Home వరంగల్ 18న వరంగల్‌లో చేనేత సదస్సు

18న వరంగల్‌లో చేనేత సదస్సు

 

amrapali

హాజరుకానున్న జిల్లాల కార్మికులు
ఏర్పాట్లను పరిశీలించిన చేనేత, జౌళిశాఖ 

కమిషనర్ శైలజా రామయ్యర్, కలెక్టర్ అమ్రపాలి

మన తెలంగాణ/వరంగల్‌బ్యూరో : చేనేత కార్మికుల సదస్సు 18వ తేదీన వరంగల్‌లో ఏర్పాటు చేయనున్నారు. ఈ సదస్సుకు ఉమ్మడి వరంగల్ జిల్లాతోపాటు ఉమ్మడి ఖమ్మం, యాదాద్రి జిల్లాలకు చెందిన కార్మికులు వరంగల్ సదస్సుకు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర చేనేత, జౌళిశాఖ కమిషనర్ శైలజా రామయ్యర్ వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ కాట అమ్రపాలితో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. చేనేత సదస్సుకు పెద్ద ఎత్తున కార్మికులు వస్తున్నందున పూర్తిస్థాయిలో ఏర్పాట్లు  చేయాలని కలెక్టర్ అమ్రపాలి జిల్లా చేనేత, జౌళిశాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం శైలజా రామయ్యర్, కలెక్టర్ అమ్రపాలి హన్మకొండలోని సర్కూట్ గెస్ట్‌హౌజ్‌లో సదస్సు ఏర్పాట్లపై సమీక్షించారు. కార్మికుల సదస్సు జరిగే వెంకటేశ్వర గార్డెను సందర్శించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను  చేనేత కార్మికులకు వివరించేందు కోసం ఎల్‌ఇడి స్క్రీన్స్ ద్వారా ప్రదర్శించుటకు వీలుగా  సాంకేతికపరమైన ఏర్పాట్లు  ముందుగానే పూర్తి చేయాలని, విద్యుత్తు అంతరాయం ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని డైరెక్టర్ శైలజా రామయ్యర్ సంబంధిత అధికారులకు సూచించారు. సదస్సులో ప్రజెంట్ చేయడానికి శాఖపరమైన నివేదికను రూపొందించాలని చేనేత, జౌళిశాఖ అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో చేనేత, జౌళిశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, డిప్యూటీ డైరెక్టర్‌లు నారాయణ, రతన్, ఎడి-శ్రీనివాస్, సమాచార పౌర సంబంధాలశాఖ ఉప సంచాలకులు డిఎస్. జగన్, డెవలప్‌మెంట్ అధికారి సంపత్, ఎడిఒ -రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.