Search
Thursday 15 November 2018
  • :
  • :

గన్ కల్చర్

Gun-image

పుట్టినరోజు వేడుకల్లో ప్రయోగాలు
లైసెన్సు లేకుండా పెరుగుతున్న వినియోగం
కూరగాయల వ్యాపారి గాల్లోకి కాల్చిన వైనం..
గన్‌తో మెట్రో స్టేషన్‌లోకి ప్రవేశించేందుకు యత్నం..అరెస్టు

మన తెలంగాణ/ సిటీబ్యూరో
పాత నగరంలో పుట్టిన రోజు వేడుకల్లో ఓ యువకు డు అందరూ చూస్తుండగానే ఆనందోత్సాహంతో పిస్తోల్‌తో గాలిలోకి కాల్పులు జరిపాడు. నగర శివారులో మౌలాలీ హౌసింగ్ బోర్డు ప్రాంతంలో కూరగాయల వ్యాపారి తనతోటి వ్యాపారులను హెచ్చరించడం కోసం గన్‌ను తీసుకువచ్చి కాల్చేందుకు యత్నించాడు. పిస్తోల్‌తో ఉప్పల్ మెట్రో స్టేషన్‌లోకి ప్రవేశించబోతున్న వ్యక్తిని స్టేషన్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ఇలా నగరంలో కూరగాయల వ్యాపారి నుంచి మొదలు యువకుల వద్ద కూడా గన్‌లు కనిపిస్తున్నాయి. గన్ ఓ ఫ్యాషన్, ప్రతిష్ట, గౌరవంగా భావిస్తున్నారు. కానీ, అది ఎప్పుడు ఏ అవసరానికి వినియోగిస్తారో తెలియని పరిస్థితి. ప్రస్తుతం నగరంలో గన్ సంస్కృతి రోజురోజుకూ పెరుగుతోంది.

ప్రాణహాని ఉన్నవారు గన్ లేదా పిస్తోలు, రివాల్వర్‌లను తీసుకోవడం పరిపాటి. ఇప్పుడు అలాంటిదేమి హానీ లేకున్నా పలువురు వాటి లైసెన్స్ తీసుకుని పొందుతున్నారు. అయితే, ఎవరైతే లైసెన్స్‌ను కలిగి ఉంటారో వారే ఆ గన్‌ను కలిగి ఉండాలనే కనీస బాధ్యతను విస్మరిస్తున్నారు. ఫలితంగా నేరం ఎప్పుడు ఏ రూపంలో జరుగుతుందో తెలియనిపరిస్థితి. ఇటీవల పుట్టినరోజు, ఉత్సవాలు, ఊరేగింపులు జరిగినా పిస్తోల్‌ను గాలిలోకి కాల్చడం హుందాగా, ఒక వినోదంగా, అందరిలో కేరింతలు కొట్టించడానికి ఉపయోగిస్తున్నట్టు పరిస్థితులు వెల్లడిస్తున్నాయి.

లైసెన్స్ లేకుండా? : ప్రస్తుతం నగరంలో లైసెన్స్ లేకుండా కూడా రహస్యంగా కొందరు కలిగి ఉంటున్నారనేది బహిరంగ రహస్యం. మౌలాలీ హౌసింగ్ ప్రాంతంలో కూరగాయల వ్యాపారి తన ఇంటిలో నుండి నాటుతుపాకీని తీసుకువచ్చి తన ప్రత్యర్థులుగా భావిస్తున్న వారిపై కాల్పులు జరిపేందుకు యత్నించాడు. అంతలోనే అక్కడే ఉన్న పోలీసు అధికారి అతడిని కట్టడి చేయడంతో అక్కడ ప్రత్యర్థులు ప్రాణాపాయం నుండి బయటపడ్డారు. అతడికి లైసెన్స్‌లేదు. ఇలా చాలా మంది ఉత్తర భారతదేశం నుండి ప్రధానంగా బీహార్, ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర ప్రాంతాల నుండి నగరానికి పలురకాల అవసరాలతో వచ్చిన వారివద్ద ఉంటాయనేది పలు సందర్భాల్లో వెల్లడైంది. నగరంలో సుఫారీ నేరాలు చేసే నేరస్థులు కూడా దేశీయ గన్‌లతో రంగంలోకి దిగుతున్నట్టు గతంలో జరిగిన కొన్ని సంఘటనలు స్పష్టంచేస్తున్నాయి.

గుర్తించలేని వ్యవస్థ : ముఖ్యంగా రైల్వే, బస్సు స్టేషన్‌లలో భద్రత వ్యవస్థలు డొల్లగా మారాయి. ఉత్తర భారత ప్రాంతాల నుండి వచ్చే వారు అధిక శాతం మంది రైళ్ళలోనే ప్రయాణిస్తుంటారు. అక్కడ మరణాయుధాలతో ప్రయాణించే వారిని గుర్తించడం లేదు. ఫలితంగానే వారు నేరుగా రైళ్ళలో వస్తుంటారనేది ప్రచారంలో ఉన్నది. మహారాష్ట్ర నుండి ఆయుధాలతో వచ్చే వారిని టోల్‌గేట్ల వద్దనే కనిపెట్టే విధంగా ఏర్పాట్లు లేకపోవడం వల్ల ఆయుధాలు నగరంలోకి ప్రవేశిస్తున్నది బ హిరంగ రహస్యం. రైళ్ళు, బస్సులు, టోల్‌గేట్ల ప్రాంతాల్లో ఆ యుధాలు ఉన్న వాహనాలను గుర్తించేలా చర్యలు అవరసరమని పలువురు సూచిస్తున్నారు. లైసెన్స్‌లున్న వారి వద్దనే మారణాయుధాలుండే వీలుంటుందనేది వారి అభిప్రాయం.

Comments

comments