Search
Friday 21 September 2018
  • :
  • :

దొందూ దొందే

harish

రెండు జాతీయ పార్టీలూ తెలంగాణకు ద్రోహం చేస్తున్నాయి : బిజెపి, కాంగ్రెస్‌పార్టీలపై హరీశ్‌రావు ధ్వజం

మనతెలంగాణ/సిద్దిపేట ప్రతినిధి : బిజెపి, కాంగ్రెస్ రెండు జాతీయ పార్టీలు తెలంగాణకు ద్రోహం చేస్తున్నాయని, తెలంగాణ ప్రజలకు టిఆర్‌ఎస్ పార్టీయే శ్రీరామ రక్ష అని మరోసారి పార్లమెంట్ వేదికగా స్ఫష్టం అయిందని రాష్ట్ర భారీ నీటి పారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేటలో సోమవారం ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్లమెంట్‌లో జరిగిన అవిశ్వాస చర్చలో తెలంగాణకు న్యాయబద్ధ్దంగా రావాల్సి న  పలు అంశాలపై టిఆర్‌ఎస్ ఎంపి వినోద్‌కుమార్ ప్రస్తావించారని, కానీ  ప్రధాని మోడీ ఏదై నా మంచి మాట చెబుతారని ఆశించినా ఫలి తం దక్కలేదన్నారు. తల్లిని చంపి బిడ్డను బతికించారని మోడీ అనడంతో పాటు  తెలంగాణను పాకిస్తాన్‌తో ప్రధాని పోల్చడం తెలంగాణ ప్రజల మనోభావాలను ఎంతగానో దెబ్బతీసిందన్నారు. ప్రధాని మోడీ, ఎఐసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు చూస్తుంటే వారికి తెలంగాణ పట్ల ఎంత చిత్తశుద్ధ్ది ఉందో స్పష్టం అవుతుందన్నారు.బిజెపి కేంద్ర ప్రభుత్వంలో తెలంగాణ ప్రాంతానికి చెం దిన ఏ ఒక్క నాయకునికి మంత్రివర్గంలో పదవి ఇవ్వలేదని, అలాగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ( సిడబ్లుసి ) లో సైతం తెలంగాణ నాయకులకు చోటు కల్పించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. దీన్నిబట్టి చూస్తుంటే కాంగ్రెస్, బిజెపి రెండు జాతీయ పార్టీలు తెలంగాణను చిన్నచూపు చూస్తున్నాయని మంత్రి విమర్శించారు. నాడు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టిన టిడిపి పార్టీకి నేడు కాంగ్రెస్ పార్టీ తోక పార్టీగా మారిందన్నారు. అప్పులు ఆంధ్రాకు, ఆస్తులు తెలంగాణకు ఇచ్చారని టిడిపి ఆరోపణలు చేసినా తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నాయకులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. నిండు సభలో తెలంగాణ ప్రాంతం పట్ల వ్యతిరేకంగా మాట్లాడినా టిడిపి పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని కాంగ్రెస్ సమర్థించడం తెలంగా ణ ప్రజలను అవమాన పర్చడమేనన్నారు.సిడబ్లుసి సమావేశంలో ఆంధ్ర కు ప్రత్యేక హోదా కల్పిస్తామని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నాయకుల సమక్షంలోనే మాట్లాడుతుంటే తెలంగాణ నాయకులు స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రలో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చి తెలంగాణ ప్రాంత ప్రాజెక్టులకు మాత్రం మొండిచేయి చూపించిందని విరుచుకుపడ్డారు. రాత్రికి రాత్రే తెలంగాణలోని 7 మండలాలను ఆంధ్రలో కలిపి తెలంగాణకు ఆన్యాయం చేశారని గుర్తు చేశారు.ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణ ప్రాంతానికి అన్యా యం చేసినట్లేనని స్ఫష్టం చేశారు. విభజన సమయంలో కాంగ్రెస్, బిజెపిలు తెలంగాణకు అన్యాయం చేసి కూడా ప్రస్తుతం అదే వైఖరిని అవలంభిస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.టిడిపిఎంపి గల్ల జయదేవ్ మాట్లాడిన మాటలు తనను ఎంతగానో బాధకలిగించాయని ఎఐసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీ మాట్లాడడం ఏమిటని ప్రశ్నించారు.
తెలంగాణ ప్రజ లు పడుతున్న బాధలు రాహుల్ గాంధీకి కనబడటం లేదా అన్నారు. అధిష్టానాల వద్ద తమకు తామే రక్షించుకోలేని బిజెపి, కాంగ్రెస్ నాయకులు తెలంగాణ ప్రజల హక్కులను ఎలా సాధిస్తారో స్పష్టం చేయాలన్నారు. ప్రధాని మోడీ తెలంగాణ పట్ల వ్యవహరించిన తీరుపై రాష్ట్ర బిజెపి నాయకులు స్పందించాలన్నారు. తెలంగాణకు అన్యాయం చేస్తే ఆంధ్రకు మేలు జరుగుతుందన్న ధీమాలో కాంగ్రెస్ నాయకులు ఉన్నారన్నారు. ప్రాణాలు, పదవులను లెక్కించకుండా ఎన్నో పోరాటాలు చేసి ప్రత్యేక రాష్ట్రం సాధించిన సిఎం కెసిఆర్, టిఆర్‌ఎస్‌పైనే ప్రజలకు ఎంతో నమ్మకం ఉందన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు కూరమాణిక్యరెడ్డి, పాల సాయిరాంలు ఉన్నారు.

Comments

comments