Home తాజా వార్తలు కోటి మందికి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ…

కోటి మందికి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ…

harish-rao

సంగారెడ్డి: జిన్నారం మండలం బొల్లారంలో మిషన్ భగీరథ రిజర్వాయర్‌తో పాటు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు బుధవారం నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. 60ఏళ్ల నుంచి తెలంగాణ ప్రజలు మంచి నీటి కోసం బాధపడ్డారని మంత్రి స్పష్టం చేశారు. మిషన్ భగీరథలో భాగంగా ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తున్నామని పేర్కొన్నారు. జిన్నారం రైతన్నలకు కాళేశ్వరం నీళ్లు అందిస్తామని భరోసా ఇచ్చారు. దసరాలోగా ఇంటింటికీ మంజీరా నీళ్లు సరఫరా చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎంఎల్ఎ మహిపాల్ రెడ్డి ప్రజాప్రతినిధులతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడారు. రాబోయే 50 సంవత్సరాలను దృష్టిలో ఉంచుకొని పైప్‌లైన్లు వేస్తున్నమని హరీష్ రావు చెప్పారు. బొల్లారంలో మిషన్ భగీరథ కోసం రూ. 18 కోట్లు మంజూరు చేశామన్నారు. 10రోజుల్లో హైరిస్క్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నట్టు తెలియజేశారు. కళ్యాణమండపం కోసం ఎకరం స్థలంతో పాటు, కోటిన్నర నిధులను మంజూరు చేశామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో పరిశ్రమలకు 3 రోజులు పవర్ హాలీడే ఉండేదని మంత్రి గుర్తుచేశారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నదని ధీమా వ్యక్తం చేశారు. ఆసరా పెన్షన్లు పేదలకు బతకగలమనే హామీ ఇచ్చిందని తెలిపారు. సర్కార్ దవాఖానలను మెరుగుపరుస్తున్నామని వెల్లడించారు.  రైతుబంధు పథకంతో రైతన్నలకు ఎకరానికి రూ.8వేల పంట పెట్టుబడిని టిఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తుందన్నారు. జూలై నుంచి గ్రామాల్లో ఉండే ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించబోతున్నట్టు స్పష్టం చేశారు. కోటి మందికి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేస్తామని మంత్రి హరీష్ తెలిపారు.