Home ఆఫ్ బీట్ 2050 నాటికి మనిషి మనుగడే కష్టం!

2050 నాటికి మనిషి మనుగడే కష్టం!

Hard to humans will survive after 2050?

మొదటి ప్రమాదం హైదరాబాద్‌కే, లెక్కకు మించి వాహనాలు, చర్యలే నివారణకు మార్గమంటున్న పర్యావరణ వేత్తలు

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా కాలుష్యం కమ్ముకుంటోంది. పరిశ్రమలు, వాహనాలు లెక్కకు మించి వెదజల్లే కాలుష్యమే ప్రస్తుతం ప్రాణాంతకంగా మారిందని పర్యావరణ వేత్తలు పేర్కొంటున్నారు. పెరుగుతున్న వాహనాల సంఖ్య పలు అనర్థాలకు దారి తీస్తున్నాయని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాహనాల కాలుష్యం వలన వాతావరణంలో అనూహ్య మార్పులు జరుగుతున్నాయని పలు సంస్థలు ఇప్పటికే నివేదికలు ఇచ్చాయి. ఇదే పరిస్థితి కొనసాగితే 2050 నాటికి రాష్ట్రంలోని పలు పారిశ్రామిక వాడలతో పాటు పట్టణాలు ప్రమాదం అంచుకు చేరుతాయని గతంలో సస్టెయినబుల్ అనే సంస్థ చేసిన అధ్యయనంలో పేర్కొంది. సస్టెయినబుల్ అనే సంస్థ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి ఓ నివేదికను తయారు చేసింది. ఈ సర్వేలో వేరే దేశానికి చెందిన వారు సైతం పాల్గొని ఈ నివేదికను తయారు చేశారు. టిఎస్‌పిసిబి ఈ నివేదికపై ఒక ప్రణాళిక రూపొందించి దాని అమలుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. దీనికి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్రం అనుమతి అవసరం ఉండడంతో అది ముందుకు సాగడం లేదని పిసిబీకి చెందిన ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు.

రెట్టింపు అవుతున్న వ్యక్తిగత వాహనాలు
నగరంతో పాటు పలు పట్టణాల్లో వ్యక్తిగత వాహనాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. 5 సంవత్సరాల కాలంలో ఈ సంఖ్య మరింతగా పెరిగిందని రవాణాశాఖ చెబుతున్న లెక్కలను బట్టి అర్థమవుతోంది. నగరవాసుల జీవనవ్యయం పెరగడంతో పాటు, ప్రజా రవాణా వ్యవస్థ సక్రమంగా లేకపోవడం కూడా వ్యక్తిగత వాహనాలు పెరగడానికి కారణంగా తెలుస్తోంది. ఉద్యోగ, వ్యాపార కార్యాకలాపాల కోసం బయటకు వెళ్లే వారు ప్రజా రవాణా వ్యవస్థను ఆశ్రయించడం తగ్గుతోంది. దీంతో కాలుష్యం పెరిగి అంతిమంగా వాతావరణ మార్పులకు కారణం అవుతోంది. దీనికి తోడు విస్తరిస్తున్న పట్టణీకరణ పర్యావరణంపై తీరని ప్రభావం చూపుతోంది. ఇప్పటికే స్వచ్ఛమైన ప్రాణవాయువు కరువైన నగరంలో 2050 నాటికి ప్రాణాలు కాపాడుకోవాలంటే పక్క ప్రాంతాలకు పరుగులు తీయాల్సిన పరిస్థితి వస్తుందని ఆ సర్వే నివేదికలో పేర్కొన్నారు.

సైక్లింగ్ ట్రాక్‌లు, పాదచారుల కోసం ఫుట్‌పాత్‌లు
ఆ సర్వే నివేదికలో కాలుష్యం తగ్గించేందుకు సమగ్ర రవాణా ప్రణాళిక వ్యవస్థ అవసరమని పేర్కొన్నారు. పరిశోధనలో కాలుష్య కారకాలను గుర్తిస్తూ, నివేదికలో పరిష్కార మార్గాలను సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణంలో చోటు చేసుకుంటున్న అనూహ్య మార్పులకు వాహనాలు, పరిశ్రమలేనని గుర్తించారు. అలాంటి వాటివల్ల రోజురోజుకు తీవ్రమవుతున్న కాలుష్యాన్ని నియంత్రించడంలో చిత్తశుద్ధి కనిపించడం లేదు. నిర్లక్ష్యాన్ని ఇలాగే కొనసాగిస్తే హైదరాబాద్‌తో పాటు పలు పట్టణాల్లో నివాసయోగ్యత కష్టమేనని ఆ సంస్థ పేర్కొంది. వివిధ రూపాల్లో పర్యావరణంపై ప్రభావం చూపుతున్న అంశాలపై దృష్టి సారించి పరిష్కార మార్గాలను అన్వేషించాలని సర్వే నివేదిక సూచించింది. ముఖ్యంగా నేషనల్ అర్భన్ ట్రాన్స్‌ఫోర్ట్ పాలసీ 2006 (ఎన్‌యుటీపీ)లో వాహన కారక కాలుష్య నియంత్రణకు పట్టణాల్లో మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ (ఎఎంటీస్) అవసరమని సూచించింది. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని సమగ్ర రవాణా సౌకర్యాలు కల్పించాలని కాంప్రహెన్సీవ్ మొబైలిటీ ప్లాన్ (సీఎంపీ) కూడా స్పష్టం చేసింది. బహుళ రవాణా సౌకర్యాల కల్పనలో సైక్లింగ్ ట్రాక్‌లు, పాదాచారుల కోసం ఫుట్‌పాత్‌లు ప్రతిపాదించాలని నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారు.

లాభాపేక్షే ధ్యేయంగా పారిశ్రామిక వేత్తలు…
ఉద్యోగ, ఉపాధి కల్పించడానికి పరిశ్రమలు ఎంతగానే మేలు చేస్తాయి. అయితే ఆ పరిశ్రమలు ఎక్కువగా కాలుష్యం వెదజల్లేవే ఎక్కువగా ఉన్నాయని, పర్యావరణానికి మేలు చేసే పరిశ్రమల స్థాపనకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని పర్యావరణ వేత్తలు పిలుపునిస్తున్నారు. పారిశ్రామిక వేత్తలు లాభాపేక్షే ధ్యేయంగా పనిచేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఇలా అయితే భవిష్యత్ తరాలకు వ్యాధులను తప్పా ఏమీ అందించలేమని వారు వాపోతున్నారు. దేశ ఆర్థిక పురోగతికి దోహదపడుతున్న మెట్రోపాలిటన్ రీజియన్ల పరిధిలో ప్రజోపయోగ వాతావరణం అవసరమని పర్యావరణ ప్రేమికులు పేర్కొంటున్నారు. కాలుష్య నియంత్రణ సమగ్ర ప్రణాళికలు రూపొందించి వాటిని పక్కాగా అమలు చేయాల్సిన బాధ్యతకాలుష్య నియంత్రణ మండలిపై కూడా ఉందని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

5 సంవత్సరాల పాటు అధ్యయనం: దక్షిణ భారతదేశంలో జనాభా పెరుగుతున్న నగరాల్లో చూస్తే హైదరాబాద్ ప్రథమ స్థానంలో ఉంది. పట్టణీకరణ, పెరుగుతున్న వలసలు వలన పర్యావరణం దెబ్బతింటోంది. వసతుల కల్పన, అభివృద్ధి పేరిట కొనసాగుతున్న ప్రకృతి వనరుల విధ్వంసం మనుషుల మనుగడపై ప్రమాదం చూపుతోంది. కాలగమనంలో వస్తోన్న కాలుష్య మార్పులు ప్రమాద ఘంటికలను మోగిస్తున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే నాలుగు దశాబ్ధాల అనంతరం నగరంలో నివాసముండడం కష్టమని సర్వే నివేదికలు చెబుతున్నాయి. దీనిపై 5 సంవత్సరాల పాటు అధ్యయనం చేసి హైదరాబాద్ నగర భవిష్యత్ స్వరూపాన్ని నివేదిక రూపంలో ఆ సంస్థ రూపొందించింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి రానున్న రోజుల్లో పర్యావరణ రూపంలో అనేక కష్ట, నష్టాలను భరించాల్సి ఉంటుందని దాని నివారణకు ముందస్తుగానే చర్యలు చేపట్టాలని ఆ నివేదికలో పేర్కొన్నారు. పరిస్థితిలో మార్పు రాకున్నా, ప్రజల్లో అవగాహన పెరగకున్నా జరిగే అనర్థాలను ఎవరూ ఆపలేరని ఆ నివేదిక ముఖ్యాంశంగా పేర్కొన్నారు.