Home వరంగల్ గిన్నిస్ రికార్డ్

గిన్నిస్ రికార్డ్

Guiness-Record

వరంగల్ క్రైం: మహిళలకు భద్రత కల్పించడం కోసమే రాష్ట్రంలో షీ టీంలు ఏర్పాటు చేయడం జరిగిందని రాష్ట్ర డిజిపి అనురాగ్‌శర్మ అన్నారు. వరంగల్ పోలీస్ కమీషనరేట్ ఆద్వర్యంలో బుధవారం హన్మకొండ జెఎన్‌ఎస్‌లో నిర్వహించిన ‘స్వశక్తి’ కార్యక్రమాన్ని డిజిపి ప్రారంభించి మాట్లాడారు. దేశ చరిత్రలోనే ‘స్వశక్తి’ చిరస్మరణీయంగా నిలుస్తుందని పేర్కొన్నారు. అందరూ గర్వపడేలా కార్యక్రమం నిర్వహించండం అభినందనీయమన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలు అన్నిరంగాల్లోనూ పురుషులతో సమానంగా రాణిస్తున్నారని తెలిపారు. విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాలలోనూ ప్రతిభ చూపుతున్నారన్నారు.

మహిళలు తమ వ్యక్తిగత సమస్యలతో ఇబ్బందులు పడుతున్నప్పుడు తల్లిదండ్రులతోనైనా, స్నేహితులతోపాటు షీ టీంలను సంప్రదించి సలహాలు, సూచనలే కాకుండా సహకారం తీసుకోవచ్చని సూచించారు. ఫలితంగా సమస్యకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలు, విద్యార్థినీల కోసం ఏర్పాటు చేసిన షీ టీంలతో ఎన్నో సమస్యలు పరిష్కరించబడుతున్నాయ న్నారు. మహిళలు, విద్యార్థినీల పట్ల ఆకతాయిలు అసభ్యంగా ప్రవర్తించే సందర్భాలలో షీ టీంలకు సమాచారం ఇవ్వడం మూలంగా ఈవ్ టీజర్లను పట్టుకుని కౌన్సిలింగ్ చేస్తున్నామని అన్నారు. అంతేకాకుండా వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్‌తోపాటు నిర్భయలాంటి కేసులు, చట్టాల గురించి వివరిస్తున్నట్లు తెలిపారు.

దేశ చరిత్రలో నిలిచేలా మహిళలు, విద్యార్థినీల కోసం సెల్ఫ్ డిఫెన్స్ అవేర్‌నెస్ కార్యక్రమం చేపట్టడం, గిన్నిస్ రికార్డులో చోటు దక్కేలా 21,276మందితో ప్రోగ్రాం విజయవంతం చేయడం ఎంతో సంతోషకరమని, కమిషనర్‌తోపాటు సిబ్బంది చొరవ ప్రశంసనీ యమని కొనియాడారు. వరంగల్ పోలీస్ కమీషనర్ గొట్టె సుధీర్‌బాబు మాట్లాడుతూ.. మహిళల భద్రత కోసం ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంద న్నారు. మహిళలకు భద్రత ఉన్నప్పుడే ఆ ప్రాంతం అభివృద్ధి చెందడంతో పాటు పరిశ్రమల ఏర్పాటుకు పెట్టుబడుదారులు ముందుకు వస్తారని అభిప్రాయపడ్డారు. మహిళలలో ఆత్మస్థైర్యం పెంపొందించేందుకే ‘స్వశక్తి’ పేరిట ఒక రోజు శిక్షణా తరగతులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వరంగల్ అర్బన్ కలెక్టర్ అమ్రపాలి, కార్పొరేషన్ కమిఒషనర్ శృతి ఓజా, జిల్లా న్యాయసేవా సంస్థ న్యాయమూర్తి నీలిమలతోపాటు ఎసిపిలు, సిఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

సిడి, బుక్ ఆవిష్కరణ..

వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆద్వర్యంలో మహిళల రక్షణకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలతో రూపొందించిన లఘు చిత్రం సిడిని, మహిళల రక్షణ కోసం అమలుతో ఉన్నటువంటి చట్టాల గురించి సమగ్ర వివరాలతో కూడిన పుస్తకాన్ని డిజిపి అనురాగ్‌శర్మ ఆవిష్కరించారు. ప్రస్తుత పరిస్థితులలో మహిళల భద్రత కోసం ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని చెప్పారు.

స్వశక్తికి చక్కని స్పందన…

హన్మకొండ జెఎన్‌ఎస్‌లో మహిళల సెల్ఫ్ డిఫెన్స్ అవేర్‌నెస్ కోసం ‘స్వశక్తి’ పేరిట నిర్వహించిన కార్యక్రమానికి చక్కని స్పందన లభించింది. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కమీషనర్ సుధీర్‌బాబు ప్రత్యేక చొరవ తీసుకుని అన్ని మహిళా కళాశాలలకు సమాచారం ఇవ్వడమే కాకుండా పేర్లు నమోదు చేసుకోవడం కోసం వెబ్‌సైట్ ఏర్పాటు చేసుకోగా 27 వేలకుపైగా మహిళలు, విద్యార్థినీలు పేర్లు నమోదు చేసుకున్నారు. దీంతో కమీషనర్ గిన్నిస్ రికార్డులోకి చేరే అవకాశం ఉందని తెలుసుకుని మరింత దృష్టి సారించారు. కమిషనరేట్ పరిధిలోని జనగాం, పరకాల, నర్సంపేటతోపాటు ఇతర పట్టణాలకు చెందిన అధికారుల సహకారంతో కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా రూపకల్పన చేశారు. అంతేకాకుండా 14 సార్లు గిన్నిస్ రికార్డులోకెక్కిన జయసింహ అనే నిపుణుడిని స్టేడియంకు తీసుకురావడమే కాకుండా సలహాలు,సూచనలు తీసుకున్నారు. అనుకున్నట్లుగానే వేలాదిగా మహిళలు, విద్యార్థినీలు తరలిరావడంతో పోలీసు శాఖలో కొత్త ఉత్సాహం నెలకొంది.

మాస్టర్ లక్ష్మిటిప్స్…
హన్మకొండ జెఎన్‌ఎస్‌లో నిర్వహించిన స్వశక్తి కార్యక్రమంలో భాగంగా రాణీ రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ వ్యవస్థాపకురాలు లక్ష్మి మహిళలు, విద్యార్థినీలకు వివిధ రకాల కరాటే టిప్స్ నేర్పించారు. దాడి జరిగే సందర్భాలలో ఎలా అడ్డుకోవాలో ప్రాక్టికల్‌గా చేసి చూపించారు. ఆత్మరక్షణ కోసం ఎలా వ్యవహరించాలో వివరించారు. ఇదిలా ఉండగా చిన్నారుల కళాప్రదర్శన, పేరిణి నృత్యాలు అలరించాయి.