Home బిజినెస్ జిఎస్‌టి అంటే ‘గుడ్‌బై టు సింపుల్ ట్యాక్స్’

జిఎస్‌టి అంటే ‘గుడ్‌బై టు సింపుల్ ట్యాక్స్’

 కపిల్ సిబల్ కొత్త భాష్యం
Kapilన్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను(జిఎస్‌టి) అంటే ‘గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్’ (మంచి, సులువైన పన్ను)అన్న ప్రధాని చెప్పింది కాదని అది ‘గుడ్‌బై టు సింపుల్ ట్యాక్స్’ (సులువైన పన్నుకు వీడ్కోలు) అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కపిల్ సిబల్ శనివారం అన్నారు. జిఎస్‌టి ప్రభుత్వానికి మేలేగానీ సామాన్యుడికి చెడ్డది అన్నారు. జిఎస్‌టి దేశంలోని చిన్న, మధ్యతరహా వ్యాపారులను, వాణిజ్యాన్ని బాగా దెబ్బతీసిందన్నారు. జిఎస్‌టి సులువుగా ఉండాలని నాటి యుపిఎ ప్రభుత్వం కోరుకుందని, కానీ ఇప్పుడది తారుమారుగా మారిందని ఆయన విలేకరులకు చెప్పారు.‘ ప్రభుత్వం ఏదైనా పెద్ద చర్య చేపట్టినప్పుడల్లా అది దేశ ఆర్థిక విధానాన్నే మార్చేసింది. ప్రజలు విస్తుబోతే, ప్రధానేమో విదేశీ పర్యటనల్లో బిజీ అయిపోయారు’ అన్నారు. అనేక శ్లాబులున్న జిఎస్‌టి సంపన్నులకు మేలు చేసేది, బీదలకు , చిన్న వ్యాపారులకు వేధన కలిగించేదేనని చెప్పారు.
జిఎస్‌టి అనేది ఒకే దేశం-ఒకే పన్ను కాదని, జిఎస్‌టిపై మున్సిపల్ ట్యాక్స్‌లు విధించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉందని మాజీ కేంద్ర మంత్రి సిబల్ తెలిపారు. ఇది తమిళనాడులో సినిమాలపై రుజువైందన్నారు. మహారాష్ట్ర సైతం కొత్త కార్ల రిజిస్ట్రేషనుపై 2 శాతం పన్ను విధిస్తోందన్నారు. మీడియా రిపోర్టులను ఉటంకిస్తూ ప్రైవేట్ పెట్టుబడి 1992 నుంచి అతి కనిష్ఠానికి చేరుకుందన్నారు. 1000 ఆర్థికేతర సంస్థల డాటా దీనిని తెలుపుతోందన్నారు. జిఎస్‌టి అంశాల గురించి మాట్లాడుతూ ఎవరైనా రూ. 5 కోట్ల పన్నును ఎగవేస్తే శిక్షార్హమైన నేరం(కాగ్నిజేబుల్ అఫెన్స్), అదే రూ. 2 కోట్ల నుంచి రూ. 5 కోట్ల వరకుంటే శిక్షార్హం కానీ నేరం(నాన్-కాగ్నిజేబుల్ అఫెన్స్) అని ఆయన వివరించారు. ‘ప్రతి రోజు వారి వెనుక ఇన్‌స్పెక్టర్ పడతాడు, ప్రతి రోజు వారి వెనుక పన్ను అధికారులు వెంటపడతారు. ఇంతకీ వర్తకులు వ్యాపారం చేసుకోవాలా లేక దుకాణాలు మూసేసుకోవాలా?’ అని ఆయన ప్రశ్నించారు. సామాన్యులు వినియోగించే లూజ్ ఐటమ్‌లపై పన్ను ఉండదని, కానీ పిండి, బిస్కట్లు ప్యాకేజయి ఉంటే మాత్రం పన్ను ఉంటుందని సిబల్ చెప్పారు. ఇదివరలో వస్త్రాలపై పన్ను ఉండేది కాదు. అలాగే వస్త్ర వ్యాపారులపై పన్ను ఉండేది కాదు. కానీ ఇప్పుడు వారిపై కూడా 5 శాతం పన్ను పడింది. ఇది వారిని వణికిస్తోందన్నారు.
చిన్న వస్త్ర వ్యాపారులు ఇదివరలో క్రెడిట్‌పై సరకు తీసుకుని వ్యాపారాలు చేస్తుండే వారు. ఇప్పుడు వారి వద్ద వ్యాపారానికి నగదు లేదు. లూధియానాలోవలే వస్త్ర మార్కెట్లు చాలా వరకు మూతపడ్డాయి. రూ. 20 లక్షల టర్నోవరు కన్నా తక్కువ వ్యాపారం చేసేవారు ఇదివరలో రిజిస్ట్రేషను చేయించుకోవలసిన అవసరం ఉండేది కాదు. కానీ ఇప్పుడు వారి వర్తకం రూ. 20 లక్షలు దాటితే మాత్రం రిజిస్ట్రేషను తప్పనిసరి అయిందని సిబల్ చెప్పారు. హస్తకళాకారులు, వర్తకులు ఇదివరలో జాబ్‌వర్క్ చేస్తుండే వారు. కానీ వారి నుంచి కొనే వ్యక్తి మాత్రం ఇప్పుడు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. పైగా సెల్ఫ్-ఇన్వాయిస్ చింపాల్సి ఉంటుంది. ఇప్పుడు వారు తమకు ఇన్‌పుట్ క్రెడిటే అందనప్పుడు ఎందుకు పన్ను కట్టాలని అడుగుతున్నారని కపిల్ సిబల్ వివరించారు. పెద్ద కార్లపై పన్ను తగ్గించారు. కానీ చిన్నకార్లపై పన్ను పెంచారని ఆయన చెప్పుకొచ్చారు. ఎసిలపై కూడా పన్ను విధించారు. దేశంలో పెద్ద నోట్ల రద్దు తర్వాత , ఇప్పుడు జిఎస్‌టి ప్రజలపై ప్రభావం చూపుతోందన్నారు.
ప్రభుత్వం ఇ-వే బిల్లు ప్రవేశపెట్టాలని చర్చిస్తుండడం వల్ల లాజిస్టిక్స్ (సరకు రవాణా) వ్యాపారం కూడా మూతబడిందని, అన్ని అంతర్రాష్ట్ర రవాణా వ్యాపారాలు మూతబడ్డాయని సిబల్ అన్నారు. ఆక్ట్రాయ్ మూతపడ్డా లారీలు నిలిచిపోయాయన్నారు. ఇప్పటికీ 50 శాతం వ్యాపారం మూతపడిందన్నారు. రవాణ, వస్త్ర రంగాలు దెబ్బతిన్నాయన్నారు. ఎగుమతులు కూడా పెరగడంలేదని చెప్పారు. కస్టమ్స్ వద్ద ఇన్‌వెంటరీలు తీసుకుంటున్నారు. కానీ ఇన్‌పుట్ క్రెడిట్ ఎక్కడ పొందాలో వారికి తెలియడంలేదన్నారు. ఎగుమతి వ్యాపారంలో మూలధనం స్థిరంగా ప్రవహించాలన్నారు. ‘ఒకవేళ ఇన్‌వెంటరీలు మూతపడితే, వ్యాపారంలోకి మూలధనం తిరిగిరాదు. అది వ్యాపారాన్ని దెబ్బతీస్తుంది. కనుక ఇన్‌పుట్ క్రెడిట్ ఎప్పుడొస్తుందో వ్యాపారులకు తెలియదు. అసలు వారికది ఎప్పుడు వస్తుంది?’ ఆయన ప్రశ్నించారు.
రూ. 75 లక్షల టర్నోవర్ దాటితే పన్ను కట్టాల్సి వస్తుంది. కనుక వ్యాపారులు పన్ను నుంచి తప్పించుకునేందుకు కుటుంబ సభ్యుల పేరిట వాటిని చిన్నచిన్న సంస్థలుగా విభజించేస్తున్నారని సిబల్ చెప్పారు.