Home తాజా వార్తలు కింగ్ ఆఫ్ క్రికెట్ @ 30

కింగ్ ఆఫ్ క్రికెట్ @ 30

Happy Birthday Virat Kohli

న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ సోమవారం నాడు 30వ వసంతంలోకి అడుగుపెడుతున్నాడు. ఇప్పటికే ఎన్నో రికార్డులను కొల్లగొట్టిన కోహ్లీ ఫార్మాట్ ఎదైన తనదైన శైలిలో విరుచుకుపడుతున్నాడు. ప్రస్తుతం భీకరమైన ఫామ్ లో ఉన్న విరాట్  ప్రత్యర్థి బౌలర్లను కొరకరాని కోయ్యగా మారాడు. ఒకప్పుడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందుల్కర్ మీద ఎంతలా జట్టు ఆధారపడేదో ఇప్పుడు విరాట్ పై కూడా అదే విధంగా ఆధారపడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

కోహ్లీ క్రీజులో ఉంటే చాలు విజయంపై ధీమాగా ఉండొచ్చు. అంతలా క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటున్నాడు విరాట్. ఒకనొక సందర్భంలో సచిన్ కు ఎదురైన ప్రశ్న.. మీ రికార్డులు అందుకునే తరువాతి తరం క్రికెటర్లు ఎవరు? అని. దీనికి లిటిల్ మాస్టర్ ఇచ్చిన సమాధానం కోహ్లీ, రోహిత్. ప్రస్తుతం అదే జరుగుతుంది. కోహ్లీ, రోహిత్ లు రికార్డుల రారాజులుగా వెలుగొందుతున్నారు.

విండీస్‌తో ఇటీవల విశాఖలో జరిగిన రెండో వన్డేలో విరాట్‌ కోహ్లీ పది వేల పరుగుల మైలురాయిని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ ఫీట్ సాధించిన 5వ ఇండియన్ క్రికెటర్ కాగా, ఓవరాల్‌గా 13వ ఆటగాడు. అయితే వన్డేల్లో సచిన్‌ 259 ఇన్నింగ్సుల్లో పదివేల పరుగుల మార్కు అందుకుంటే, కోహ్లీ మాత్రం 205 ఇన్నింగ్స్‌ల్లో,  10 వేల పరుగుల మార్క్ అందుకుని రికార్డు సృష్టించాడు. అలాగే ప్రస్తుతం వన్డే, టెస్ట్ ర్యాంకింగ్స్‌లో నెం. 01గా కొనసాగుతున్నాడు.

ఇక పరుగుల యంత్రంగా పేరు తెచ్చుకున్న కోహ్లీ ఇవాళ్టితో 30 ఏట అడుగుపెడుతున్న సందర్భంగా కోహ్లీకి సహచరులు, బిసిసిఐ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు, సన్నిహితులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతు ట్వీట్లు చేస్తున్నారు.

‘30వ వడిలో అడుగుపెడుతున్న భారత కెప్టెన్ విరాట్ కోహ్లీకి జన్మదిన శుభాకాంక్షలు. మరిన్ని మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లు ఆడాలని కోరుకుంటూ రన్ మెషిన్ కోహ్లికి అభినందనలు’ అంటూ బిసిసిఐ ట్వీట్ చేసింది. భారత ఆటగాళ్లు మహేంద్ర సింగ్ ధోని, జడేజా, జస్ప్రిత్ బుమ్రాలు కోహ్లికి విషెస్‌ చెప్పిన ఓ వీడియోను కూడా ఈ సందర్భంగా బిసిసిఐ షెర్ చేసింది.

భారత మాజీ క్రికెటర్, డాషింగ్ ఓపెనర్ వీరెంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో కోహ్లీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘నేడు దంతేరాస్‌.. ఈ ఏడాదంతా నీకు రన్‌తేరాస్‌ కావాలని కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్‌డే విరాట్’అని వీరు ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.