Home నిజామాబాద్ సరిహద్దు ప్రాంతాల నుంచి గుట్కా అక్రమ రవాణా

సరిహద్దు ప్రాంతాల నుంచి గుట్కా అక్రమ రవాణా

gutka

*ఉమ్మడి జిల్లాలో
జోరుగా వ్యాపారం
*చోద్యం చూస్తున్న
అధికార యంత్రాంగం

మనతెలంగాణ/నిజామాబాద్ బ్యూరో
కామారెడ్డి జిల్లా సరిహద్దు ప్రాంతమైన జుక్కల్ నియోజకవర్గం నుండి అక్రమంగా కర్నాటక రాష్ట్రం ఔరంగాబాద్‌కు గుట్కా, జర్దా, తంబాకు ప్యాకెట్లను జుక్కల్ పోలీసులు దాడులు నిర్వహించి పట్టుకోవడంతో మరోసారి గుట్కా వ్యాపారం గుట్టు చప్పుడు కాకుండా జరుగుతుందని వెల్లడైంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గుట్కా వ్యాపారం కొన్నాళ్ల క్రితం వరకు యథేచ్ఛగా కొనసాగగా ప్రసార మాధ్యమాలలో వచ్చిన వార్తలతో అధికార యంత్రాంగం అనేక దాడులు నిర్వహించి అక్రమ రవాణా చేస్తున్న పలువురిని అరెస్టు చేయడంతో సద్దుమణిగినట్లు కన్పించించింది. ఇటీవల జుక్కల్ పోలీసులు గుట్కా వ్యాపారులను అరెస్టు చేయడంతో, గుట్కా అక్రమ వ్యాపారం కొనసాగుతునే ఉందని తేటతెల్లమైంది. గతంలో మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల నుం చే జిల్లాలోకి గుట్కా ప్యాకెట్లను గుట్టు చప్పుడు కాకుండా తెచ్చి పలు వ్యాపారస్తులకు విక్రయించేవారు. అయితే పోలీసు ఉన్నతాధికారులు కింది స్థాయి అధికారులకు గట్టి సూచనలు ఇవ్వడంతో కొన్నాళ్లు ఈ వ్యాపారం నిలిచిపోయిందని భావించారు. పోలీసుల పర్యవేక్షణ తగ్గిపోవడంతో వ్యాపారం మళ్లీ ప్రారంభం అయినట్లు తెలుస్తు ంది. గతంలో అధికార పార్టీ ముఖ్య  నేత ఒకరు గుట్కా వ్యాపారానికి చక్రవర్తిగా చలామణి కాగా విమర్శలు రావడంతో, ప్రస్తుతం ఆ నాయకుడు గుట్కా వ్యాపారం పట్ల ఆసక్తి కనబరచడం లేదని సమాచారం. ఆ నాయకునికి రాష్ట్ర స్థాయి పదవి కట్టబెట్టడంతో విమర్శలు రాకుండా జాగ్రత్త పడుతున్నారని, ఎక్కడ గుట్కా స్వాధీనం జరిగిన తన పేరు వెల్లడి కావడంతో అతను పూర్తిగా గుట్కా వ్యాపారానికి స్వస్తి పలికాడని తెలిసింది. జుక్కల్‌లో పోలీసులకు పట్టుబడిన గజానంద్, శ్రీనివాస్‌లు నిజామాబాద్ పట్టణానికి చెందిన వారు కావడంతో నిజామాబాద్ కేంద్రంగా గుట్కా దందా తిరిగి ప్రారంభమైందా అని పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గుట్కా, తంబాకు, పాన్ మసాల అక్రమ వ్యాపారమంతా కర్నాటక, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలైన మద్నూర్, బిచ్కుంద, జుక్కల్ ప్రాంతాల నుండి జరుగుతుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ప్రాంతం రెండు రాష్ట్రాలకు సరిహద్దు కావడంతో వ్యాపారానికి ఎలాంటి అవాంతరాలు ఎదురు కావానే ఉద్దేశంతో ఇక్కడి నుంచి అక్రమ దందా కొనసాగిస్తున్నారని తెలుస్తుంది.
అక్రమ వ్యాపారస్తులు నగర శివారులోని గోదాములలో ఇప్పటికీ నిల్వలు చేసి ఉంచినట్లు సమాచారం. సంబంధిత అధికారులు నామమాత్రం దాడులతో సరిపెట్టుకుంటు న్నట్లు తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు మాత్రం ప్రతినెల మామూళ్లతో సరిపెట్టుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఉమ్మడి జిల్లాలలో గుట్కా అందుబాటులో లేని కిరాణా, పాన్, హోటల్‌లలో లేవని చెప్పరాదు. అక్రమ గుట్కా రవాణాతో వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయల్లా నడుస్తుంది. ప్రాణాంతక వ్యాధుల బారిన పడదారని తెలిసినా కఠినమైన చర్యలు చేపట్టక పోవడం కొసమెరుపు.