సర్వీస్ టాక్స్‌లు విలీనం అయ్యాయి. స్టేట్ జిఎస్‌టిలో విలువ ఆధారిత పన్ను(వ్యాట్), అమ్మకం పన్ను, విలాస సుంకం, ప్రవేశ సుంకం, వినోదం మరియు ఉల్లాసపు పన్ను, ప్రకటనలపై విధించే పన్ను, కొనుగోలు సుంకం, లాటరీలు, పందాలు, జూదంపై విధించే పన్ను దీనిలో విలీనం అయ్యాయి. ఇంటిగ్రేటెడ్ జిఎస్‌టిలో- ఏవైనా ఉత్పత్తులు రెండు రాష్ట్రాల మధ్య జరిగిన పక్షంలో ఐజిఎస్‌టి పరిధిలోనికి వస్తాయి. ఇక్కడగూడా ఒకే రకమైన పన్ను వుంటుంది. ఈ పన్ను ఉత్పత్తి చేసిన రాష్ట్రానికి కాకుండా వినియోగం చేసిన రాష్ట్రానికి చెందుతుంది.

Comments

comments