Home తాజా వార్తలు చంద్రబాబు ఊసరవెల్లి

చంద్రబాబు ఊసరవెల్లి

Harish rao speech against TDP party in Hyderabad

తెలంగాణ వ్యతిరేకి చంద్రబాబు
తెలంగాణ నాశనం కోరుకునే వ్యక్తి
మనకు రావాల్సిన విద్యుత్ ఇవ్వలేదు
వేర్పాటు విఫలంగా చూపే ఎత్తుగడ
19 అంశాలతో చంద్రబాబుకు బహిరంగ లేఖ రాస్తున్నా : హరీశ్

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ వ్యతిరేకి అయిన చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయడం పట్ల ప్రజలకు అభ్యంతరాలున్నాయని అపధ్దర్మ మంత్రి, టిఆర్‌ఎస్ నేత టి.హరీష్‌రావు అన్నారు. నరనరాన తెలంగాణ వ్యతిరేకతను పెంచుకున్న చంద్రబాబు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ది చెందకుండా ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో గురువారం ఎంపిలు బూర నర్సయ్యగౌడ్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, శాసనమండలి ఛీఫ్ విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి, ఎంఎల్‌సి శ్రీనివాస్‌రెడ్డి, టిఆర్‌ఎస్ నాయకులు దేవిప్రసాద్, గట్టు రామచందర్‌రావులతో కలిసి ఎపి సిఎం చంద్రబాబు నాయుడుకు 19 అంశాలతో రాసిన బహిరంగ లేఖను మంత్రి హరీష్‌రావు విడుదల చేశారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ, తెలంగాణ నాశనం కావాలని కోరుకునే చంద్రబాబు, తెలంగాణ రాజకీయాలలో వేలుపెట్టడం, తెలంగాణలో పోటీ చేస్తామని అనడం దొంగే తాళం చెవి డిమాండ్ చేస్తున్నట్లు ఉందని విమర్శించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావద్దని బలంగా కోరుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు అని పేర్కొన్నారు. గతంలో కేంద్రంలో బిజెపితో కలిసి ఉన్ననాడు రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్న వ్యక్తి చంద్రబాబు అని చెప్పారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో కూడా చివరి నిమిషం వరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరుగకుండా ప్రయత్నించారని మండిపడ్డారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా దీన్ని ఒక విఫల రాష్ట్రంగా చేయాలని సర్వశక్తులు ఒడ్డిన వ్యక్తి చంద్రబాబు అన్న విషయం రాష్ట్రం ప్రజలకు తెలుసని అన్నారు. చివరికి ఆయన తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా రాజకీయ అస్థిరత సృష్టించడానికి ప్రయత్నించారని ఆరోపించారు. తెలంగాణ ప్రాంతం పట్ల, తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ అభివృద్ది పట్ల, తెలంగాణ మనుగడ కొనసాగించడం పట్ల నరనరాన వ్యతిరేకతను పెంచుకున్న చంద్రబాబు, టిడిపి తెలంగాణలో పోటీ చేయడం పట్ల తెలంగాణ ప్రజలకు చాలా తీవ్రమైన అభ్యంతరాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇక్కడ నాలుగు సీట్లు రాజకీయంగా తమ ఉనికి చాటుకోవడం ద్వారా ఈ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బకొట్టి, ఎపి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు ఒక దారి దొరుకుతుందనే కుట్ర మీ పొత్తులో, టీడిపి తెలంగాణలో పోటీ చేయడంలో తెలంగాణ ప్రజలకు కనిపిస్తుందని అన్నారు.

చంద్రబాబు నాయుడు రంగులు మార్చే విధానం చూసి ఊసరవెల్లులు కూడా సిగ్గుపడతాయని హరీష్‌రావు అన్నారు.పాలమూరును దత్తత తీసుకుంటానని, పాలమూరును అభివృద్ది చేస్తానని చెప్పి, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సిఎంగా ఉన్న సమయంలో పాలమూరురంగారెడ్డి ప్రాజెక్టు కోసం ధర్నా చేసిన చంద్రబాబు, తాను ఎపి సిఎం అయ్యాక మాట మార్చి అదే ప్రాజెక్టును అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉంటుందా..? అని ప్రశ్నించారు. మహాకూటమి నేతలకు పాలమూరు ప్రజలను ఓట్లు అడిగే హక్కు ఉందా..? అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి అనుమతులు వస్తే, అనుమతులు లేవని చంద్రబాబు కేంద్రానికి లేఖలు రాయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని నిలదీశారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణకు న్యాయబద్దంగా ఇవ్వాల్సిన విద్యుత్ ఇవ్వలేదని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మొదట్లో తెలంగాణకు కరెంట్ ఇవ్వకపోతే ఇక్కడి ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడతారని చంద్రబాబుకు తెలుసు అని పేర్కొన్నారు. రాష్ట్రంలో చిమ్మ చీకట్లు ఏర్పడి రైతులకు కరెంట్ రాక, ఫ్యాక్టరీలు మూతపడి ఇక్కడ ప్రజలు బాధపడాలనే కుటిలతత్వం చంద్రబాబు లోపల ఉందని ఆరోపించారు.

తెలంగాణలో కరెంట్ లేదు, పరిశ్రమలన్నీ ఎపికి రండి అనేటటువంటి కుట్రతోనే విభజన చట్టంలో తెలంగాణకు న్యాయం రావాల్సిన కరెంట్ ఇవ్వకుండా కుట్రలే చేశారన్నారు. ఆ కుట్రలను చేధించిన సిఎం కెసిఆర్ రాష్ట్రానికి విద్యుత్ వెలుగులు తెచ్చారని అన్నారు. సిఎం కెసిఆర్ గొప్పతనం, ముందుచూపు, విజన్ వల్ల దేశానికి విద్యుత్ విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని వ్యాఖ్యానించారు. ఇన్ని తప్పులు చేసిన చంద్రబాబునాయుడు ప్రాయశ్చితం ప్రకటించకుండా మళ్లీ తెలంగాణలో పోటీ చేయడానికి వస్తున్నాడని మండిపడ్డారు. తాను చేసిన ద్రోహాల పట్ల తెలంగాణ ప్రజలకు చంద్రబాబు క్షమాపణ కూడా చెప్పలేదన్నారు. తాము చేసిన పాపాలను భవిష్యత్తులో చేయము, కేంద్రానికి రాసిన లేఖలను ఉపసంహరించుకుంటున్నాం, ఆరోపణలను విరమించుకుంటున్నామని టిడిపి కానీ, ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కానీ ఒక్క మాటన్నా చెప్పా రా..? అని ప్రశ్నించారు. సాగునీటి విషయంలో, కరెంట్ విషయం లో, హైకోర్టు విభజన విషయంలో, హైదరాబాద్‌లోని ఆఫీసుల విషయంలో అడుగడునా తెలంగాణ ప్రజలను గోస పెట్టినటువంటి చంద్రబాబు ఇక్కడ ఎన్నికల్లో పాల్గొనడమనేది తెలంగాణ ప్రజలకు తీవ్ర అభ్యంతరకరమని అన్నారు.

టిడిపితో కలిసి అంటగాగాలని, ఆ పార్టీతో కలిసి పోటీ చేయాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు ద్రోహ చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉందో లేదో తమకు తెలియదని, కానీ చంద్రబాబు లాంటి మేక వన్నిన పులుల విషయంలో ప్రజలకు అప్రమత్తంగా ఉం చాల్సిన బాధ్యత తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమకారుడిగా, తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రజాప్రతినిధిగా తమపై ఉం దని తాము భావిస్తున్నామని చెప్పారు. ముఖ్యమైన 19 అంశాలను చంద్రబాబు ముందు పెడుతున్నామని, వీటికి జవాబు చెప్పి తెలంగాణలో ప్రచారానికి రావాలని డిమాండ్ చేశారు.

మంత్రి హరీష్‌రావు ఎపి సిఎం చంద్రబాబునాయుడుకు రాసిన బహిరంగ లేఖలోని అంశాలు
ద్రోహం నెం. 1. నీటి పారుదల ప్రాజెక్టులను అడ్డుకోవాలిన కుట్రలు చేయడం లేదా..?
ద్రోహం నెం. 2. పాలమూరు కడతానని 2014 ఎన్నికల్లో మీరు హామీ ఇవ్వలేదా..?
ద్రోహం నెం. 3. కాళేశ్వరం ప్రాజెక్టుపై విషం చిమ్మడం మీ దుష్ట ఆలోచన కాదా.?
ద్రోహం నెం. 4. పాలేరుకు నీళ్లివ్వడం కూడా పాపమేనా..?
ద్రోహం నెం. 5. కెసి కెనాల్ కోసం తుమ్మిళ్ల వద్దంటారా..?
ద్రోహం నెం. 6. కల్వకుర్తిపై కుట్రలు చేస్తున్నది నిజం కాదా..?
ద్రోహం నెం. 7. పోలవరానికి బదులుగా కృష్ణా నీళ్లు ఇవ్వకుండా నాటకాలు ఆడడం లేదా..?
ద్రోహం నెం. 8. శ్రీశైలం నుంచి తెలంగాణకు నీరివ్వొద్దనడం మీ కుతంత్రం కాదా..?
ద్రోహం నెం. 9. ఎవరి అనుమతితో కొత్త ప్రాజెక్టులు కడుతున్నారు..?
ద్రోహం నెం. 10. పోలవరం మండలాలు గుంజుకోవడం తెలంగాణకు చేసిన మొదటి అన్యాయం కాదా..?
ద్రోహం నెం. 11. సీలేరు పవర్ ప్లాంటు పోవడం వల్ల ఏడాదికి రూ.500 కోట్ల నష్టం చేయడం లేదా..?
ద్రోహం నెం. 12. విద్యుత్ పంపిణీ విషయంలో దుర్మార్గమైన వైఖరి అవలంభించలేదా..?
ద్రోహం నెం. 13. పిపిఎలను ఏకపక్షంగా రద్దు చేసి, 2465 మెగావాట్ల ఎగ్గొట్టలేదా..?
ద్రోహం నెం. 14. రూ.4557 కోట్ల నష్టం చేసిన కుటిలత్వం మీది కాదా.?
ద్రోహం నెం. 15. ఇవ్వాల్సిన కరెంట్ ఇవ్వకుండా, టెండర్లలో పాల్గొన్న కుంచితత్వం మీది కాదా..?
ద్రోహం నెం. 16. ఆంధ్ర ఉద్యోగులను రుద్ది రూ.వెయ్యి కోట్ల భారం మోపలేదా..?
ద్రోహం నెం. 17. ఖాళీ భవనాలు ఇవ్వకపోవడం మీ సంకుచితత్వం కాదా..?
ద్రోహం నెం. 18. హైదరాబాద్ ఆస్తుల్లో వాటా అడగడం మీ దురాశ కాదా..?
ద్రోహం నెం. 19. విభజన మాయని గాయం అని బాధ పడలేదా..?

Harish rao speech against TDP party in Hyderabad

Telangana Latest News