Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

జిఎస్‌టి వసూళ్లు పెరిగాయ్..

gst

న్యూఢిల్లీ: అక్టోబర్, నవంబర్ నెలల్లో క్షీణించిన జిఎస్‌టి(వస్తు, సేవల పన్ను) వసూళ్లు డిసెంబర్‌లో పెరిగింది. 2018 జనవరి 24నాటికి డిసెంబర్ నెల వసూళ్లు రూ.86,703 కోట్లు వచ్చినట్టు గురువారం ఆర్థికమంత్రిత్వశాఖ వెల్లడించింది. ఈ ఏడాది జనవరి 24 వరకు జిఎస్‌టి కింద మొత్తం కోటి మంది పన్ను చెల్లింపుదారులు రిజిస్టర్ కాగా, వీరిలో 17.11 లక్షల మంది కంపోజిషన్ డీలర్లున్నారని ఆర్థిక శాఖ పేర్కొంది. ఇప్పటి వరకు 56.30 లక్షల మంది జిఎస్‌టిఆర్ 3బి రిటర్నులను దాఖలు చేశారు. 2017 డిసెంబర్ త్రైమాసికానికి మొత్తం 9.25 లక్షల రిటర్నులను మాత్రమే కంపోజిషన్ డీలర్లు దాఖలు చేయగా, రూ.421.35 కోట్లు వసూళ్లు వచ్చాయి. గత రెండు నెలల నుంచి జిఎస్‌టి వసూళ్లు భారీగా తగ్గిన సంగతి తెలిసిందే. వచ్చే వారంలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో వసూళ్లు పెరిగి, కేంద్రానికి మంచి ఊతం అందించాయి. గతేడాది జులై 1 నుంచి జిఎస్‌టి అమల్లోకి వచ్చాక తొలి మూడు నెలలు రూ.90వేల కోట్లకు పైగా వసూళ్లను వచ్చాయి.. ఆ తర్వాత వసూళ్లు తగ్గుముఖం పట్టాయి. అక్టోబరులో రూ.83వేల కోట్లు రాగా.. నవంబరులో మరింత తగ్గి రూ.80వేల కోట్లు మాత్రమే వచ్చాయి.
జిఎస్‌టి నుంచి వినియోగదారులకు ఊరట కలిగించేందుకు జిఎస్‌టి కౌన్సిల్ ఎప్పటికప్పుడు సమావేశమై పన్నుల భారాన్ని తగ్గిస్తూ నిర్ణయాలు తీసుకుంటూనే వస్తోంది. ఈనెల 18న మరోసారి సమావేశమైన జిఎస్‌టి మండలి 29 వస్తువులు, 54 విభాగాల్లోని సేవలపై పన్ను తగ్గిస్తున్నట్లు నిర్ణయించిన విషయం తెలిసిందే. తగ్గించిన పన్ను రేట్లు గురువారం నుంచే అమలవుతున్నాయి. డిసెంబర్ వరకు జిఎస్‌టి కింద 99 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు రిజిస్టర్ చేసుకున్నారు.

Comments

comments