Home మెదక్ మైనార్టీల సంక్షేమానికి కృషి: హరీశ్‌రావు

మైనార్టీల సంక్షేమానికి కృషి: హరీశ్‌రావు

Harish Rao Speech About Minorities Welfare

ముస్లిం పిల్లల ఉన్నత విద్య కోసం ప్రత్యేక చొరవ చేపడతాం
పార్థివ దేహం తరలించేందుకు ఆఖిరీ సఫర్ గాడీ మంజూరు
ఈద్గాలు, మజీద్‌ల మరమ్మతులకు రూ.2 కోట్లు, షాదీఖానాకు రూ.2 కోట్ల నిధులు మంజూరు
షాదీముబారక్ ద్వారా 260 మందికి రూ.1.30 కోట్లు అందజేత
 భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు

మన తెలంగాణ/మెదక్ టౌన్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముస్లీం సోదరుల ముఖాల్లో సంతోషం కనబడుతుందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. మంగళవారం మెదక్ పట్టణంలోని క్రిస్టల్ గార్డెన్‌లో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం తరపున పేద ముస్లీంలకు చీరలను పంపిణీ కార్యక్రమం నిర్వహించగా స్థానిక శాసనసభ్యురాలు, ఉపసభాపతి శ్రీమతి పద్మాదేవేందర్‌రెడ్డి, పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి మంత్రి హరీష్‌రావు మొత్తం 1250 పేద ముస్లీం మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ముస్లీం మైనారిటీల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. పేద ముస్లీంలు రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కెసిఆర్ దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. శాదీముబారక్ ద్వారా పేద ముస్లీం అమ్మాయిల వివాహానికి రూ.1లక్ష 116 లు అందజేసి ఆదుకోవడం జరుగుతుందన్నారు.

గతంలో ఆడపిల్ల పేరుపై శాదీముబారక్ చెక్కులను అందజేయడం జరిగేదని, ఇప్పుడు ఆడపిల్ల తల్లి పేరుపై చెక్కులను అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. ముస్లీంలు చనిపోయిన అనంతరం వారి పార్థివదేహాన్ని స్మశానానికి తరలించడానికి ఆఖిరి సఫర్ గాడీ (వైకుంఠ రథం) త్వరలోనే అందజేయడం జరుగుతుందని తెలిపారు. సిద్దిపేట నుండి ప్రతి సంవత్సరం ఐదు మంది పేద ముస్లీంలను ఉమ్రాకు పంపించడం జరుగుతుందని, ఈ సంవత్సరం నుండి మెదక్‌లో కూడా స్థానిక శాసనసభ్యురాలు పద్మాదేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఐదుగురి పేద ముస్లీంలను ఉమ్రాకు పంపించేందుకు మతపెద్దలు అర్హులను గుర్తించి ఎంపిక చేయాలన్నారు. అనంతరం డిప్యూటిస్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ… రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగాలని, పేద ప్రజలు అన్ని పండుగలను ఘనంగా నిర్వహించుకునేందుకు ప్రభుత్వం తరపున బీద ముస్లీంలకు చీరలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వాలు కేవలం మైనార్టిల పట్ల ఓటు రాజకీయాలతో కపటప్రేమ ప్రదర్శించేదని, కానీ తెలంగాణ సర్కార్ హయంలో ముస్లీంలకు అన్ని రకాలుగా వెన్నంటి ఉండి వారి పిల్లల ఉజ్వల భవిష్యత్తు కొరకై ఉన్నత విద్యలకై విదేశాలకు సైతం పంపుతున్న ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు.  మున్సిపల్ చైర్మేన్ మల్లికార్జున్‌గౌడ్, వైస్ చైర్మేన్ అశోక్, కలెక్టర్ ధర్మారెడ్డి, టిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు దేవేందర్‌రెడ్డి, ముస్లిం మతపెద్దలు ఆరీఫ్‌ఉస్సేన్‌తో పాటు కౌన్సిలర్లు సోహెల్, సలాం, అంకం చంద్రకళ, గోదల జ్యోతి, రాధగోవింద్, బట్టి సులోచన, కోఆప్షన్ సభ్యులు సాధిక్, కమీషనర్ సమ్మయ్యతో పాటు పెద్ద సంఖ్యలో ముస్లీం మహిళలు పాల్గొన్నారు.