Home కరీంనగర్ అంబరాన్నంటిన సంబరాలు

అంబరాన్నంటిన సంబరాలు

KTRకరీంనగర్ : తెలంగాణ ప్రజలకు అతిముఖ్యమైన దసరా పండుగ, రాష్ట్ర ప్రభుత్వం పాలన వికేంద్రీకరణలో భాగంగా ఏర్పాటు చేసిన నూతన జిల్లాల ప్రారంభోత్సవాలకు ఒకే రోజు ముహూర్తం కావడంతో నూతనంగా అవతరించిన జిల్లాలో సంబరాలు అంబరాన్నంటాయి. పూర్వ కరీంనగర్ జిల్లానుంచి విడివడి నూతనంగా ఏర్పడిన జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాలు విజయ దశమి నుండి కొత్త పాలన కేంద్రాలుగా రూపుదిద్దుకున్నాయి. ఆయా జిల్లాల పరిధిలో దసరా పండుగను కూడా పక్కన పెట్టిన ప్రజలు పెద్ద సంఖ్యలో జిల్లా కేంద్రాల వద్దకు చేరుకుని నూతన జిల్లాల ప్రారంభోత్సవ వేడుకల్లో భాగస్వాములయ్యారు. జగిత్యాల జిల్లాను ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, పెద్దపల్లి జిల్లాను రాష్ట్ర ఆర్థిక పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్, రాజన్న జిల్లాను పురపాలక, ఐటీ శాఖల మంత్రి కె.తారక రామారావు ప్రారంభించారు. ప్రభుత్వం నిర్ణయించిన ముహుర్తానికి ఆయా జిల్లా కేంద్రాల వద్దకు చేరుకున్న మంత్రులు తొలుత జాతీయ పతాకాన్ని ఎగురవేసి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించి కొత్త జిల్లాలకు అంకురార్పణ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో కొత్త జిల్లాల ఏర్పాటు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఏకరువు పెట్టారు. పంచాయితీ సమితుల స్థానే మండల వ్యవస్థ అమలులోకి వచ్చిన నాలుగు దశాబ్దాల తరువాత జిల్లాల విభజనకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో గతంలో 57 మండలాలు ఉన్న కరీంనగర్ స్థానంలో 14 నుండి 15 మండలాలతో కూడిన కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. ఒక్కో జిల్లా పరిధిలో రెండు నుండి మూడు లక్షలకు మించకుండా కుటుంబాలు ఉండడంతో వారి వివరాలన్నింటిని సేకరించడానికి, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల దరిచేరడానికి వీలుపడే అవకాశం కలిగింది. నూతన జిల్లాల ఏర్పాటుతో పెద్దపల్లిలో ప్రజలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. పెద్దపల్లి పట్టణాన్ని పూలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. పట్టణంలో ప్రవేశించే పెద్ద కల్వల క్యాంపునుండి కలెక్టరేట్ వరకు రహదారి చుట్టుపక్కల భారీ ఎత్తున స్వాగత తోరణాలు ఏర్పాటుచేశారు. సుమారు 2 కిలోమీటర్లకు పైబడి సాంప్రదాయ, తెలంగాణ కళారూపాలతో భారీ ప్రదర్శన నిర్వహించారు. కలెక్టరేట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో చిన్నా రులు చేసిన నృత్య రూపకాలు పలువు రిని ఆకట్టుకున్నాయి. పెద్దపల్లి జిల్లా ప్రారంభ మయ్యే దుబ్బపెల్లి గ్రామం వద్దకు టిఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో చేరుకుని ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న మంత్రి ఈటెల రాజేందర్‌కు ఘనస్వాగతం పలికారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ముఖ్యమైన కూడళ్లన్నింటిని విద్యుత్ దీపాలు, పూలతో అలంకరించి శోభాయమానంగా తీర్చిదిద్దారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన పురపాలక శాఖామంత్రి కె.తారక రామారావును మానేరు వంతెన నుండి కలెక్టరేట్ వరకు ఊరేగింపుగా తీసుకువెళ్లారు. జగిత్యాలలో నూతన జిల్లా ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణాన్ని పుష్పాలు, విద్యుత్ దీపాలతో అలంకరించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీని ధరూర్ క్యాంప్ నుండి ద్విచక్రవాహనా లతో ఊరేగింపుగా కలెక్టరేట్ వరకు తీసుకువెళ్ళారు. ఆయా జిల్లాల పరిధిలోకి వచ్చే శాసన సభ్యులు, టిఆర్‌ఎస్ ముఖ్యనేతలు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో జిల్లా ప్రారంభోత్సవాల కార్యక్రమానికి హాజరయ్యారు. పోలీస్ కమిషనరేట్‌లు, నూతన రెవెన్యూ డివిజన్‌లు, మండలాలు, పోలీస్ స్టేషన్‌లను ప్రారంభించారు.