Home అంతర్జాతీయ వార్తలు బహుళ హెచ్ 1బిలకు గడ్డు కాలం

బహుళ హెచ్ 1బిలకు గడ్డు కాలం

visa

*దరఖాస్తులు తిరస్కరణకు గురికావచ్చని అమెరికన్ ఫెడరల్ ఏజెన్సీ హెచ్చరిక 

వాషింగ్టన్: బహుళ హెచ్- 1 బి దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉందని విదేశీ ఉద్యోగులను ఫెడరల్ అమెరికన్ ఏజెన్సీ హెచ్చరించింది. అలాంటి దరఖాస్తుల తనిఖీని తీవ్రతరం చేయనున్న ట్లు యుఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యుఎస్‌సిఐఎస్) సూచించింది. వలసేతర వీసాల దరఖాస్తులకు కొద్ది రోజుల ముందు ఈ హెచ్చరిక జారీ చేసింది. భారత టెక్కీలు వలసేతర వీసాలకు ప్రసిద్ధిగా పేర్కొంటారు. 2019 అక్టోబరు 1 నుంచి ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరానికి హెచ్-1 బి దరఖాస్తుల ప్రక్రియ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభ కానుంది. న్యాయమైన వ్యాపార అవసరం ఉంటే తప్ప హెచ్-1 బి వీసాకు బహుళ దరఖాస్తులు దాఖలు చేసినట్లైతే  లబ్ధిదారుడికి సమాచారం కోసం నోటీసు ఇచ్చి, ఆ దరఖాస్తులన్నింటిని తిరస్కరణ లేదా రద్దు చేస్తామని యుఎస్‌సిఐఎస్ తెలిపింది. ఒకే వ్యక్తి అనేక దరఖాస్తును దాఖలు చేయడం లాటరీ ప్రక్రియను దెబ్బతీస్తుందని పేర్కొంది. హెచ్-1 బి వీసాకు సంబంధించిన విధానపరమైన మార్గదర్శకాలను ఫెడరల్ ఏజెన్సీ జారీ చేసింది. అమెరికాలో  పనిచేసేందుకు  హెచ్-1 బి వీసాను తాత్కాలికంగా జారీ చేస్తారు. అమెరికన్  కంపెనీలలో పనిచేసేందుకు అర్హత గల వారు లేనప్పుడు,  విదేశాల నుంచి నిపుణులైన వారిని నియమించుకునేందుకు ఈ వీసాలను జారీ చేస్తుంది.