Search
Wednesday 21 November 2018
  • :
  • :

సెప్టెంబర్‌లో జిఎస్‌టి వసూళ్లు 92,150 కోట్లు

GST

న్యూఢిల్లీ: సెప్టెంబర్ నెలలో జిఎస్‌టి(వస్తు, సేవల పన్ను) వసూళ్లు రూ.92,150 కోట్లు నమోదయ్యాయి. 42.91 లక్షల వ్యాపార సంస్థల నుంచి ఈ వసూళ్లు వచ్చినట్టు మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ వెల్లడించింది. దీనిలో కేంద్ర జిఎస్‌టి నుంచి రూ.14,042 కోట్లు, అదే సమయంలో రాష్ట్రాల జిఎస్‌టి నుంచి రూ.21,172 కోట్లు వచ్చాయి. ఉమ్మడి జిఎస్‌టి నుంచి రూ.48,948 కోట్లు, దిగుమతుల నుంచి రూ. 23,951 కోట్లు వసూలు అయ్యాయని ప్రభుత్వం ప్రకటించింది. 2017 సెప్టెంబర్ నాటికి మొత్తం జిఎస్‌టి రెవెన్యూ  రూ.92,150 కోట్లు ఉంటుందని ఆర్థిక మంత్రిత్వశాఖ పేర్కొంది. సెప్టెంబర్‌లో పరిహార సుంకం కింద వసూళ్లు రూ.7,988 కోట్లు ఉండగా, దీనిలో దిగుమతుల నుంచి రూ.722 కోట్లు ఉన్నాయి. మంగళవారం నాటికి దాదాపు 42.91 వ్యాపార సంస్థలు ప్రాథమిక జిఎస్‌టిఆర్3బి రిటర్న్ దాఖలు చేశాయి. గణాంకాల ప్రకారం, జిఎస్‌టి వసూళ్లు జులై నెలలో రూ. 95,000 కోట్లకు పైగా, అదే సమయంలో ఆగస్టు నెలలో రూ.91,000 కోట్లకు పైగా నమోదు అయ్యాయి. జిఎస్‌టిని ప్రారంభించిన సెప్టెంబర్ నాటికి మూడు కావొస్తోంది. కాగా జిఎస్‌టి రేట్లలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని ఇటీవల రెవెన్యూ కార్యదర్శి హష్ముఖ్ అధియా పేర్కొన్నారు. జిఎస్‌టి అమల్లోకి వచ్చి నాలుగు నెలలే కావొస్తోందని, ఇది నిలకడ స్థితికి రావాలంటే కనీసం ఏడాది సమయమైన పడుతుందని అన్నారు. చిన్న, మధ్యతరహా వ్యాపారాలపై భారం తగ్గించేందుకు జిఎస్‌టి రేట్లను పునఃపరిశీలించాల్సి ఉందని అన్నారు. ఎక్సైజ్ సుంకం, సేవా పన్ను, వ్యా ట్ వంటి పలు కేంద్ర, రాష్ట్ర పన్నుల కలయికతో జిఎస్‌టి ఏర్పడిందని, ఇది నిలకడగా కొనసాగేందుకు కనీసం ఏడాది సమయమైనా పడుతుందని అన్నారు. జిఎస్‌టి కౌన్సిల్ అనేకసార్లు సమావేశమై జిఎస్‌టి రేట్లలో మార్పులు కూడా చేపట్టిందని ఆయన వివరించారు. 100 వస్తువుల వరకు రేట్లలో జిఎస్‌టి కౌన్సిల్ మార్పులు చేపట్టిందని, ఎగుమతిదారులకు రీఫండ్ ప్రక్రియను సులభతరం చేసిందని అన్నారు. ప్రస్తుతం నాలుగు జిఎస్‌టి శ్లాబులు 5, 12, 18, 28 శాతంగా ఉన్నాయి. కొన్నిటిపై సున్నా శాతం, బంగారం వజ్రాభరణాలపై 3 శాతం, పలు ఆటో మొబైల్ వస్తువులపై 28 శాతం కంటే ఎక్కువ పన్నులు వసూలు చేస్తున్నామని, వీటిలో మార్పులు తీసుకురానున్నామని తెలిపారు. బంగారం వజ్రాభరణాలు కూడా 4 శాతం శ్లాబు పరిధి లోకే వస్తాయన్నారు. 12, 18 శాతం శ్లాబులకు ప్రత్యామ్నాయంగా 16 శాతం శ్లాబు విధానంలోకి పలు రకాల వస్తువులు తీసుకురాన్నుట్లు తెలిపారు. 28 శాతం పన్ను శ్లాబును కూడా 24 శాతానికి తగ్గించనున్నట్లు తెలిపారు.

Comments

comments