Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు

  • రాణించిన శ్రేయస్, ఫించ్‌మెరుపులు వృథా

Delhi-Won

కాన్పూర్ : ఢిల్లీ డేర్‌డెవిల్స్ మరోసారి భారీ స్కోర్ల మ్యాచ్‌లో విజయం సాధించింది. గుజరాత్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ రెండు వికెట్ల తేడాతో జయకేతనం ఎగుర వేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ శ్రేయస్ అయ్యర్ (96) అద్భుత బ్యాటింగ్ నైపుణ్యాన్ని కనబరచడంతో మరో రెండు బంతులు మిగిలివుండగానే 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ఒక దశలో 15 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకున్న ఢిల్లీని శ్రేయస్ ఆదుకున్నాడు. గుజరాత్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు నడిపించాడు. అతనికి కరుణ్ నాయర్ అండగా నిలిచాడు. ప్రారంభం నుంచే దూకుడుగా ఆడిన శ్రేయస్ ప్రత్యర్థి బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. వరుస బౌండరీలతో స్కోరును పరిగెత్తించాడు. అతన్ని కట్టడి చేసందుకు గుజరాత్ బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ క్రమంలో 33 బంతుల్లోనే 8ఫోర్లు, మరో సిక్సర్‌తో తన అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఒకవైపు సహచరులు ఒక్కొక్కరూ పెవిలియన్ చేరుతున్నా శ్రేయస్ పోరాటాన్ని వీడలేదు. కీలక బ్యాటింగ్‌తో జట్టును లక్షం దిశగా నడిపించాడు. కాగా, చివరి ఓవర్లలో గుజరాత్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఒక దశలో ఢిల్లీ కష్టాల్లో చిక్కుకున్నట్టు కనిపించింది. అయితే శ్రేయస్ 57 బంతుల్లో 15 బౌండరీలు, రెండు సిక్సర్లతో 96 పరుగులు చేసి చివరి ఓవర్లో పెవిలియన్ చేరాడు. తర్వాత వచ్చిన మిశ్రా వరుసగా రెండు బౌండరీలు కొట్టడంతో ఢిల్లీ అద్భుత విజయాన్ని అందుకుంది.
ఫించ్ మెరుపులు…
అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్‌ను అరొన్ ఫించ్ ఆదుకున్నాడు. ఢిల్లీ బౌలర్లను హడలెత్తించిన ఫించ్ అద్భుత అర్ధ సెంచరీని నమోదు చేశాడు. ప్రారంభం నుంచే ధాటిగా ఆడిన ఫించ్ 39 బంతుల్లోనే 4సిక్సర్లు, మరో ఆరు బౌండరీలతో 69 పరుగులు సాధించాడు. దినేష్ కార్తీక్ కూడా నాలుగు ఫోర్లు, సిక్స్‌తో వేగంగా 40 పరుగులు చేశాడు. దీంతో గుజరాత్ స్కోరు 195 పరుగులకు చేరింది.
సంక్షిప్త స్కోర్లు
గుజరాత్ లయన్స్: 20 ఓవర్లలో 195/5(ఫించ్ 69, దినేష్ కార్తీక్ 40, ఇసాన్ కిషన్ 34 పరుగులు)
ఢిల్లీ డేర్‌డెవిల్స్: 19.4 ఓవర్లలో 197/8(శ్రేయస్ అయ్యర్ 96, కరుణ్ నాయర్ 30, కమ్మిన్ 24 పరుగులు)

Comments

comments