Home స్కోర్ ఓదార్పు దక్కింది

ఓదార్పు దక్కింది

team-ausఐదోవన్డేలో టీమిండియా విజయం   మనీశ్‌పాండే అజేయ శతకం   రాణించిన రోహిత్, శిఖర్    4-1తో ఐదువన్డేల సిరీస్ ఆసీస్ సొంతం
ఆసీస్ గడ్డపై వరుస పరాజయాలతో డీలా పడిపోయిన టీమిండియాకు టీ-20 సిరీస్ ముందు ఓదార్పు విజయం దక్కింది. మనీశ్‌పాండే అద్భుత ఇన్నింగ్స్‌కు తోడు రోహిత్‌శర్మ, శిఖర్‌ధావన్ సూపర్ ఫామ్‌ను కొనసాగించడంతో సిడ్నీలో జరిగిన చివరి వన్డేలో ఆరువికెట్ల తేడాతో నెగ్గి వైట్‌వాష్‌ను తప్పించుకుంది.

సిడ్నీ: ఎట్టకేలకు ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా బోణీ కొట్టింది. బ్యాట్స్‌మెన్ భారీస్కోరు చేస్తున్నా తొలినాలుగు వన్డేల్లో ఓటమిపాలైన ధోనీసేన ఐదోవన్డేలో ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 331 పరుగుల లక్షాన్ని టీమిండియా మరో రెండు బంతులు మిగిలిఉండగానే నాలుగే వికెట్లు కోల్పోయి చేధించింది. ఓపెనర్లు రోహిత్‌శర్మ(108 బంతుల్లో 99, 9×4, 1×6), శిఖర్‌ధావన్(56 బంతుల్లో 78, 7×4, 3×6) తొలివికెట్‌కు 123 పరుగులు నెలకొల్పి జట్టు విజయానికి గట్టి పునాది వేయగా, ఫామ్‌లో ఉన్న రహానె గాయపడడంతో తుది జట్టులో చోటు దక్కించుకున్న మనీశ్‌పాండే(81 బంతుల్లో 104 నాటౌట్, 8×4, 1×6) వీరోచిత శతకంతో టీమిండియాను విజయ తీరాలకు చేర్చాడు. అంతకుముందు ఆస్ట్రేలియా.. ఓపెనర్ డేవిడ్‌వార్నర్(113 బంతుల్లో 122, 9×4, 3×6), ఆల్‌రౌండర్ మిచెల్‌మార్ష్(84 బంతుల్లో 102 నాటౌట్, 9×4, 2×6) శతకాలు నమోదుచేయడంతో 50 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 330 పరుగులు చేసింది. భారత బౌలర్లలో సీనియర్ పేసర్ ఇశాంత్‌శర్మ, అరంగేట్ర పేసర్ జస్ప్రిత్ బుమ్రా రెండు వికెట్లు పడగొట్టగా, ఉమేశ్‌యాదవ్, రిషిధావన్ ఒక వికెట్ దక్కించుకున్నారు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన మనీశ్‌పాండేకు మ్యాన్ ఆఫ్‌ద మ్యాచ్ దక్కగా, రోహిత్‌శర్మకు మ్యాన్ ఆఫ్‌ద సిరీస్ లభించింది.
రోహిత్, శిఖర్ జోరు :
భారీ లక్షఛేదనకు దిగిన భారత్‌కు ఓపెనర్లు శిఖర్‌ధావన్, రోహిత్‌శర్మ శుభారంభం అందించారు. తొలి నాలుగు ఓవర్లు ఆచితూచి ఆడిన వీరిద్దరూ హేస్టింగ్స్ వేసిన ఐదోఓవర్ నుంచి జోరు పెంచారు. ఆ ఓవర్ తొలి బంతికే బౌండరీ కొట్టి బౌండరీల ఖాతా తెరిచాడు రోహిత్. ఆ తరువాత రోహిత్ వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు తరలించిన రోహిత్ ఎక్కువగా స్ట్రైక్ రొటేట్ చేయడానికే పరిమతం కాగా, మరో ఓపెనర రెచ్చిపోయాడు. ధావన్ వికెట్ల మధ్య వేగంగా కదులుతూనే సిక్సర్లు, బౌండరీలు బాదడంతో భారత్ పది ఓవర్లలోనే వికెట్ నష్టాపోకుండా 68 పరుగులు చేసింది. కొద్దిసేపటికే లియాన్ బౌలింగ్‌లో భారీ సిక్స్ తరలించిన ధావన్ 42 యాభై పరుగులు పూర్తిచేసుకున్నాడు. అర్ధశతకం తరువాత ధావన్ మరింత దూకుడుగా ఆడడంతో భారత్ వేగంగా లక్షం దిశగా సాగింది. అయితే ధావన్ దూకుడుకు హేస్టింగ్ చెక్‌పెట్టడంతో భారత్ 123 పరుగుల వద్ద తొలివికెట్‌ను కోల్పోయింది. కొద్దిసేపటికే ఛేజింగ్ మొనగాడు విరాట్ కోహ్లి(8) కూడా హేస్టింగ్ అవుట్ చేయడంతో భారత్ ఇబ్బందుల్లో పడ్డట్లు కనిపించింది.
మనీశ్ అద్భుత ఇన్నింగ్స్
రహానెకు గాయం కావడంతో చోటు దక్కించుకున్న మనీశ్ పాండే అందివచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. క్రీజులో కుదురుకున్న రోహిత్‌కు చక్కగా సహకరిస్తునే చెత్త బంతులను బౌండరీకి తరలించాడు. మరోవైపు వ్యక్తిగత 92 పరుగుల వద్ద షాన్‌మార్ష్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన రోహిత్ శతకానికి ఒక్క పరుగు దూరంలో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక ఇక్కడి నుంచి మనీశ్‌పాండే స్కోరుబోర్డును నడిపించే బాధ్యతలు తీసుకున్నాడు. ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న కెప్టెన్ ధోనీ పరుగులు చేయడానికి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నా రన్‌రేట్ పడిపోకుండా భారీషాట్లు ఆడాడు. ఈ క్రమంలో 38 బంతుల్లో అర్ధశతకాన్ని పూర్తిచేసుకున్న మనీశ్ మరింత బాధ్యతాయుతంగా ఆడి జట్టుకు ఓదార్పు విజయాన్ని అందించాడు.
వార్నర్, మిచెల్ శతకాలు
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు తొలిఓవర్‌లోనే షాకిచ్చాడు ఇశాంత్‌శర్మ. కాన్‌బెర్రాలో సెంచరీతో కదంతొక్కిన ఓపెనర్ ఫించ్‌ను ఇశాంత్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ స్మిత్(28), బెయిలీ(6), షాన్‌మార్ష్(7) ఎక్కువసేపు క్రీజులో నిలవకపోవడంతో 117కే నాలుగు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా తక్కువ స్కోరుకే పరిమితమయ్యేలా కనిపించింది. అయితే డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ శతకాలతో చెలరేగి భారీస్కోరు దోహదపడ్డారు. అప్పటి దాకా ఆసీస్‌ను భయపెట్టిన భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న ఈ జోడీ ఐదోవికెట్‌కు 118 పరుగులు జోడించింది. ఈ క్రమంలో బుమ్రా బౌలింగ్‌లో డబుల్స్ తీసి సరిగ్గా 100 బంతుల్లో మూడంకెల స్కోరు అందుకున్న వార్నర్ చివరికి ఇశాంత్‌శర్మకు దొరికిపోయాడు. అప్పటికి ఆసీస్ స్కోరు 39 ఓవర్లలో 235 పరుగులు మాత్రమే. చివరి 11 ఓవర్లలో మిచెల్‌మార్ష్ ఆకశామే హద్దుగా చెలరేగిపోవడంతో ఆసీస్ 330 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ ముందు ఉంచింది.