Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

రామనామ స్మరణతో మార్మోగిన కొండగట్టు


Kondagattu

వేలాదిగా తరలివస్తున్న దీక్షాపరులు,  వ్యాపారులపై భక్తుల ఆగ్రహం 

మల్యాల : చిన్న హన్మాన్ జయంతి సందర్భంగా ఆంజన్న దీక్షాపరులు వేలాదిగా తరలిరావడంతో కొండగట్టు ఆలయ పరిసర ప్రాంతాలు రామనామ స్మరణతో మారుమ్రోగాయి. మంగళవారం హన్మాన్ జయంతిని పురస్కరించుకొని వివిధ జిల్లాల నుండి భక్తులు కాలినడకన స్వామి వారి సన్నిధికి చేరుకుంటున్నారు. కాగా సోమవారం రెండవ రోజు హన్మాన్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఆంజన్న దీక్షాపరులు మాల విరమణ చేయడానికి క్యూలైన్లలో బారులు తీరారు. మాల విరమణ సమయంలో భక్తులు అంజన్న సంకీర్తనలతో భజనలు నిర్వహించారు.

ఆదివారం సాయంత్రం వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అంజన్న దీక్షాపరులు స్వామి వారి సన్నిధిలో నిద్రించి సోమవారం వేకువ జామున స్వామి వారిని దర్శించుకోవడానికి కోనేటిలో పుణ్యస్నానాలు ఆచరించి క్యూలైన్లలో బారులు తీరారు. కొండగట్టు ఘాట్ రోడ్డు వెంబడి భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఆలయ పరిసర ప్రాంతాలు ఎక్కడ చూసినా కాషాయవర్ణంగా కనిపించింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు పర్యవేక్షించగా పోలీసులు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు.

వ్యాపారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన భక్తులు: వివిధ ప్రాంతాల నుండి భక్తులు స్వామి వారి దర్శనం కోసం స్వామి వారి సన్నిధికి రాగా భక్తులు సామాగ్రిని గదుల్లో ఉంచుకోవడానికి వ్యాపారి వద్దకు వెళ్ళి టిక్కెట్టు తీసుకోగా అక్కడ వ్యాపారి టిక్కెటుపై ఉన్న దానికంటే డబుల్ వసూలు చేశారు. ఇదేంటని భక్తులు వ్యాపారిని అడగగా సామానులు వెంటనే తీసుకెళ్ళాలని భక్తులపై దురుసుగా ప్రవర్తించారు. దాంతో భక్తులు ఆలయ ఇవో అమరేందర్‌కు ఫిర్యాదు చేయగా ఆ వ్యాపారిని మందలించాడు. మళ్ళీ ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే చర్యలు తీసుకుంటానని ఆయన హెచ్చరించారు.

తలనీలాల కోసం కొట్టుకున్న నాయీబ్రాహ్మణులు: వివిధ ప్రాంతాల నుండి మాల విరమణ చేయడానికి వచ్చిన భక్తులు తలనీలాలు సమర్పించడానికి నాయీబ్రాహ్మణుల వద్దకు వెళ్ళగా అక్కడ నాయీ బ్రాహ్మణులు నేను తీస్తానంటూ నేను ఒకరిపై ఒకరూ చేయి చేసుకున్నారు. భక్తుల వద్ద రూ.50 నుండి 100 వరకు వసూలు చేస్తున్నారు. దాంతో భక్తులు నాయీ బ్రాహ్మణులపై అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని వారు వాపోయారు.

Comments

comments