Home తాజా వార్తలు టిఆర్‌ఎస్‌కు గుజరాతీల మద్దతు

టిఆర్‌ఎస్‌కు గుజరాతీల మద్దతు

Talasani Srinivas Yadavసిఎం కెసిఆర్ అభివృద్ధి సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శం: మంత్రి తలసాని
కోలేటి ఆధ్వర్యంలో సంఘీభావం

మనతెలంగాణ/హైదరాబాద్: చరిత్రాత్మకమైన హైదరాబాద్‌ను అంతర్జాతీయ హంగులతో విశ్వనగరిగా టిఆర్‌ఎస్ ప్రభుత్వం తీర్చిదిద్దుతుందని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పునరుద్ఘాటించారు. హైదరాబాద్ విశ్వనగరి మాస్టర్ ప్లాన్ ముఖ్యమంత్రి కెసిఆర్ రూపొందించి అమలు చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. అయితే సిఎంకు తోడుగా 16 మంది టిఆర్‌ఎస్ పార్లమెంట్ సభ్యులు తోడుంటే కేంద్రం మెడలు వంచి తెలంగాణకు రావల్సిన నిధులను సాధించి మరికొన్ని కొత్తపథకాలను ప్రవేశపెట్టి దేశానికి తెలంగాణను ఆదర్శంగా తీర్చిదిద్దుతారని ఆయన చెప్పారు. ఆదివారం గుజరాత్ భవన్‌లో ఏర్పాటు చేసిన పార్లమెంట్ ఎన్నికల ప్రచార సమావేశంలో తెలంగాణ రాష్ట్ర పోలీసు హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ కొలేటి దామోదర్ గుప్తా ఆధ్వర్యంలో సుమారు నాలుగు వేల మంది గుజరాతీలు టిఆర్‌ఎస్ పార్టీకి సంఘీభావం ప్రకటించారు. టిఆర్‌ఎస్ ఎంపి అభ్యర్థులను గెలిపిస్తామని ప్రతిమపూనారు.

ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ గుజరాతీలు టిఆర్‌ఎస్‌కు సంఘీభావం ప్రకటించడం శుభపరిణామంగా అభివర్ణించారు. భారీ మెజారిటీతో సికింద్రాబాద్ టిఆర్‌ఎస్ ఆభ్యర్థి తలసాని సాయి కిరణ్‌తో పాటు రాష్ట్రంలోని టిఆర్‌ఎస్ అభ్యర్థులందరిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తిచేశారు. రాష్ట్రముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శమన్నారు.24 గంటల విద్యుత్‌తో పాటు సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి తెలంగాణను సిఎం కెసిఆర్ అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. నామాదిరిగానే తలసాని సాయికిరణ్ ప్రజలందరికీ ఎప్పుడూ అందుబాటులో ఉంటారని హామీ ఇచ్చారు. పార్లమెంట్ అభ్యర్థిగా పోటీలో ఉన్న తలసాని సాయికిరణ్‌ను ఆశీర్వదించాలన్నారు. ఈ కార్యక్రమంలో గుజరాత్ స్కూల్ ట్యాక్స్ మినహాయింపుపై గుజరాత్ సేవాసమాజ్ అధ్యక్షుడు ఘన్‌శ్యామ్ పటేల్, కార్యదర్శి జనక్ భాయ్,జ్వాష్ భాయ్ పటేల్, నరేంద్ర, కుందన్ తదితరులు మంత్రి తలసాని దృష్టికి తీసుకురాగా గుజరాత్ స్కూల్ ట్యాక్స్ మినహాయింపుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

పోలీసు హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా మాట్లాడుతూ దేశానికి ముఖ్యమంత్రి కెసిఆర్ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు ఆదర్శమయ్యాయని చెప్పారు. సిఎం కెసిఆర్ మానసపుత్రికైన రైతుబంధు పథకం తెలంగాణలో రైతుల జీవనప్రమాణాలను పెంచుతుందన్నారు. ఈ పథకం దేశంలోని అనేక రాష్ట్రాలు, పేరుమార్చి కేంద్రం అమలు చేయడంతో దేశంలోని కోట్లాది రైతులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. విభిన్నమతాలు, కూలాలు, సంప్రదాయాలు, ఆచారవ్యవహారాలు ఉన్న హైదరాబాద్‌ను విశ్వనగరంగా సిఎం కెసిఆర్ తీర్చిదిద్దుతున్నారని చెప్పారు. అన్నిరాష్ట్రాల ప్రజలు శాంతి,సామరస్యంతో జీవిస్తున్న హైదరాబాద్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతున్న టిఆర్‌ఎస్ ప్రభుత్వం దేశానికి దిక్చూచిగా నిలిచిందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ అభివృద్ధి,సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శమైన నేపథ్యంలో 16 మంది పార్లమెంట్ సభ్యులను సిఎం కెసిఆర్‌కు తోడుగా పంపిస్తే తెలంగాణకు కొత్తపథకాలు వస్తాయని చెప్పారు. ప్రజలంతా టిఆర్‌ఎస్ అభ్యర్థులను ఆశీర్వదించి పార్లమెంట్‌కు పంపాలని కోలేటి దామోదర్ గుప్తా కోరారు.

Gujaratis have Declared solidarity to the TRS Party