Home లైఫ్ స్టైల్ జాతి మెచ్చిన నేతలు

జాతి మెచ్చిన నేతలు

జాతి మెచ్చిన నేతలు   ప్రకృతి రంగుల పులకింతలు 

రాష్ట్రానికి చెందిన ఆరుగురు నేతన్నలు 2016 సంవత్సరం జాతీయ అవార్డులకు ఎంపికయ్యారు. యాదాద్రి జిల్లా,  సంస్థాన్‌నారాయణపురం మండలం పుట్టపాకకు చెందిన గజం శ్రీనివాస్, చేరిపల్లి భువనారుషి, నల్లగొండ జిల్లా చండూరుకు చెందిన గంజి యాదగిరి, చిలుకూరు శ్రీనివాస్, కొండగట్ల భావనా రుషి, యాదాద్రి భువనగిరి జిల్లా , కొయ్యలగూడెంకు చెందిన జెల్ల వెంకటేశంలకు ఈ అరుదైన గౌరవం దక్కింది. 

Saree

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తెలంగాణ చేనేత వస్త్రానికి జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం గ్రామానికి చెందిన చేనేత కళాకారుడు జెల్లా వెంకటేశంను కేంద్ర చేనేత మంత్రిత్వ శాఖ సంత్ కబీర్ -2016 పురస్కారానికి ఎంపిక చేసింది. టై అండ్ డై విధానంలో ఇక్కత్ చీరలు, తేలియా రుమాల్ వస్త్రాన్ని నేయడంలో నేర్పరిగా పేరుగాంచిన వెంకటేశంకు కేంద్ర చేనేత మంత్రిత్వ శాఖ ప్రకటించిన జాతీయ స్థాయి అవార్డు దక్కింది. సంత్ కబీర్ పురస్కారానికి ఎంపికిన చేసిన ఐదుగురిలో వెంకటేశం ఒకరు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌నారాయణపురం మండలం పుట్టపాక గ్రామానికి మరో సారి జాతీయ అవార్డుల పంట పండింది.

ఇక్కడి చేనేత కార్మికుల కళానైపుణ్యాన్ని చూసి భారత ప్రభుత్వం ఈ గ్రామానికి రెండు జాతీయ అవార్డులను ప్రకటించింది. ఇదివరకే రెండు పద్మశ్రీ అవార్డులు అందుకున్న పుట్టపాకకు చెందిన చెరుపల్లి భావణాఋషి, గజం శ్రీనివాస్ చేనేత జాతీయ అవార్డు-2016కు ఎంపికై ఈ మారుమూల గ్రామాన్ని మరోసారి జాతీయ స్థాయిలో నిలబెట్టారు. రసాయనాలతో కాకుండా ప్రకృతి సిద్ధమైన రంగులతో రకరకాల చీరలు తయారుచేస్తాడు. తేలియా రుమాల్, డబుల్ ఇక్కత్ చీర తయారు చేశాడు.

Saree1

ఈ చీరను జాతీయ స్థాయి అవార్డు కోసం ప్రతి పాదనకు పంపాడు. దీన్ని పరిశీలించిన కేంద్ర చేనేత జౌళి మంత్రిత్వ శాఖ 2016 సంవత్సరానికి గాను జాతీయ అవార్డుకు ఎంపిక చేసింది. పుట్టపాకకు చెందిన భావణాఋషి గత 40 సంవత్సరాలుగా చేనేత వృత్తిని నమ్ముకుని వస్త్రాలు నేస్తూ జీవనం సాగిస్తున్నాడు. 3వ తరగతి చదువుకున్న ఇతను పదవ ఏటనుంచే చేనేత ప్రారంభించాడు. ఈయన రూపొందించిన డిజైన్లకు గాను 2013 సంవత్సరం హ్యాండ్లూం అవార్డుకు ఎంపికయ్యాడు. డబుల్ ఇక్కత్‌లో గుజరాత్ నవరత్నాల డిజైన్‌లో చీరను రూపొందించినందుకు గాను 2016 నేషనల్ మెరిట్ అవార్డుకు ఎంపికయ్యారు. ఇలాంటి చీరలు నేయడానికి కనీసం మూడు నెలలైనా పడుతుందన్నారు. గుమ్మడి, తేలియా, బ్లాక్ ప్రకృతి రంగులు వాడి తయారు చేశాడు.

మనతెలంగాణ ప్రతినిధులు, సంస్థాన్ నారాయణ్‌పురం, చౌటుప్పల్, చండూరు.